
- టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్
- ఉద్యమంలో లేనోళ్లకే ‘పెద్దల’ సీట్లు..!
హైదరాబాద్ : రాజ్యసభ అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించింది. దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, హెటిరో పార్థసారధి రెడ్డిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో పార్టీ నేతలతో డిస్కషన్ చేసిన తర్వాత ముగ్గురు అభ్యర్థులను ఫైనల్ చేశారు కేసీఆర్. బండా ప్రకాశ్ రాజీనామాతో ఒక సీటు ఖాళీ అయింది. డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం ముగియడంతో మరో రెండ్లు సీట్లు ఖాళీ అయ్యాయి. సంఖ్యా బలం ఉండటంతో ఈ మూడు రాజ్యసభ సీట్లు TRSకే దక్కనున్నాయి. బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు రేపటిలోగా, మిగతా రెండు సీట్లకు ఈ నెల 24లోపు నామినేషన్ వేయాలి. తెలంగాణ ఉద్యమకారులను కాదంటూ ఈసారి ముగ్గురు వ్యాపారవేత్తలకే సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో కేుసీఆర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజికవర్గాల వారీగా చాలామంది సీట్లు ఆశించినా.. ఎవరికీ చాన్స్ రాలేదు. చివరివరకు ప్రకాష్ రాజ్ పేరు వినిపించినా ఆయనకు కూడా అవకాశం దక్కలేదు. ఉద్యమంలో లేనివారికే కేసీఆర్ పెద్దపీట వేశారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ కేసీఆర్ ఇలాగే చేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ చూస్తే..
దామోదర్ రావు గురించి..
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరుకు చెందిన దీవకొండ దామోదర్ రావు 1958 ఏప్రిల్ 1న జన్మించారు. దామోదర్ రావుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
దామోదర్ రావు ప్రస్తుతం నమస్తే తెలంగాణ పత్రిక ఎండీగా ఉన్నారు.
పార్థసారథిరెడ్డి..
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బండి పార్థసారథిరెడ్డి హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జన్మించిన పార్థసారథిరెడ్డి కందుకూరులో డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తూనే హెటిరో సంస్థను స్థాపించారు. తన సంస్థ ద్వారా దాదాపు పది వేల మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనే పార్థసారథిరెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు.
వద్దిరాజు రవిచంద్ర ..
వద్దిరాజు రవిచంద్ర 1964, మార్చి 22న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో జన్మించారు. ఈయనకు భార్య విజయలక్ష్మి, కూతురు గంగా భవాని, కుమారుడు సాయి నిఖిల్ చంద్ర ఉన్నారు. గాయత్రి రవిగా ఫేమస్ అయిన వద్దిరాజు రవిచంద్ర ఖమ్మంకు చెందిన గ్రానైట్ వ్యాపారి. ఈయన 2018లో వరంగల్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
మరిన్ని వార్తల కోసం...