దమ్మాయిగూడలోని ఓ ఇంట్లో చోరీ.. 5 తులాల గోల్డ్ చోరీ

దమ్మాయిగూడలోని ఓ ఇంట్లో చోరీ.. 5 తులాల గోల్డ్ చోరీ

మేడ్చల్ జిల్లా : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. దమ్మాయిగూడ ఆర్ సీ ఎన్ క్లేవ్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు.. ఐదు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. 

విషయం తెలియగానే జవహర్ నగర్ పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

గొలుసు దొంగల కోసం పోలీసుల వేట 

గొలుసు దొంగల కోసం పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. నిన్న ఒక్కరోజే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు గంటల వ్యవధిలో దొంగలు రెచ్చిపోయారు. 7 చోట్ల  చైన్‌ స్నాచింగ్స్‌ కు పాల్పడ్డారు. గోలుసు దొంగల కోసం పోలీసులు అన్ని చోట్ల గాలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకాబంది నిర్వహించి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. చైన్ స్నాచర్ల ఫోటోలతో రోడ్లపై తనిఖీలు చేస్తున్నారు. ఫోటోల్లోని వ్యక్తులను గుర్తించినట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. 

బంజారాహిల్స్ లో తనిఖీలు

పెన్షన్ ఆఫీసు సర్కిల్ వద్ద బంజారాహిల్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 7 చోట్ల చైన్ స్నాచింగ్ కేసులు నమోదుకావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మాసబ్ ట్యాంక్ నుంచి పెన్షన్ ఆఫీసుకు వచ్చే రూట్ తో పాటు బంజారాహిల్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

2 గంటల్లో 7 చోట్ల చైన్ స్నాచింగ్స్ 

వృద్ధులను టార్గెట్‌గా చేసుకొని వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 24 తులాల బంగారాన్ని చోరీ చేశారు. పూలు కావాలి.. పాలు కావాలి.. ఇంటి అడ్రస్​ కావాలి  అంటూ వివిధ సాకులతో వృద్ధులకు దగ్గరగా వెళ్లి చైన్​ స్నాచింగ్స్​ కు పాల్పడ్డారు. నిన్న ఉదయం వేళ సిటీ పరిధిలో రెండే రెండు గంటల వ్యవధిలో 7 చోట్ల  చైన్‌ స్నాచింగ్స్‌ చేశారు. ఇక వరంగల్​ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలోనూ ఇదే తరహాలో ఒక చోరీ జరిగింది.  వరుస చైన్​ స్నాచింగ్స్​ నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. హైదరాబాద్​లో ఈ ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌ఫోన్‌ టవర్ల లొకేషన్స్‌, గతంలో ఇదే తరహా దొంగతనాలు చేసిన వారి సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.