పేదల ఇండ్ల జాగలు గుంజుకుని నర్సింగ్​ కాలేజీ కడుతుండ్రు

పేదల ఇండ్ల జాగలు గుంజుకుని నర్సింగ్​ కాలేజీ కడుతుండ్రు
  •     ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారంటూ అనర్హులుగా చూపిస్తుండ్రు

గద్వాల, వెలుగు: గద్వాల టౌన్​లో పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి 2012 సంవత్సరంలో ఇచ్చిన జాగలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు లాక్కొని డబుల్​ బెడ్​ రూం ఇళ్లు, నర్సింగ్​ కాలేజీని  కడుతున్నారు. తమ జాగలు తీసుకోవద్దంటూ ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వం వినకపోవడంతో 300 మంది పట్టాదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఇండ్ల పట్టాలు గుంజుకొని నర్సింగ్ కాలేజీ కడతామంటే ఊరుకునేది లేదన్నారు. కోర్టును ఆశ్రయించిన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రిజర్వ్ చేయాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 

2012లో అప్పటి ఎమ్మెల్యే డీకే అరుణ హయాంలో నిరుపేదలైన దాదాపు1300 మందికి ఇండ్ల పట్టాలను ఇచ్చారు. గద్వాల టౌన్ సమీపంలోని దౌదర్ పల్లి దగ్గర సర్వే నంబర్లు 968, 969, 980, 983 నుండి 985 వరకు దాదాపు 37 ఎకరాలలో ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆ పట్టాలు లాక్కొని గతంలో డబల్ బెడ్ రూమ్ లు కట్టేందుకు ప్రయత్నం చేయగా లబ్ధిదారులు అడ్డుకున్నారు. అయినా వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని నమ్మబలికి ఆ స్థలంలో దాదాపు 560 పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టారు.

మిగతా పట్టాలు బోగస్ అని చెబుతూ వాటిని లాక్కొని నర్సింగ్ కాలేజీ కడుతున్నారు. దీనిపై లబ్ధిదారులు ప్రతిపక్షాలు, సీనియర్ సిటిజన్ ఫోరం హ్యుమన్​  రైట్స్ కమిషన్​ ను ఆశ్రయించారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పనులను స్టార్ట్ చేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లగా నర్సింగ్ కాలేజీ పనులను పై స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం స్టేటస్ కో ఎత్తి వేయడంతో పనులు జరుగుతున్నాయి.

పట్టాలు గుంజుకున్న వారికి మొండి చేయి 

గద్వాల టౌన్ లో 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.  పట్టాలు గుంజుకున్న వారికి, కోర్టుకు వెళ్లిన వారికి సైతం ఇండ్లు ఇవ్వడం లేదు. గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని, కిరాయి  ఇంట్లో ఉన్న ఇల్లు ఉందంటూ అన్ఎలిజబుల్ అని చెబుతున్నారన్నారు. ఇష్టానుసారంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎలిజబుల్ జాబితాను రెడీ చేశారు. డబుల్ బెడ్ రూమ్  ఇళ్ల వ్యవహారంపై నాలుగు రోజుల క్రితం గద్వాల టౌన్ లో వార్డు సభలు నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున  నిరసన వ్యక్తం  చేశారు. టెంట్లు కూల్చేసి, కుర్చీలు విసిరేసి ఆందోళన చేశారు.  

ఫైల్ నే మాయం చేశారు

పక్క ప్లాన్ ప్రకారం దౌదర్ పల్లి దర్గా దగ్గర ఉన్న ప్లాట్లను గుంజుకోవాలనే స్కెచ్ తో 2012 సంవత్సరంలో నిరుపేదలకు పంపిణీ చేసిన పట్టాల ఫైల్ నే మాయం చేసేశారు. ఆగ మేఘాల మీద నర్సింగ్ కాలేజీ కోసం శంకుస్థాపన చేశారు. పేదలు, ప్రతిపక్షాలు అడ్డుకున్న పట్టించుకోలేదు. నర్సింగ్ కాలేజ్ కట్టేందుకు వేరే చోట స్థలం అందుబాటులో ఉందని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. కేవలం ప్రతిపక్షాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ప్లాట్లను గుంజుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పేదలు ప్లాట్లు కూడా కొనుగోలు చేయలేరు

గద్వాల జిల్లాలో ముఖ్యంగా గద్వాల టౌన్ లో ప్లాట్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. గతంలో భూములను కొనుగోలు చేసి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోకపోతే భూ యజమానులకు అప్పటి ఎమ్మెల్యే కొంత సొంత డబ్బులు ఇచ్చి పేదలకు పట్టాలు పంచారు.

ప్రస్తుతం వాటిని లాక్కోవడంతో భవిష్యత్తులో వేలాదిమంది నిరుపేదలకు సొంతిళ్లు కలలు కలగానే మిగిలిపోనున్నాయి. స్థలాలు కొనుక్కొని ఇండ్లు కట్టాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడున్న ఇండ్ల జాగాలోనే ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇస్తే సొంతింటి కల నెరవేరుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. 

పట్టాలు గుంజుకున్న వారికి న్యాయం చేయాలి

పేదల పట్టాలు గుంజుకున్న వారికి డబుల్ బెడ్ రూములు ఇచ్చి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  - మోహన్ రావు సీనియర్ సిటిజెన్స్ ఫోరం అధ్యక్షుడు.