ఈ కథలు పిల్లలే రాశారు. ముఖచిత్రంతో సహా...

ఈ కథలు పిల్లలే రాశారు. ముఖచిత్రంతో సహా...

‘తల్లి మనసు’ కథలో తల్లికి తిండి పెట్టకుండా ఇంటినుండి గెంటివేసిన రంగడికి గ్రామాధికారి యాభై కొరడా దెబ్బల శిక్ష విధిస్తానంటే, “నా కొడుకు కాలుకు ముల్లు గుచ్చుకున్నా నేను తట్టుకోలేను. కావాలంటే ఆ కొరడా దెబ్బలు నన్ను కొట్టండి” అని విలపించింది రాజమ్మ, “తల్లి మనసు ఇప్పటికైనా అర్థమయిందా? నీ తండ్రి చనిపోగానే నిన్ను కూడా వదిలేసి ఉంటే నీ బతుకు ఏమయ్యేది?” అని గ్రామాధికారి రంగడిని మందలించాడు. 

అడవిలో ఉన్న అందమైన అమ్మాయి లిల్లీని గోవిందుడనే రాజు పెళ్లాడతానంటాడు. ‘‘నన్ను పెంచిన తల్లి ఈ అడవే. ఈ అడవిని విడిచి బయటికి రాలేను. అందుకే నిన్ను పెళ్లి చేసుకోలేను” అన్నదామె. ఆ గోవిందుడు తన నివాసాన్ని అడవిలోకి మార్చుకొని లిల్లీని పెళ్లి చేసుకొని ప్రజారంజకమైన రాజ్యపాలన సాగించాడు. ఆసక్తికరమైన ఈ ‘వనమాలి’ కథ ‘‘దేవునిపల్లి బడి పిల్లల కథలు”లోనిది. తెలుగు భాషోపాధ్యాయిని నమిలికొండ సునీత ప్రధాన సంపాదకత్వంలో “జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- దేవునిపల్లి”లో 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు రాసిన కథలివి. ఈ సంపుటిలో 20 కథలున్నాయి. ఇందులో తొమ్మిది పర్యావరణానికే ప్రాధాన్యమిచ్చాయి.

అమెరికాలో ఉన్న సౌజన్యకు తెలంగాణలోని తన “ఊరు” గుర్తుకొస్తది. కోడికూత, అలుకుపూత, చుక్కల ముగ్గులు, కోయిల పాటలు, పెద్ద చెరువు చుట్టూ పొలాలు, మట్టివాసన, మహిళలు పాటలు పాడుతూ నాట్లు వేయడం, దాగుడు మూతలు, మక్క రొట్టె, ఎల్లిపాయ తొక్కు - అన్నీ యాదికొస్తయ్​. “ప్రకృతి ఒడి”లో సిరికొండ ఊరు చుట్టూ పచ్చని అడవి, గుట్టలు, సెలయేర్లు, పెద్ద వాగు, పక్షుల కిలకిలలు, నెమళ్ల నాట్యాలు. ఆ ఊరు ప్రకృతికి విడిది. “కానుక” కథ - చెట్లు మనకు కావలసిన పండ్లు కూరగాయలు ఆకుకూరలు పువ్వులు ఇస్తాయని, ఎన్నో జీవులు బాటసారులు సేదదీరడానికి  ఉపయోగపడుతాయని, పుట్టినరోజు సందర్భంగా చాక్లెట్లకు బదులుగా మొక్కలు ఇవ్వాలని చెప్తుంది. ‘‘మన ఊరు- మన చెట్లు” కథ - “మనం నాటే ప్రతి మొక్క మనకు జీవనాధారమై నిలుస్తుం”దని గ్రహించేలా చేస్తుంది. “మీరు ఈరోజు ప్రాణాలతో ఉన్నారంటే ఆ ప్రాణవాయువు ఇచ్చేది మేమే” అంటూ చెట్లు మనకు “కనువిప్పు” కలిగిస్తాయి.

ఒక చెట్టును ఒక వ్యక్తి నరకబోతే, ఆ చెట్టును ఆధారంగా చేసుకున్న పక్షులు, ఉడుతలాంటి చిన్న జీవులు, తేనెటీగలు ఆ వ్యక్తి కళ్లు తెరిపించడం ‘‘మధుర జ్ఞాపకం”. సంధ్య అనే అమ్మాయి చెట్టుతో చేసిన “చెలిమి”, ఆమెకు వచ్చిన ఆలోచన గ్రామస్తులు ఆ చెట్టును దేవతలా పూజించేలా చేసింది. “కాలుష్యం” కథలో ఆహార, జల, వాయు, భూ కాలుష్యాల గురించి, కాలుష్య నివారణ గురించి నలుగురు పిల్లల సంభాషణలుంటాయి.

ఇతర అంశాలతో కూడిన కథలలో... - పొలంలో మోకాళ్ల లోతు బురదలో నిలబడి కష్టపడి పని చేస్తున్న అక్కను చూసి, తనను పట్నంలో ఏ లోటూ లేకుండా చదివించడానికి అక్క చేస్తున్న “త్యాగం” గొప్పదంటూ కన్నీళ్లతో అక్క కాళ్లు కడుగుతుందో చెల్లి. 

‘‘నిన్ను నీవు నమ్ముకో. నమ్మకం కోల్పోకు. పట్టుదలతో కష్టాన్ని ఓడించు. ఎంత కష్టపడతావో అంత బలపడతావు” అని చెప్పిన నాన్న మాటల స్ఫూర్తిగా, ‘దృఢసంకల్పం’తో లక్ష్యాన్ని సాధించి సైనికుడవుతాడో కొడుకు. గుడి బయట స్పృహ కోల్పోయిన వృద్ధుణ్ని చూసి, ముఖంపై నీళ్లు చల్లి, 
కూర్చోబెట్టి, దేవునికై తెచ్చిన పండ్లు తినిపించి ‘మానవసేవే మాధవసేవ’ అని నిరూపించిన రమేశ్ ‘సేవాభావం’, డబ్బుతో పాటు గర్వం పెరిగి తనను నిర్లక్ష్యం చేసిన విజయ్​కి ప్రాణాపాయం ఎదురైనప్పుడు రక్తదానం చేసి కాపాడిన ఆనంద్ ‘సహృదయం’ ఉంటాయి.

‘తల్లి మనసు’ కథలో తల్లికి తిండి పెట్టకుండా ఇంటినుండి గెంటివేసిన రంగడికి గ్రామాధికారి యాభై కొరడా దెబ్బల శిక్ష విధిస్తానంటే, “నా కొడుకు కాలుకు ముల్లు గుచ్చుకున్నా నేను తట్టుకోలేను. కావాలంటే ఆ కొరడా దెబ్బలు నన్ను కొట్టండి” అని విలపించింది రాజమ్మ, “తల్లి మనసు ఇప్పటికైనా అర్థమయిందా? నీ తండ్రి చనిపోగానే నిన్ను కూడా వదిలేసి ఉంటే నీ బతుకు ఏమయ్యేది?” అని గ్రామాధికారి రంగడిని మందలించాడు. రంగడు తల్లి కాళ్లు పట్టుకున్నాడు. సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆనాటి నుండి తల్లిని ప్రేమగా చూసుకున్నాడు.

‘‘ఉపాధ్యాయుడు ఒక ఉద్యోగి మాత్రమే కాదు. సమాజ నిర్మాత. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేది, రాయిలాంటి మనుషులను శిల్పాలుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే” అని “గురువు” కథ ద్వారా గ్రహిస్తాం. తల్లిదండ్రులకు జ్వరం వస్తే పిల్లలు తోటపని, ఇంటి పనులు చేసి కొంత డబ్బు సమకూర్చుకొని వారికి వైద్యం చేయించడం “కృతజ్ఞత” కథలో చూస్తాము. అందరం విద్యావంతులమై, మన సమస్యలను మనమే సంఘటితంగా పరిష్కరించుకోవాలని “మార్పు” కథ తెలియజేస్తుంది. వృద్ధుల పట్ల బాధ్యతను సున్నితంగా తెలిపేది “మనిషి విలువ” కథ. ఇంకా మానవత్వమే మతం, చిన్నారి స్నేహం కథలున్నాయి.

“మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే సైనికులు తమ కుటుంబాలకు దూరంగా - కనురెప్ప మూయకుండా మనకోసం కాపలా కాస్తున్నారు”, “పచ్చని ప్రకృతిలో ఉండే స్వచ్చమైన గాలి, ఎంతో ఖరీదైన ఎ.సి. రూముల్లో కూడ ఉండదు”, “మనకు తెలియని విషయాల్ని ఇతరులు చెప్పినప్పుడు తెలుసుకోవడం గొప్ప లక్షణం”, “చెట్టును కాపాడడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే”, “సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే” వంటి మంచి మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి.

ఈ కథలు పిల్లలే రాశారు. ముఖచిత్రంతో సహా, కథలకు బొమ్మలు పిల్లలే గీశారు. ఇవి పెద్ద రచయితల కథలకు ఏమాత్రం తీసిపోవు. ముందుమాటలో సునీత ‘తొలి అడుగులు’ పేరుతో రాసిన పలుకులు ఆమె వినయాన్నే సూచిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయుల, అధ్యాపకుల, దాతల సహకారంతో ఈ పుస్తకం వెలుగులోకి రావడం అభినందనీయం. దేవునిపల్లి బడిపిల్లలు ఊరుకు పేరు తెచ్చారు. సమాజానికి స్ఫూర్తినిచ్చారు.

- ఎ. గజేందర్ రెడ్డి
9848894086