ఎకరానికి ఐదు క్వింటాళ్లు మించట్లె

ఎకరానికి ఐదు క్వింటాళ్లు మించట్లె

హైదరాబాద్‌‌, వెలుగు: ఈసారి పత్తి దిగుబడి భారీ గా పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎక రాల్లో పంట సాగైనా.. ఇప్పటి వరకు 2.65 లక్షల టన్నులే మార్కెట్ కు వచ్చింది. రాష్ట్రంలో ఈ సారి 26 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. కానీ, ఇప్పటి వరకు అం చనాలో కేవలం పది శాతమే మార్కెట్‌‌కు వచ్చింది. 

మొదటి తీతలోనే ఇంత తక్కువగా వచ్చిందంటే.. ఈయేడు 50 శాతం దిగబడి కూడా వచ్చేలా లేద ని మార్కెట్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నరు. దీంతో పత్తి ఎక్కువ వేయాలని సర్కారు చెప్పిందని సాగు చేసిన రైతులు దిగుబడి రాక మునుగుతున్నరు. కష్టం వృథాకావడంతోపాటు పెట్టుబడి పైసలు రా వడం లేదని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తక్కువ కావడంతో ధర పెరుగుతుందనే ఆశతో పత్తిని అమ్మకుండా వెయిట్‌‌ చేస్తున్నరు.

ధర మెరుగ్గా ఉన్నా ఫాయిదా లేదు

ఈ సీజన్‌‌లో ఇప్పటి వరకు కాటన్‌‌ ధర గరిష్టంగా క్వింటాల్‌‌ రూ.9,250 ధర పలికింది. కనిష్టంగా రూ.6 వేల దాకా కొనుగోళ్లు జరిగాయి. మీడియం రకం కాటన్‌‌కు మద్దతు ధర రూ.6,080 , పొడుగు ఎక్కువగా ఉండే పత్తికి రూ.6,380 ధర ఉంది. మన దగ్గర మీడియం రకమే ఎక్కువగా సాగులో ఉంది. దిగుబడి తగ్గి మార్కెట్‌‌లో కాటన్‌‌కు డిమాం డ్‌‌  పెరగడంతో ఈయేడు సర్కారు సీసీఐ, మార్కెటింగ్‌‌శాఖల ద్వారా కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులే మద్దతు ధర  కంటే ఎక్కువ పె ట్టి కొంటున్నరు. దీంతో కాటన్‌‌కు ధర బాగానే ఉన్నా దిగుబడి రాక రైతుకు మాత్రం లాభం లేకుండా పోతోంది.

సర్కారు చెప్పిందని అరకోటి ఎకరాల్లో వేసిన్రు

పత్తి సాగును ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయిం చిన నేపథ్యంలో 70 లక్షల ఎకరాల్లో సాగు చేయా లని రైతులకు టార్గెట్‌‌ పెట్టారు. దీంతో రైతులు ఈయేడు  50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు  చేశారు. నిరుడు  49.97 లక్షల ఎకరాల్లోనే పంట వేశారు. కానీ, ఈయేడు సీజన్‌‌ ప్రారంభంలో  కురిసిన వర్షాలకు పత్తి పంట భారీగా దెబ్బతిన్నది. దీంతో దిగుబడి తగ్గిపోయింది. ఎకరానికి కనీసం 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. మూడు, నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదు.  దీంతో రైతులు ఆగమయ్యే పరిస్థితి నెలకొంది.

మార్కెట్‌‌కు వచ్చింది 2.65 లక్షల టన్నులే 

రాష్ట్ర వ్యాప్తంగా గత అక్టోబరు 1 నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌‌కు కేవలం 2.65 లక్షల టన్నుల పత్తి మాత్రమే వచ్చినట్టు మార్కెటింగ్‌‌శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిన్నింగ్‌‌ మిల్లుల్లో 1.46 లక్షల టన్నులు కొనుగోళ్లు జరిగాయి. మార్కెట్‌‌ యార్డుల్లో 70,596 టన్నులు, చెక్‌‌ పోస్టులో నమోదైన కొనుగోళ్లు 49,116 టన్నులు. ఇలా మొత్తం శనివారం నాటికి 2 లక్షల 65 వేల 876 టన్నుల పత్తి పంట కొనుగోళ్లు నమోదయ్యాయి. 

ఖమ్మం జిల్లా టాప్‌‌..

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 39,900 టన్నుల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఆ తర్వాత వరంగల్‌‌ జిల్లాలో 22,467 టన్నులు,  నాగర్‌‌ కర్నూల్‌‌ 20,329, ఆదిలాబాద్‌‌ 20 వేలు, నారాయణపేట్‌‌ 14,923, వికారాబాద్‌‌ 14,588, కరీంనగర్‌‌ 12,883, కొత్తగూడెం జిల్లాలో 11,337 టన్నుల పత్తి కొనుగోళ్లు జరిగాయి. అత్యంత తక్కువగా జగిత్యాల జిల్లాలో కేవలం 523 టన్నుల కొనుగోళ్లు జరిగాయి. అయితే, నిజామాబాద్‌‌, వనపర్తి, మంచిర్యాల, మెదక్‌‌ జిల్లాల్లో కాటన్‌‌ కొనుగోళ్లు అసలే నమోదు కాకపోవడం గమనార్హం.