దేశ విదేశీ శక్తులతో చేతులు కలిపి.. నా ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నరు : మోడీ

దేశ విదేశీ శక్తులతో చేతులు కలిపి.. నా ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నరు : మోడీ
  •     గత ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదని ఫైర్   
  •     భోపాల్- న్యూఢిల్లీ వందేభారత్ ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాని

భోపాల్: కొంతమంది తన ఇమేజ్ ను దెబ్బతీయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇందుకోసం దేశవిదేశీ శక్తులతో చేతులు కలిపారని, వాళ్లకు సుపారీ ఇచ్చారని చెప్పారు. శనివారం మధ్యప్రదేశ్ భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ లో భోపాల్–న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ‘‘గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో బిజీగా ఉండేవి. మిడిల్ క్లాస్, పేద ప్రజలను పట్టించుకునేవారు కాదు” అని మండిపడ్డారు. ‘‘మేం మిడిల్ క్లాస్, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. ఇందుకు భారతీయ రైల్వేనే నిదర్శనం. సామాన్యులందరికీ అత్యాధునిక రైల్వే సౌలతులను అందుబాటులోకి తెచ్చాం” అని తెలిపారు.  

వందే భారత్ ట్రైన్లు.. సూపర్ సక్సెస్ 

మన దేశంలో కొత్త అభివృద్ధికి వందే భారత్ రైళ్లు నిదర్శనమని మోడీ అన్నారు. ఈ రైళ్లు సూపర్ సక్సెస్ అయ్యాయని, వీటికి  ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని చెప్పారు. వందే భారత్ రైళ్లతో కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని, డెవలప్ మెంట్ జరుగుతుందని తెలిపారు. ‘‘మన దేశ రైల్వేను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు 9 ఏండ్లుగా కృషి చేస్తున్నాం. 

900 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. రైల్వే ప్రయాణం ఇప్పుడు సురక్షితంగా, పరిశుభ్రంగా మారింది” అని చెప్పారు. గతంలో మధ్యప్రదేశ్ రైల్వేకు రూ.600 కోట్లే ఇవ్వగా, తాము రూ.13 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ మంగు భాయ్ పటేల్, సీఎం చౌహాన్ పాల్గొన్నారు. 

స్కూల్ పిల్లలతో కలిసి జర్నీ.. 

ఉదయం 9:30 గంటలకు మోడీ భోపాల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి కుషాభౌ ఠాక్రే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లారు. అక్కడ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. అనంతరం రాణి కమలాపతి రైల్వే స్టేషన్​లో వందే భారత్ ట్రైన్​ను ప్రారంభించారు. 300 మందికి పైగా స్కూల్ పిల్లలతో కలిసి రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు, రైల్వే స్టాఫ్ తో ఇంటరాక్ట్ అయ్యారు. భారతీయ రైల్వేపై నిర్వహించిన డ్రాయింగ్, ఎస్సే కాంపిటీషన్ ద్వారా స్టూడెంట్లను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. 

కాగా, ఇది 11వ వందే భారత్ ట్రైన్. భోపాల్ నుంచి ఢిల్లీకి 708 కిలోమీటర్లు 7:45 గంటల్లో చేరుకుంటుంది. శనివారం మినహా అన్ని రోజుల్లో నడుస్తుంది. ఉదయం 5:40 గంటలకు రాణి కమలాపతి స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:40 గంటలకు బయలుదేరుతుంది.