మహా శివరాత్రికి తగ్గిన రాజన్న ఆదాయం

మహా శివరాత్రికి తగ్గిన రాజన్న ఆదాయం
  • రెండేళ్ల క్రితంతో పోలిస్తే తగ్గిన రూ.4  లక్షలు 
  • స్వామివారిని దర్శించుకున్న  3.20 లక్షల మంది భక్తులు
  • తగ్గిన కోడె మొక్కులు, ప్రసాదాల ఆదాయం 
  • పెరిగిన లోకల్​ భక్తులు.. తగ్గిన నాన్​లోకల్ ​భక్తులు

వేములవాడ, వెలుగు : తెలంగాణ రాష్ర్టంలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో మూడు రోజులపాటు జరిగిన మహాశివరాత్రి జాతరలో ఈసారి ఆదాయం తగ్గింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర సందర్భంగా 2022తో పోలిస్తే భక్తులు పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది. ఈనెల 7,8,9 తేదీల్లో మహాశివరాత్రి జాతర మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించారు. అయితే,  జాతర కోసం సుమారు 3 లక్షల 20 వేల మంది భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్టతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి తరలివచ్చారు. 

మూడు రోజులపాటు టికెట్స్ ద్వారా రాజన్నకు  కోటీ 20 లక్షల 98 వేల 440 ఆదాయం సమకూరింది. అయితే, స్వామివారి దర్శనం కల్పించాల్సిన అధికారులు రూల్స్ పేరిట భక్తులను అడ్డుకోవడం వంటి కారణాలతోనే చాలా మంది రాలేకపోయారని కొంతమంది తెలిపారు. బయట ప్రాంతాల కంటే వేములవాడ పట్టణంతోపాటు సమీప గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చారు. మూడు రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో  ప్రసాదాల ద్వారా 50 లక్షల19 వేల130, కోడె మొక్కుల ద్వారా 45 లక్షల 83 వేల 864, అర్జిత సేవల ద్వారా లక్షా28 వేల 416, తలనీలాలు ద్వారా  3 లక్షల 85 వేల 800, రూ.100  శ్రీఘ్ర దర్శనం ద్వారా 4 లక్షల 5 వేలు,  రూ.300 అతి శ్రీఘ్ర దర్శనం ద్వారా 11 లక్షల 37 వేలు, బద్దిపోచమ్మ ఆలయం ద్వారా లక్షా 33 వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

2022లో సమ్మక్మ– సారలమ్మ జాతర ఉండడంతో కోటీ 24 లక్షల 19 వేలు ఆదాయం రాగ, ఈసారి కోటీ 20 లక్షల 98 వేల 440 ఆదాయం సమకూరింది. అయితే, అతిశ్రీఘ దర్శనం ఆదాయం రూ. 8 లక్షల 25 వేల 300 రాగా, ఈసారి మాత్రం 11 లక్షల 37 వేలు, శీఘ్ర దర్శనంలో 2 లక్షల 50 వేలు, కేశ ఖండనలో 2 లక్షలు అదనంగా ఆదాయం వచ్చింది.  ప్రధానంగా ప్రసాదాల ఆదాయం, కోడె మొక్కుల ఆదాయం భారీగా తగ్గిపోయింది.