మనం కోరుకున్న తెలంగాణ కాదిది

మనం కోరుకున్న తెలంగాణ కాదిది

నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా, ఆత్మ గౌరవం కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏడేండ్లుగా ఉద్యమ ఆకాంక్షలేవీ నెరవేరలేదు. ఏ లక్ష్యంతో స్వరాష్ట్రం కోసం పోరాడామో అది సాకారం కానేలేదు. అసలు ఇది మనం కోరుకున్న తెలంగాణ కానేకాదు.

స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలం తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని కొట్లాడినం. వలస పాలనలో జరిగిన అన్యాయాలపై మన ఆక్రందనలు. ఆవేదనను యావత్‌‌‌‌ దేశానికి తెలిసేలా గర్జించినం. బతుకమ్మ ఆడి, జైల్‌‌‌‌ భరోలు, రైల్‌‌‌‌ రోకోలు, ధర్నాలు, దిగ్బంధనాలు, వంటా‍‍ వార్పులు చేసి, ఆఖరికి ప్రాణ త్యాగాలూ చేసి తెలంగాణను సాధించుకున్నం. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉద్యమకారుల్లో ప్రొపెసర్ జయశంకర్ సర్, ప్రొపెసర్ కోదండరాంతో పాటు మరెంతో మంది తమ జీవిత కాలం రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. అయితే వట్టిగా ఉద్యమకారుల త్యాగాలతో కాదు.. రాజకీయ ప్రక్రియ ద్వారానే స్వరాష్ట్రం సాధ్యమనే కోణంలో తెలంగాణ ఉద్యమకారులంతా కలసి కేసీఆర్‌‌‌‌‌‌‌‌నే ముందుంచి ఆయనకే పెద్ద పీట వేశారు. అందరం కలలుగన్న తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌ కన్నా తెచ్చిన పార్టీగా ప్రజలు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటేసి, అధికారం కట్టబెట్టడం వారి బాధ్యత అనుకున్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గెలిపించి తెలంగాణ ముఖ్యమంత్రిని చేశారు. కానీ సీఎం అయ్యాక ప్రజల పట్ల అంతే బాధ్యతగా వ్యవహరించాల్సిన కేసీఆర్ అందుకు భిన్నంగా పరిపాలన సాగిస్తున్నారు.

ప్రజలెవరూ సంతోషంగా లేరు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు కేసీఆర్ తన వ్యక్తిగత భావాలను ప్రజలపై  రుద్దడం తప్ప, ఏడేండ్లలో ఎవరికీ న్యాయం చేయలేదు. స్వేచ్చ లేకుండా, అవినీతితో, కుటుంబ పాలనగా సాగించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి , కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా 4,600 స్కూళ్లను మూసేశారు. 1200 మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఆ అమరుల సమాచారం తెలియదని చెప్పి వారి కుటుంబాలను ఆదుకోలేదు. ఉద్యమంలో ఎంతోమంది అమాయకులపై కేసులు నమోదైతే ఆ కేసులను మాఫీ చేయకుండా తన కుటుంబ సభ్యుల మీద ఉన్న కేసులను మాత్రం మాఫీ చేయించుకున్నారు. నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఎంతో మంది యువత ఉద్యోగాలు రాక నిరాశతో ఆత్మ హత్యలకు పాల్పడడం బాధ కలిగిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో అప్పర్ మానేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని చెప్పే మీరు.. స్వరాష్ట్రం సాధించుకొని ఏడేండ్లు గడిచినా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదేం? ప్రాజెక్టుల్లోని నీళ్లను ఏపీ సీఎం జగన్‌‌‌‌ తోడుకెళ్తుంటే ఉదాసీనంగా వ్యవహరిస్తూ, ప్రశ్నిస్తున్న వారినే దూషించడం మీకు అలవాటైపోయింది. కరోనా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నా ఆరోగ్య శ్రీలో చేర్చలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టడంలో విఫలమయ్యారు.

పాట చిన్నబోయింది
తెలంగాణ ఉద్యమ పాట జంగ్ సైరన్ అయి కొట్లాటకు నెగడు రాజేసింది. బాధనంత గుండెల నుంచి గొంతులకు ఒంపుకొని చేసిన గానం ఉద్యమానికి ఊపిరులూది, ఢిల్లీకి కవాతు చేసింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పాట ఈనాడు చిన్నబోయింది. ఏడేండ్లు గడచినా రాష్ట్ర గీతాన్ని ప్రకటించలేదు. ఉద్యమ కాలంలో ఊరు, వాడను ఏకం చేసి ఉర్రూతలూగించిన అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ” అన్న గీతం రాష్ట్రీయ గీతం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించిన సీఎం కేసీఆర్​ చివరికి తెలంగాణ పాటనే అటకెక్కించారు.

గద్దె దించే రోజు వస్తది
తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లను, తరిమికొట్టిన నేల ఇది. అలుపెరుగని సుదీర్ఘ పోరాటంలో, అంగబలం, అర్థబలం, రాజ్యాధికారం కలిగి ఉన్న ఆంధ్రోళ్ల కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ఇది. ప్రజలను అంత నిర్లక్ష్యంగా నిర్దయగా చూడడం సరి కాదన్న విషయం కేసీఆర్ తెలుసుకోవాలి. ప్రజలకు మంచి చేసేలా పాలించాల్సిన కేసీఆర్.. దోపిడీదారులను ప్రోత్సహిస్తూ, అవినీతి పరులకు, భూకబ్జాదారులకు, ఆంధ్రా తాబేదార్లకు అండగా నిలుస్తున్నారు. ప్రతిపక్షాల నోర్లు మూయిస్తూ, మీడియాపై ఉక్కుపాదం మోపి, ప్రజాసంఘాలు, యూనియన్ల అస్తిత్వాన్ని లేకుండా చేసి నిర్భందాన్ని కొనసాగిస్తున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను  గద్దె దించే రోజు ఎంతో దూరంలో లేదన్న సంగతి మరచిపోవద్దని గుర్తు చేస్తున్న.

- పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్