ఆస్తిలో 22 ఎకరాలను వీధి కుక్కల పేరిట రాయించాడు

ఆస్తిలో 22 ఎకరాలను వీధి కుక్కల పేరిట రాయించాడు

ఈ ఊళ్లో ఉన్న కుక్కలు ఆకలితో ఏనాడూ పడుకోవు. చెత్తలో తిండికోసం వెతకవు. ప్రతి రోజూ ఇంటి భోజనాన్ని మాత్రమే తింటాయి. అలాగని ఇవి పెంపుడు కుక్కలేం కాదు. అన్నీ వీధి కుక్కలే. ఈ ఊళ్లో ఉన్న కుటుంబాలన్నీ రోజుకో కుటుంబం చొప్పున ఆహారం తీసుకొచ్చి మూడుపూటలా ఇక్కడి కుక్కలకి పెడుతున్నారు. గుజరాత్‌లోని పంచోత్‌ అనే ఊళ్లో డెబ్భైకి పైగా వీధి కుక్కలుంటాయి. ఈ కుక్కల పేరిట22 ఎకరాల సాగు భూమి ఉంది. ఆ భూమి ధర ఇప్పుడు 77 కోట్లు పలుకుతుంది. అంటే ఒక్కో కుక్కకి దాదాపు కోటి రూపాయలు విలువచేసే ఆస్తి ఉందన్నమాట. కుక్కల పేరిట ఉన్న భూమిలో వ్యవసాయం చేసి, వచ్చిన డబ్బుతో వాటికి తిండి పెడుతున్నారు ఈ ఊరి ప్రజలు.    

జమీందార్‌‌ వల్ల

పంచోత్ ఊళ్లో 77 ఏండ్ల క్రితం ఛగన్‌భాయ్‌ పటేల్‌ అనే జమీందారు ఉండేవాడు. అతను చాలా ఇష్టంగా కుక్కల్ని పెంచుకునేవాడు. ఊళ్లో ఉన్న కుక్కలకి కూడా రోజూ తిండి పెట్టేవాడు. కుక్కల్ని పెంచుకోకపోయినా, వాటి ఆకలైనా తీర్చాలని అక్కడి ప్రజలకు చెప్తుండేవాడు. 60 ఏండ్లప్పుడు అనారోగ్యం పాలైన ఛగన్‌ ‘నేను లేకపోతే ఈ కుక్కలకి తిండి దొరకడం కష్టమవుతుంద’ని అనుకున్నాడు. అలా కాకుండా ఉండేందుకు తనకున్న ఆస్తిలో 22 ఎకరాల భూమిని వీధి కుక్కల పేరు మీద రాయించాడు. వీధి కుక్కల ఆకలి తీర్చినవాళ్లు ఈ భూమిని వాడుకోవచ్చని ఒక కండీషన్ పెట్టాడు. దాంతో అప్పటినుంచి ఊళ్లో జనాలు వంతులవారీగా కుక్కలకి అన్నం పెడుతున్నారు.    

ట్రస్ట్‌ నడుపుతూ...

గ్రామ పెద్దలంతా కలిసి వాటికి ఫుడ్​ పెట్టడానికి ట్రస్ట్​ ప్రారంభించారు. ఈ ట్రస్ట్‌ కుక్కలకున్న 22 ఎకరాల భూమిని వేలం వేస్తుంది. ఆ వేలంలో ఎవరైతే భూమిని దక్కించుకుంటారో వాళ్లు ఆ ఏడాది మొత్తం కుక్కలకి ఆహారం పెట్టాలి. ట్రస్ట్‌ కోసం ఒక బిల్డింగ్‌ కట్టారు. దాంట్లోనే కిచెన్ ఉంటుంది. ఇద్దరు వంట మనుషులు ప్రతి రోజూ 30 కిలోల ఫుడ్​ తయారుచేస్తారు. వాటికేదైనా జరిగితే ఈ ట్రస్ట్‌ సభ్యులే దగ్గరుండి ట్రీట్మెంట్‌ చేయిస్తారు. ఇదొక్కటే కాకుండా పక్షుల ఫుడ్​ కోసం పంటలోనుంచి 500 కిలోల వరకు పప్పుదినుసుల్ని తీసి పక్కన పెడతారు.