50 ఏండ్లు కాదు.. 50 రోజులు కూడా ఉండలేరు

50 ఏండ్లు కాదు.. 50 రోజులు కూడా ఉండలేరు
  • టెక్రియాల్​ డబుల్ బెడ్​రూమ్​ ఇండ్ల వద్ద కాంగ్రెస్​ ఆందోళన

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్ వద్ద కట్టిన డబుల్ ​బెడ్​ రూమ్​ఇండ్లలో 50 ఏండ్లు కాదు కదా, 50 రోజులు కూడా ఉండలేరని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సవాలు విసిరిన ఎమ్మెల్యే  నాణ్యత లేకపోవడం వల్లే ఇక్కడికి రాకుండా తప్పించుకున్నారని విమర్శించారు. సోమవారం టెక్రియాల్​డబుల్​బెడ్​రూమ్​ ఇండ్ల వద్ద కాంగ్రెస్ ​ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే రావాలని సవాలు విసిరిన షబ్బీర్​అలీ సోమవారం ఇక్కడికి వచ్చి, 2 గంటల పాటు ఉన్నారు. నాణ్యత లేని ఇండ్లను పరిశీలించారు. బెస్​మిట్​, గోడల పగుళ్లను చూపెట్టారు. అనంతరం రోడ్డుపై   రాస్తారోకో చేశారు. ఇండ్లు కట్టిన కాంట్రాక్టర్​ నుంచి పైసలు రికవరీ చేయాలని డిమాండ్​ చేశారు. ఇండ్లను కూల్చి, వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని కోరారు. డీసీసీ ప్రెసిడెంట్​కైలాస్​ శ్రీనివాస్​రావు, లీడర్లు ఇంద్రాకరణ్​రెడ్డి, గూడెం శ్రీనివాస్​రెడ్డి, చంద్రకాంత్​రెడ్డి, అశోక్​రెడ్డి పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం బీసీల జీవితాలతో ఆడుకుంటోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ ​నేత షబ్బీర్​అలీ విమర్శించారు. బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం కోసం అప్లయ్ ​చేసుకోడానికి అవసరమైన సర్టిఫికెట్ల కోసం వచ్చిన ప్రజలతో కలిసి సోమవారం కామారెడ్డి తహసీల్​ ఆఫీస్ ​ఎదుట  ధర్నా నిర్వహించారు. కాళ్లచెప్పులు అరిగేలా తిరుగుతున్నా.. వేల మంది దరఖాస్తుదారులకు ఇప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వలేదని వాపోయారు. మండే ఎండల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఆఫీసర్లు స్పందించి సకాలంలో పత్రాలు జారీచేయాలని కోరారు.