పంద్రాగస్టు రోజు రాత్రే.. గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ

పంద్రాగస్టు రోజు రాత్రే..  గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ

ఎల్ బీనగర్, వెలుగు:   స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఓ గిరిజన మహిళను రాత్రిపూట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులు తీవ్రంగా కొట్టారు. హైదరాబాద్, ఎల్ బీనగర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ను రాచకొండ సీపీ చౌహాన్ సస్పెండ్ చేశారు. అయితే, మహిళపై దాడి చేసిన పోలీసులందరిపైనా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు బాధిత మహిళతో కలిసి గురువారం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లి తండాకు చెందిన వడ్త్య లక్ష్మి భర్త శ్రీను కొంతకాలం కిందట చనిపోయాడు. 

ఆమె హైదరాబాద్ వచ్చి తన ముగ్గురు పిల్లలతో కలిసి మీర్ పేట్, నంది హిల్స్ లో ఉంటోంది. స్థానికంగా ఇండ్లలో పని చేసుకుంటోంది. ఆమె పెద్ద బిడ్డకు ఈ నెల 30న పెండ్లి జరగాల్సి ఉంది. అయితే, ఈ నెల 15న దేవరకొండలోని బంధువుల ఇంటికి వెళ్లిన వరలక్ష్మి రాత్రి తిరిగి వస్తూ ఎల్బీ నగర్ లో బస్సు దిగింది. ఆటోలు, బస్సులు లేకపోవడంతో రోడ్డు పక్కన నిలబడింది. పెట్రోలింగ్ కు వచ్చిన ఎల్బీ నగర్ పోలీసులు వరలక్ష్మిని ప్రశ్నించారు. ఆమె వద్ద డబ్బులు కూడా ఉండటంతో అనుమానించి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎస్సై కూడా ఉన్నారని, తన బిడ్డ పెండ్లి కార్డును కూడా చూపినా వదలలేదని బాధితురాలు వెల్లడించింది.  తనను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించినందుకే.. ఎదురు మాట్లాడతావా అంటూ పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేసి కొట్టారని, పొద్దున ఆటోలో ఇంటికి పంపారని తెలిపింది.

  
పోలీస్ స్టేషన్ ముందు ధర్నా 

లక్ష్మిపై పోలీసుల దాడి విషయం తెలుసుకున్న గిరిజన, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు గురువారం బాధితురాలిని తీసుకుని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. గిరిజన మహిళను అక్రమంగా స్టేషన్ కు తీసుకువచ్చి, అకారణంగా కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయడమే కాకుండా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వారితో ఎల్బీ నగర్ ఏసీపీ జానకి రెడ్డి చర్చలు జరిపారు. ఫిర్యాదును తీసుకుని పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ధర్నాలో మాజీ మంత్రి రవీందర్ నాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ నాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్​ పాల్గొన్నారు. 

ఇద్దరిపై సస్పెన్షన్ వేటు 

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులిచ్చారు. బాధితురాలి నుంచి సమాచారం తీసుకుని ఎంక్వయిరీ చేస్తామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు.

3 లక్షలు, బంగారం తీసుకున్నరు 

15వ తేదీన నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ నాపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టాడు. బూటుకాలుతో తన్నాడు. ఎస్ఐ ఆదేశాలతో  హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, ఇంకో ముగ్గురు నన్ను కొట్టారు. తీవ్ర గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న నన్ను బుధవారం పొద్దున ఆటోలో ఇంటికి పంపారు. నా పిల్లలు డాక్టర్​ను తీసుకొచ్చి ట్రీట్​మెంట్ చేయించారు. నా దగ్గరున్న రూ. 3 లక్షల క్యాష్, గోల్డ్​ పోలీసులు తీస్కున్నరు. ఇంత జరిగినా ఎస్ఐపై మాత్రం పెద్దాఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.   ----- వడ్త్య లక్ష్మి, బాధిత మహిళ