వీళ్లు డ్రోన్​ పైలట్స్​

వీళ్లు డ్రోన్​ పైలట్స్​

రెండు రోజల క్రితం హైదరాబాద్​లో... ‘యునైటెడ్ నేషన్స్ జియోస్పేస్ ఇన్ఫర్మేషన్​ కాంగ్రెస్’  మొదలైంది. అక్కడికి వచ్చిన కొందరి చేతిలో డ్రోన్ కెమెరాలు ఉన్నాయి. వాళ్లందరూ లైసెన్స్ ఉన్న డ్రోన్ పైలట్స్. వాళ్లలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. క్యూరియాసిటీతో,  కెరీర్ బాగుంటుందని, ఎంట్రప్రెనూర్ అవ్వొచ్చని...  డ్రోన్​ పైలట్ లైసెన్స్​ తీసుకున్నారు వీళ్లు. ఈ ఆరుగురూ  మన హైదరాబాద్​లోని తెలంగాణ స్టేట్ ఏవియేషన్​ అకాడమీలో డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ కోర్స్​ చేశారు. 

డ్రోన్​ సర్వే, మ్యాపింగ్, మైనింగ్, సైట్ అసిస్టెంట్, ఏరియల్ ఫొటోగ్రఫీతో పాటు వ్యవసాయంలో కూడా డ్రోన్ పైలట్స్ అవసరం చాలా ఉంది.  అందుకని ఈమధ్య చాలామంది ఈ కోర్సు నేర్చుకుంటున్నారు. డ్రోన్​ని... రిమోటెలి పైలటెడ్ ఎయిర్​క్రాఫ్ట్ (ఆర్​పిఎ) అని పిలుస్తారు. కారు,  బైక్ నడపాలంటే లైసెన్స్​ ఉండడం ఎంత ముఖ్యమో, డ్రోన్​ని ఎగరేయాలన్నా కూడా  పైలట్ లైసెన్స్ ఉండడం అంతే ముఖ్యం. అందుకని డ్రోన్​ పైలట్ సర్టిఫికెట్ కోర్సు చేయడం తప్పనిసరి. మనదేశంలో 31 సంస్థలు రిమోట్ డ్రోన్​ పైలట్ కోర్సు అందిస్తున్నాయి.  హైదరాబాద్​లో ఇలాంటి సంస్థలు  మూడు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 12 మంది మహిళా డ్రోన్ పైలట్స్​ ఉన్నారు. వీళ్లలో ఆరుగురు మన హైదరాబాద్​లోనే ట్రైనింగ్ తీసుకున్నారు. అంతేకాదు వీళ్లలో మన రాష్ట్రానికి చెందిన వాళ్లు ఇద్దరు ఉండడం విశేషం. 

మొదటిసారి పట్టుకుంది

హైదరాబాద్​కి చెందిన ప్రియదర్శిని సురేష్​​.. ఇండి యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​లో రీసెర్చర్​. మనదేశంలో మొదటిసారి  డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ డెలివరీ చేసే ప్రాజెక్ట్​కు పనిచేసింది. వికారాబాద్​లో డ్రోన్ల సాయంతో మెడిసిన్స్ కూడా అందించింది. అప్పుడే ఆమె మొదటిసారి డ్రోన్​ని పట్టుకుంది. దాన్ని గాల్లో ఎగరేయడం నేర్చుకుంది. డ్రోన్​ టెక్నాలజీ ఆమెకు బాగా నచ్చింది. దాంతో సర్టిఫికెట్ కోర్స్​ చేసి, డ్రోన్​ పైలట్ లైసెన్స్​ తెచ్చుకుంది. 

డ్రోన్ కంపెనీ పెట్టాలనే ఆలోచనతో..

హైదరాబాద్​లో ఉంటున్న అర్చనా పెండ్యాల  డ్రోన్ టెక్నాలజీ గురించి ఏ వార్త వచ్చినా ఆసక్తిగా చదివేది. భర్తకు ఎలక్ట్రికల్ వెహికల్స్ షాప్​ ఉంది. భర్తను చూసి తను కూడా సొంతంగా బిజినెస్ చేయాలనుకుంది. ఎంట్రప్రెనూర్​గా డ్రోన్​ బిజినెస్​లో రాణించాలనుకుంది. అందుకు డ్రోన్ పైలట్ లైసెన్స్​ తప్పనిసరి. దాంతో డ్రోన్ పైలట్ కోర్సు చేసింది ‘‘భవిష్యత్తు అంతా డ్రోన్స్​దే. అందుకని డ్రోన్​ కంపెనీ పెట్టాలనే ఆలోచన ఉంది’’ అని చెప్తోంది అర్చన. 

250 ఎకరాల పొలం చూసుకుంటోంది

గుంటూరుకు చెందిన జి. అనూషకు  ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇష్టం. పాలిటెక్నిక్​ చదివింది. కరోనా టైంలో జాబ్ పోవడంతో ఊళ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెట్టింది. ఎరువులు చల్లడం, పంటని గమనించడం వంటి పనులకు డ్రోన్ ఉపయోగించేది. దాంతో డ్రోన్​  పైలట్​ లైసెన్స్ కోసం అప్లై చేయమని వాళ్ల అంకుల్ సజెస్ట్ చేశాడు. హైదరాబాద్​లో ట్రైనింగ్ తీసుకుంది. లైసెన్స్​ ఉండడంతో అగ్రికల్చర్ కంపెనీలో డ్రోన్​ ఆపరేటర్​గా జాబ్ వచ్చింది.  అక్కడ 250 ఎకరాల పొలాన్ని  డ్రోన్ టెక్నాలజీ సాయంతో తను ఒక్కతే చూసుకుంటోంది. ఇంట్రెస్ట్​ ఉన్నవాళ్లకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్​ ఇవ్వాలి అనుకుంటోంది. 

రీసెర్చ్ కోసం..

ఛత్తీస్​గఢ్​కి చెందిన సునీతా చౌధురీ ఇక్రిశాట్​లో సైంటిస్ట్. పై చదువులకు అమెరికా వెళ్లి మనదేశానికి తిరిగొచ్చింది. ‘క్లైమేట్–స్మార్ట్ అగ్రికల్చర్​ ఫీల్డ్​’లో సిస్టమ్ అనలైజర్​గా చేరింది. రీసెర్చ్​ కోసం తరచుగా  డ్రోన్​లు ఉపయోగించేవాళ్లు. అయితే, వాళ్లలో లైసెన్స్ ఉన్న డ్రోన్ పైలట్ లేకపోవడంతో బయటినుంచి డ్రోన్ పైలట్స్​ని పిలిచేవాళ్లు. ప్రతిసారి వాళ్లకు వేల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. దాంతో ఆ  లైసెన్స్​ తెచ్చుకుంటే తనే డ్రోన్ పైలట్ కావొచ్చు అనుకుంది సునీత. ఇంకేం... టిఎస్​ఏఏలో కోర్సు చేసింది. ఇప్పుడు ఆమె తన రీసెర్చ్​ కోసం డ్రోన్ కెమెరాని వాడుతోంది.  అట్లనే డ్రోన్ టెక్నాలజీ మీద క్యూరియా సిటీతో పైలట్ కోర్సు చేసింది మరో అమ్మాయి భవతరణి బాలాజి. చెన్నైకి చెందిన ఈమె గుజరాత్​లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూని వర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. 

రెండొందలమందికి పైగా...

‘‘డ్రోన్ పైలట్ కోర్సు నేర్చుకునేం దుకు పదో క్లాస్​ పాస్ అయితే చాలు.  ఐదు రోజుల కోర్సు ఉంటుంది. ఫీజు: రూ. 48 వేలు. మొదటి మూడు రోజులు... డ్రోన్​​ని ఎలా ఎగరేయాలి? ఎంత ఎత్తులో ఎగరేయాలి? డ్రోన్ ఎలా పనిచేస్తుంది? అనే విషయాలు చెప్తాం. డ్రోన్​ని ఎగరేసేటప్పుడు ఏదైనా సమస్య వస్తే... రిపేర్ చేసుకునేలా ట్రైనింగ్ ఇస్తాం. అంతేకాదు  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్​ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గైడ్​లైన్స్ వివరంగా చెప్తాం. చివరి రెండు రోజులు డ్రోన్​ ఫ్లయింగ్ నేర్పిస్తాం. రెండేండ్ల క్రితం డ్రోన్ పైలట్ ట్రైనింగ్​ని మొదలుపెట్టాం. ఇప్పటివరకు దాదాపు 200 మంది పైలట్ లైసెన్స్​ పొందారు. వీళ్లలో మనరాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఉన్నారు’’.   
- రాహుల్ రెడ్డి, ఆపరేషన్స్ మేనేజర్, ఇన్​స్ట్రక్టర్, టిఎస్ఏఏ.

::: సంతోష్​ బొందుగుల