గద్వాలలో కండువా కప్పుకుంటే క్వార్టర్, బీరు, బిర్యాని

గద్వాలలో కండువా కప్పుకుంటే క్వార్టర్, బీరు, బిర్యాని
  •     కండువా కప్పుకుంటే క్వార్టర్, బిర్యాని, రూ.5 వందలు

గద్వాల, వెలుగు : ఎన్నికల వేల వివిధ పార్టీల్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. లీడర్ స్థాయిని బట్టి డబ్బులు ఎర వేస్తూ చేరికలను వివిధ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. గ్రామ స్థాయి కార్యకర్తలు వచ్చి పార్టీ కండువా కప్పుకుంటే క్వార్టరు, బీరు, భోజనం పెట్టి రూ.500 నుంచి రూ.1000 ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిని ఆసరా చేసుకుంటున్న కొందరు మూడు పార్టీల్లో చేరుతూ సొమ్ము చేసుకుంటున్నారు.

గత కొన్ని రోజులుగా ప్రతిరోజు వందల మంది చేరుతున్నట్లు ఓ పార్టీ నేతలు సోషల్  మీడియాలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అధికార పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీలో ఉన్న వారికే మళ్లీ కండువాలు కప్పి ర్యాలీలు నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పాత లీడర్లకే కండువా వేసిన ఫొటోలను ప్రతిపక్షాలు సోషల్  మీడియాలో షేర్  చేస్తున్నాయి.

అసంతృప్తులే టార్గెట్..

అసంతృప్తి లీడర్లే టార్గెట్ గా చేరికలకు అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. గద్వాల మండలం జమ్మిచేడు విలేజ్ లో అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్  లీడర్లకు తాము అధికారంలోకి రాగానే జములమ్మ ఆలయ చైర్మన్  పదవి ఇస్తామని ఓ ప్రతిపక్ష పార్టీ చేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎంపీటీసీలు, సర్పంచ్​ ఎన్నికల ఖర్చు తామే భరిస్తామని హామీలు ఇస్తూ గ్రామ స్థాయి లీడర్లను చేర్చుకుంటున్నారు. మండల స్థాయి లీడర్లకు జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్  పదవుల పంపకాలు జరిగిపోయాయనే ప్రచారం జోరందుకుంది.

అధికారంలోకి రాకముందే అన్నీ చేస్తామంటూ ప్రచారం చేసుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ రోజు ఒక పార్టీ కండువాలు కప్పుకున్న వారు తెల్లారి మరో పార్టీలో ఆ మరుసటి రోజు ఇంకో పార్టీ కండువాతో కనిపించడం ఆసక్తిగా మారుతోంది. ఇటీవల గట్టు మండలం ఇందువాసి, గద్వాల మండలం కాకులారం, గోన్పాడు గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరారు. రెండు రోజుల తర్వాత వారేబీజేపీలో చేరారు.

లీడర్ ను బట్టి రేట్​ ఫిక్స్..

ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు చేరికలకు తెర లేపాయి. మూడు ప్రధాన పార్టీల లీడర్లు చేరికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇతర పార్టీ కార్యకర్తలు, లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు డబ్బులు ఎరగా వేస్తున్నారని అంటున్నారు. లీడర్ స్థాయిని బట్టి రూ.5 వేల నుంచి రూ.5 లక్షల వరకు రేట్లు ఫిక్స్  చేసి ఫలానా ఊరు నుంచి ఇంత మందిని తీసుకురావాలని చెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల మల్దకల్ మండలానికి చెందిన ఒక లీడర్  ఒక పార్టీలో చేరడానికి రూ.5 లక్షలు డీల్  కుదుర్చుకున్నారు.

ముందుగా రూ. 50 వేలు ఇచ్చాక, మిగిలిన రూ.4.50 లక్షలు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఆ పార్టీ లీడర్లతో వాగ్వాదానికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. లీడర్లతో పాటు వారి వెంట వస్తున్న వారికి సపరేట్ గా రూ.500 నుంచి రూ.1000 ఇస్తూ క్వార్టర్, భోజనాలు పెడుతున్నారని ఆయా పార్టీల్లో ప్రచారం జరుగుతోంది.