తరుగు పేరుతో దోపిడీ చేస్తున్రు.. కలెక్టర్ కు రైతుల ఫిర్యాదు

తరుగు పేరుతో దోపిడీ చేస్తున్రు.. కలెక్టర్ కు రైతుల ఫిర్యాదు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మార్కెట్ కు తెచ్చిన వడ్ల కొనుగోళ్లలో తరుగు పేరుతో మోసం చేస్తున్నారని కలెక్టర్ ఉదయ్ కుమార్ కు రైతులు ఫిర్యాదు చేశారు. గురువారం తెలకపల్లి మార్కెట్  యార్డ్, పీఏసీఎస్  కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ పరిశీలించారు. రైతులు చిన్నయ్య, ఈశ్వర్ లు కలెక్టర్ తో మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోయామని, తేమతో సంబంధం లేకుండా క్వింటాలుకు 5 కిలోల తరుగు తీస్తున్నారని చెప్పారు.

వెన్నపూస తెగులుతో పంట దిగుబడి తగ్గిందని, వచ్చిన పంటను మార్కెట్ కు తెస్తే తేమ శాతం పేరుతో అన్యాయం చేస్తున్నారని వాపోయారు. రాత్రి పూట పందులు దాడి చేస్తున్నాయని, పంటను కొనుగోలు చేయకుండా తిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  స్పందించిన కలెక్టర్​ నిబంధనల మేరకు తరుగు తీయాలని, తేమ శాతం కొంచెం పెరిగినా కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులకు టార్పలిన్లు అందించాలని సూచించారు. సివిల్ సప్లై ఆఫీసర్​ మోహన్ బాబు, డీఎం బాలరాజు, తహసీల్దార్  సబిత, రైతులు పాల్గొన్నారు.