ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు :  సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామ శివారులో రెండు ఎకరాల భూమి అటవీశాఖదా.. రెవెన్యూ శాఖదా.. అనేది తేలకపోవడంతో ఆ భూమిలో ఇండ్ల పట్టాలు పొందిన 65 కుటుంబాలు ఆరేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాయి. సర్వే చేసి బార్డర్ సమస్య తేల్చాల్సిన ఇరు శాఖలు పట్టించుకోకపోవడంపై  సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

జరిగింది ఇదీ.. 

ఆరేండ్ల కింద మంబాపూర్ శివారు సర్వే నంబర్​ 8లో 65 మంది పేదలకు ఒక్కొక్కరికీ 60 గజాల చొప్పున రెవెన్యూ శాఖ ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చింది. అప్పట్లో ఈ భూమి ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని అటవీశాఖ..  తమ పరిధిలోకి వస్తుందని రెవెన్యూ శాఖ మధ్య సరిహద్దు లొల్లి నడిచింది. మొదటి నుంచి అటవీ శాఖ అధికారులు పేదలను ఆయా ప్లాట్ల జోలికి రానివ్వడం లేదు. ఈ భూమి ఎవరిదో తేల్చేందుకు ఆరేళ్ల కిందనే జాయింట్ సర్వేకు ఇరు శాఖలు అంగీకరించాయి. కానీ సర్వే చేయలేదు. ఈ క్రమంలో ఆ భూముల్లో ఏడాది కింద లబ్ధిదారులు మైసమ్మ గుడి నిర్మిస్తే అటవీ శాఖ ఆఫీసర్లు తొలగించారు. ఈ విషయమై మంబాపూర్ గ్రామస్తులంతా లబ్ధిదారులకు అండగా నిలిచి ఆందోళనలకు దిగడంతో అటవీశాఖ అధికారులు గుడిని పాత స్థలంలోనే ఉంచేందుకు అంగీకరించారు. అదే సమయంలో ప్లాట్ల లొల్లి కూడా జరగడంతో త్వరలో సర్వే చేసి భూ వివాదాన్ని పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది నెరవేరలేదు. ఇదిలా ఉండగా ఈ భూ సర్వే పనుల ఆలస్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. సరిహద్దు సమస్యను తీర్చేందుకు అటవీ, రెవెన్యూ శాఖలు ఎందుకు సర్వే పనులు చేయడం లేదనేదానికి ఓ పేరున్న ఫార్మా కంపెనీయే కారణమనే ప్రచారం జరుగుతోంది. ఆ భూమిని ఆ కంపెనీకి కట్టుబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ నడుస్తోంది.  ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి వెంటనే తమకు ఇచ్చిన ప్లాట్లలో పొజిషన్ చూపించాలని బాధితులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి 

ప్లాట్ల కోసం ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాం. రెవెన్యూ ఆఫీసర్లను అడిగితే అటవీశాఖ అధికారుల మీద చెబుతున్నారు. అటవీశాఖ అధికారుల దగ్గరికి పోతే ఆ భూమి మాది అంటున్నారు. వెంటనే పై ఆఫీసర్లు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి. 

– రాచమల్ల అరుణ, బాధితురాలు

త్వరలో పరిష్కారం

సర్వే నంబర్​ 8లో రెండెకరాల భూమి అటవీశాఖదిగా చూపిస్తోంది. రెవెన్యూ వాళ్లు తమది అంటున్నారు. ఈ వివాదాస్పద భూమిని జాయింట్ సర్వే చేయాల్సి ఉంది. సర్వే డిలే కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. 

- మంజిత్ సింగ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్

ముదిరాజులు ఆర్థికంగా ఎదగాలి

మెదక్​ (కౌడిపల్లి), వెలుగు: ముదిరాజ్ లు ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు.  ఆదివారం కౌడిపల్లి మండలం సదాశివపల్లి చెరువుపై హక్కులు కల్పించే సర్టిఫికెట్​ను ముదిరాజ్​ కులస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులు  మత్స్య సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా బలోపేతమయ్యేలా సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్​ ఆఫీసర్​ రజిత, స్థానిక సర్పంచ్ శోభ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, మాజీ సర్పంచ్ వీరయ్య,  వెంకటయ్య చెరువు అధ్యక్షుడు  రాయగిరి పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మునిపల్లి, వెలుగు : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బుసారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్​ మంతూరి స్వప్న శశికుమార్ అన్నారు. ఆదివారం ఎన్ఆర్ఈజీఎస్​ నిధులు రూ.15లక్షలతో పంచాయతీ భవనం, ఎస్డీఎఫ్​ నిధులు రూ.10లక్షలతో బుసారెడ్డిపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ​నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. కార్యక్రమంలో  గ్రామ ఉప  సర్పంచ్​ గడీల రమేశ్, మాజీ సర్పంచ్​ బేగరి నర్సింలు,  నాయకులు హఫీజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

బొంబుగుండేశ్వర విగ్రహావిష్కరణ

నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ పట్టణంలో బొంబుగుండేశ్వర విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, గొర్రెల మేకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబు మలిశెట్టి, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కిష్టయ్య మాస్టర్, ఔదాత్పూర్ పీఠాధిపతి మచ్చెందర్ మహారాజ్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గొల్ల కురుమల సంస్కృతి తెలియజేసేలా డప్పు చప్పుల్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోవింద్, నాయకులు ఓం ప్రకాశ్, నరేశ్​ యాదవ్, సతీశ్​ యాదవ్, విశ్వనాథ్ పాల్గొన్నారు. 

స్టేట్ స్విమ్మింగ్ చాంపియన్​షిప్ లో సిద్దిపేటవాసికి బంగారు పతకం

సిద్దిపేట రూరల్, వెలుగు : స్టేట్ స్విమ్మింగ్ చాంపియన్​షిప్ లో సిద్దిపేటవాసి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఆదివారం 
హైదరాబాద్​లోని  ఎల్బీ స్టేడియం స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించిన 5వ తెలంగాణ మాస్టర్స్ స్టేట్ లెవల్ స్విమ్మింగ్ చాంపియన్​షిప్ లో సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లికి చెందిన రెడ్డిమల్లె రాజు 50 మీటర్ల ఫ్రీ స్టయిల్ ఈవెంట్ లో బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి క్రీడలు వచ్చే నెలలో జరగనున్నాయి. రెడ్డిపల్లి రాజును స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరాం, సిమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బర్ల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి గుండి ప్రవీణ్, డీవైఎస్ఓ నాగేందర్, క్రీడ సంఘాల అధ్యక్షకార్యదర్శులు, కోచులు, క్రీడాకారులు అభినందించారు.

కుల వృత్తులకు ప్రభుత్వం పెద్దపీట

కోహెడ (బెజ్జంకి), వెలుగు : కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​అన్నారు. ఆదివారం మండలంలోని తోటపల్లి చెరువులో రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య కారుల ఆర్థికాభివృద్ధి కోసం ఏటా ప్రభుత్వం ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్​కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచులు నర్సింగరావు, శ్రీనివాస్, మొండయ్య, ఎంపీటీసీ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్​ రాజయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్​రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.