
అదో మారుమూల కుగ్రామం. చుట్టూ అడవి… మధ్యలో 34 గుత్తికోయ కుటుంబాలు. ఆ ఊరికి వెళ్లాలంటే.. సుమారు ఐదు కిలోమీటర్లు కాలి నడకన, వాగులు.. వంకలు దాటాలి. గుట్టలెక్కాలి. అందుకే అక్కడి వాళ్లంతా చదువుకు దూరమయ్యారు. అలాంటి వాళ్లకు భవిష్యత్తు మీద ఆశ కల్పిస్తూ.. ఓ స్కూల్ మొదలుపెట్టారు ముగ్గురు యువకులు.
ములుగు జిల్లాలోని అడవుల్లో ఒక చిన్న గ్రామం నీలంతోగు. పిల్లా జెల్లా కలిసి ఊళ్లో 150 మంది దాకా ఉంటారు. ఊరికి ఇప్పటి వరకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. సన్నటి పిల్లదారి గుండా నడుస్తూ వెళ్లాలి. గంట సేపు వర్షం కురిస్తే చాలు వాగు పొంగుతుంది. నడుములోతు నీటిలో నడుస్తూ వాగు దాటాలి. సరుకులు కొనాలన్నా, చదువుకోవాలన్నా ఆ ఊరు దాటాల్సిందే. ఊరు దాటాలంటే వాగు దాటాలి. అందుకే వాళ్ల కష్టాలు తీరాలని, తరువాతి తరమైనా మారాలనే తపనతో అక్కడ ‘భీమ్ హ్యాపీనెస్ సెంటర్’ పేరుతో ఒక స్కూల్ మొదలుపెట్టాడు ఇస్తం సంతోష్. ఇతను ఉస్మానియా యూనివర్సిటీలో సైబర్ లా స్టూడెంట్. సొంతూరు ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్. టైం దొరికినప్పుడల్లా గిరిజనులు ఉండే ప్రాంతాలకు వెళ్లి, వాళ్ల లైఫ్ స్టైల్ ఫొటోలు తీసేవాడు. అందుకు అనేక ప్రాంతాలు తిరిగేవాడు. వేరు వేరు ప్రాంతాల్లోని గిరిజన పిల్లల వేషం, భాషలో మార్పులు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో పిల్లలు చాలా వెనుకబడినట్టు అనిపించింది. దానికి కారణం.. ‘చదువు’ అని అర్థమైంది. చదువుకుంటున్న పిల్లలు చాలా అప్‌డేటెడ్‌గా ఉన్నారు. చదువులేని పిల్లలకు చదువు అందేలా తనవంతుగా ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాడు సంతోష్.
సరుకులు ఇచ్చేందుకు వెళ్లి..
సెంట్రల్ గవర్నమెంట్ లాక్‌డౌన్ విధించడంతో యూనివర్సిటీ నుంచి ఇంటికెళ్లాడు సంతోష్. లాక్‌డౌన్.. గిరిజన కుటుంబాలపై చాలా ప్రభావం చూపించింది. చాలామంది ఇబ్బంది పడ్డారు. దాంతో సంతోష్, తన ఫ్రెండ్స్‌తో కలిసి చుట్టు పక్కల ప్రాంతాల్లో గిరిజనులకు నిత్యావసరాలు ఇచ్చేందుకు ఊరూరూ తిరిగాడు. అందులో భాగంగానే నీలంతోగుకు వెళ్లాడు. అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్లంతా చాలా బలహీనంగా ఉన్నారు. ఒక అబ్బాయికి కాళ్లు, చేతులు సన్నగా ఉండి, పొట్ట మాత్రం పెద్దగా ఉంది. దానికి సరైన తిండి లేకపోవడం ఒక కారణం అయితే.. ఆ అబ్బాయి ప్రతి రోజూ సారాయి తాగడం మరో కారణమని తెలిసి, వాళ్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చాడు సంతోష్. అంతేకాదు అక్కడ పిల్లలంతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అక్కడి ప్రజలు చాలా వెనుకబడిపోయారు. ఇప్పటికీ ఆ ఊళ్లో పదో తరగతి వరకు చదివినవాళ్లు ఒక్కరు కూడా లేరు. ఊళ్లో స్కూల్ లేదు. పిల్లలకు చదువు లేదు. అందుకే తను అక్కడి పిల్లలకు చదువు చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. కానీ, అది ఒక్కడితో అయ్యేపని కాదు. అందుకే అప్పటికే ఎన్జీవోల్లో పని చేస్తూ, గిరిజన పిల్లలకు చదువు చెప్తున్న ఇద్దరు ఫ్రెండ్స్ వీరెల్లి శశిధర్‌రెడ్డి, గున్మంతరావుతో కలిసి స్కూల్ మొదలుపెట్టాడు.
ఐదు కిలోమీటర్లు నడవాలి
స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. కానీ, దాన్ని అమల్లో పెట్టేందుకు సుమారు నెల రోజులు పట్టింది. సంతోష్ సొంతూరి నుంచి నీలంతోగుకు 16 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 11 కిలోమీటర్లు బైక్‌పై వెళ్లొచ్చు. కానీ.. ఐదు కిలోమీటర్లు పూర్తిగా కాలినడకనే వెళ్లాలి. ముందుగా నెలరోజులు, సంతోష్ తన ఫ్రెండ్స్‌తోపాటు వారానికోసారి నీలంతోగు వెళ్లాడు. రోజంతా వాళ్లతోనే ఉండి, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. వెళ్లిన ప్రతిసారి పిల్లల కోసం గుడ్లు తీసుకెళ్లేవాళ్లు. వాళ్లతో ఆడి, పాడి, చదువు గురించి చెప్పి అవేర్‌నెస్ కల్పించాడు. అలా పిల్లల్లో కొంత మార్పు వచ్చాక, ఊరివాళ్లకు స్కూల్ గురించి చెప్పాడు. దానికి వాళ్లు కూడా సరేనన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందంటే అందుకోసం ఎలాంటి సాయమైనా చేస్తామన్నారు. దాంతో ఒక గుడిసెలో క్లాసులు మొదలుపెట్టింది సంతోష్ టీం. దానికి ‘భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్’ అని పేరు పెట్టారు. ఆ స్కూల్‌కు టైమింగ్స్ లేవు. పిల్లలు ఎప్పుడైనా రావొచ్చు. ఎప్పుడైనా వెళ్లొచ్చు. అలా అయితేనే.. పిల్లలు స్కూల్‌కి రావడానికి ఇష్టపడతారని, ఇలా చేశారు. ప్రస్తుతం స్కూల్ బాధ్యతలు (ఎనిమిదో తరగతి వరకు చదివి), అదే ఊళ్లో ఉంటున్న పరమేశ్ చూసుకుంటున్నాడు. వారంలో ఒకటి రెండు సార్లు సంతోష్ తన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడకు వెళ్లి, వాళ్లకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో ఒక టీచర్‌ని కూడా ఏర్పాటుచేస్తామని చెప్తున్నాడు సంతోష్.
పదిహేనో రోజులకో గిఫ్ట్
భీమ్ హ్యాపీనెస్ సెంటర్‌లో స్టూడెంట్స్‌కి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అది బాగా చదివే పిల్లలకు ఇచ్చే గిఫ్ట్ కాదు. బాగా ఆనందంగా ఉండి, పరిశుభ్రంగా, మంచి నడవడికతో మెదిలే పిల్లలకు ఇస్తారు. అలా పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి అనుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్లకు చదువు గొప్పతనంపై అవగాహన కల్పించి, వాళ్లలో చదువుపై ఇష్టాన్ని పెంచి, స్కూల్‌కి వెళ్లేట్టుగా చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం స్కూల్‌లో ఇంగ్లీష్, తెలుగు వర్ణమాలలు, గుణింతాలు నేర్పిస్తున్నారు. ముందుగా పిల్లలకు వాళ్ల మాతృభాషలో పాఠాల ద్వారా నేర్పిస్తున్నారు. గతంలో ఏడు, ఎనిమిది తరగతుల వరకు చదువుకుని, బడికెళ్లడం ఆపేసిన పిల్లలు కూడా ముగ్గురు ఉన్నారు. వాళ్లను కూడా పదో తరగతి చదివించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు సంతోష్.
ఏమిస్తున్నారు?
ప్రస్తుతం పిల్లలకు ప్రతి రోజు ఒక గుడ్డుతోపాటు స్నానం చేయడానికి సబ్బులు, తలకు రాసుకోవడానికి నూనె, బట్టలు ఇస్తున్నారు. అందుకోసం సంతోష్ తన ఫ్రెండ్స్, ఎన్జీవోల సాయం తీసుకుంటున్నాడు. స్కూలుకు స్టేషనరీ, ఆట వస్తువులు, పిల్లలు చదువుకోవడానికి చార్ట్స్ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో గుడిసెకు మరమ్మతులు చేయనున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే… దాని మరమ్మతులు చేయడానికి ఊరి జనం వాళ్లంతట వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఊళ్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి గుడిసెను రిన్నోవేషన్ చేస్తామని సంతోష్‌తో చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో ఆ పనులు మొదలు పెట్టనున్నారు. అందుకు కావాల్సిన మెటీరియల్ సమకూర్చే పనిలో ఉన్నాడు సంతోష్. ‘ఈ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు కురిస్తే.. సెంటర్‌లో పిల్లలకు ఇబ్బంది కలగొచ్చు. అందుకే రిన్నోవేషన్ చేయిస్తున్నాం. ఈ సెంటర్‌ని మేం కేవలం రెండువేల రూపాయలతో మొదలుపెట్టాం. ఇప్పుడు ఎన్జీవోలు, నా ఫ్రెండ్స్ కొంతమంది సాయం చేస్తున్నారు. బీమ్ హ్యాపీనెస్ సెంటర్‌లో వందశాతం హాజరు ఉంటోంది. వలంటీర్ రాకముందే, పిల్లలందరూ బడికొస్తున్నారు’ అని సంతోషంగా చెప్పాడు సంతోష్.
కరోనా కాలంలో ఎలా?
కరోనా వల్ల లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. మరి అలాంటి టైంలో స్కూల్ నడిపితే కరోనా సోకే ప్రమాదం ఉండదా? అని చాలామందికి అనుమానం రావొచ్చు. కానీ, ఈ స్కూల్ వల్ల కరోనా వచ్చే ఛాన్సే లేదంటున్నాడు సంతోష్. ఎందుకంటే ఈ స్కూల్‌లోకి బయటి వాళ్లకు అనుమతి ఉండదు. ఆ ఊళ్లో, ఆ పిల్లలతో కలిసి ఉండే వలంటీర్ మాత్రమే స్కూల్‌కి వెళ్తారు. ఇక సంతోష్ టీం అక్కడికి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్లు కట్టుకుని, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తూ పిల్లలతో మాట్లాడతారు. మరి పిల్లల్లో ఎవరికైనా ఉంటే ఆలోచనే అనవసరం. ఎందుకంటే ఆ ఊరివాళ్లు ఊరు దాటి, బయటకు రావడం చాలా అరుదు. అడవి మీద ఆధారపడి, వాళ్లకు కావాల్సిన తిండి వాళ్లే సంపాదించుకుంటారు. ఎవరి దగ్గరైనా తిండి లేకపోతే, ఉన్నవాళ్లు పెడతారు.