కరోనాతో చర్చి ఫాదర్ మృతి.. అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

కరోనాతో చర్చి ఫాదర్ మృతి.. అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

తిరువనంతపురం: కరోనాతో చనిపోయిన ఓ చర్చి ఫాదర్ అంత్యక్రియలకు కొందరు స్థానికులు అడ్డుపడిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో ట్రీట్ మెంటూ తీసుకుంటూ ఈస్టర్న్ ఆర్థొడాక్స్ చర్చి ఫాదర్ కేజీ వర్గీస్ (77) చనిపోయారు. బైక్ యాక్సిడెంట్ తో ఆయనను ఆస్పత్రిలో చేర్చగా.. ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 3న (బుధవారం) మలముగల్ లోని స్మశాన వాటిక వద్ద వర్గీస్ ఖననం చేయాలని అనుకున్నారు. కానీ స్థానికులు వర్గీస్ మృత దేహాన్ని పూడ్చి పెట్టడానికి నిరాకరించారు.

కరోనా ప్రోటోకాల్ ప్రకారమే ఇలా చేస్తున్నామని వారిని ఒప్పించడానికి స్థానిక అధికార యంత్రాంగం ట్రై చేశారు. జిల్లా కలెక్టర్ నవ్ జ్యోత్ సింగ్ ఖోసా స్థానికులతో రెండు రౌండ్ల పాటు చర్చలు జరిపారు. కానీ నిరసనకారులు ఒప్పుకోలేదు. స్మశాన వాటిక దగ్గరకు మృత దేహాన్ని తీసుకురాగానే వందలాది మంది గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వర్గీస్ కుటుంబీకుల సమ్మతితో దహన సంస్కారాలపై నిర్ణయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీన బైక్ స్కిడ్ కావడంతో గాయపడిన ఫాదర్ వర్గీస్ ను పెరూర్కుడలోని గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలడంతో ఈ నెల 2వ తేదీ వరకు 43 రోజులపాటు ట్రీట్‌మెంట్ చేశారు. వర్గీస్‌కు కరోనా ఎలా సోకిందనేది హెల్త్ డిపార్ట్‌మెంట్‌ ట్రాక్ చేయలేకపోయింది. వర్గీస్ మృతి తర్వాత పెరూర్కుడ ఆస్పత్రిలోని 19 మంది డాక్టర్లు హాస్పిటల్‌లోనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.