
ఒకేసారి వారం, పదిరోజులకు సరిపడా కూరగాయలు, మసాలాలు కొంటారు చాలామంది. కానీ, పచ్చిమిర్చి, నిమ్మకాయ, అల్లం లాంటివి కొన్ని రోజులకే పాడవుతాయి. అలాకాకుండా ఇవి రెండు నెలల పాటు నిల్వ ఉండాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే మొదట శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. మిర్చి తొడాలు మిర్చిలోని తేమని పీల్చుకుని అవి మెత్తబడేలా చేస్తాయి. అందుకే మిర్చి తొడాలు తీసి, గాలి చొరబడని డబ్బా అడుగున టిష్యూ పేపర్ వేసి మిర్చిని దానిపై పెట్టాలి. వాటిపైన టిష్యూ పేపర్ వేసి మూత పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేయాలి. పదిహేను రోజులకొకసారి టిష్యూ పేపర్ మార్చితే రెండు నెలల పాటు పచ్చిమిర్చి ఫ్రెష్‌గా ఉంటుంది. నిమ్మకాయల్ని కూడా మిర్చి మాదిరిగానే గాలి చొరబడని డబ్బాలో టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేయాలి. టిష్యూ పేపర్లో నిమ్మకాయలు చుట్టి జిప్ లాక్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టినా రెండు నెలల పాటు పాడు కావు. అల్లంను శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాలు ఆరబెట్టాలి. గాలి చొరబడని డబ్బాలో టిష్యూలో చుట్టి స్టోర్ చేయాలి.