రిజర్వ్ బలాలను రంగంలోకి దింపనున్న రష్యా

రిజర్వ్ బలాలను రంగంలోకి దింపనున్న రష్యా

ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న పోరులో రిజర్వ్ బలాలను రంగంలోకి దింపనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రిజర్వులో ఉన్నవారు, రక్షణ దళాల్లో పనిచేసిన అనుభవజ్ఞులు, ప్రత్యేక నైపుణ్యం గలవారిని సైన్యంలో చేర్చుకోబోతున్నట్లు తెలిపారు. దీంతో సుమారు 3 లక్షల మంది రిజర్వ్ లేదా మాజీ సైనికులు సైన్యంలో చేరే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా ఉక్రెయిన్కు మద్ధతిస్తున్న పాశ్చాత్య దేశాలను పుతిన్ గట్టిగా హెచ్చరించారు. పాశ్చాత్య దేశాలు హద్దులు మీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి రష్యా వద్ద చాలా ఆయుధాలున్నాయన్నారు. తమ ప్రజలను కాపాడుకునేందుుక అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామని తెలిపారు. రష్యా తన భూభాగాలను రక్షించుకోవడానికి రెండు మిలియన్ల బలమైన సైనిక దళాలను రంగంలోకి దింపనుందని చెప్పారు. 

తూర్పు ఉక్రెయిన్ లోని డోన్ బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని పుతిన్ తెలిపారు. అక్కడి ప్రజలు ఉక్రెయిన్ లో ఉండాలని కోరుకోవడం లేదన్నారు. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని వివరించారు.