ఫస్ట్ టైమ్ అసెంబ్లీకి వెళ్లేదే వీళ్లే.. ఈ లిస్ట్లో మీ ఎమ్మెల్యే ఉన్నారా..?

ఫస్ట్ టైమ్ అసెంబ్లీకి వెళ్లేదే వీళ్లే.. ఈ లిస్ట్లో మీ ఎమ్మెల్యే ఉన్నారా..?

జీవితంలో ఒక్కసారైనా అధ్యక్ష అనాలని చాలామంది ఆశ పడుతుంటారు. అసెంబ్లీలో అడుగుపెట్టి.. ప్రజా సమస్యలపై మాట్లాడాలని కలలుగంటుంటారు. కానీ.. ఆ కలలు, ఆ ఆశలు అందరికీ నెరవేరవు.. అదృష్టం, ప్రజా మద్దతు, డబ్బు ఉండాలి.. కొన్నిసార్లు.. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా.. కేవలం ప్రజా బలం ఉంటే చాలు.. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. గెలుపు సాధ్యమవుతుంది. అసెంబ్లీలోకి అడుగుపెట్టి.. అధ్యక్ష అనే చాన్స్ ఉంటుంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో చాలామంది అంటే 30 ఏళ్ల లోపు ఉన్న వారు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అంతేకాదు.. ఈసారి ఎక్కువ సంఖ్యలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు ఉన్నారు. వీరంతా అసెంబ్లీలో అడుగుపెట్టి.. అధ్యక్ష అనబోతున్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..! 

దయాకర్ రావుపై యశస్వినిరెడ్డి గెలుపు  

తెలంగాణ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వాళ్లు, ఈ ఎన్నికల్లోనే తొలిసారి పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు ఆదరించారు. వీరిలో అతి చిన్న వయసు వాళ్లు కూడా ఉండటం విశేషం. ఫస్ట్ టైమ్‌ ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో పాలకుర్తిలో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై గెలుపొందారు.

* మెదక్‌ నుంచి పోటీచేసిన మైనంపల్లి రోహిత్‌రావు ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలుపొందారు. 

* వేములవాడలో కాంగ్రెస్‌  నుంచి పోటీచేసిన ఆదిశ్రీనివాస్‌  విజయం సాధించారు. 

* పెద్దపల్లి జిల్లా రామగుండంలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాగూర్‌ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

* మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

* కంటోన్మెంట్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

* నాగార్జునసాగర్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌నేత జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

* నాగర్‌కర్నూల్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ నుంచి కూచకుళ్ల రాజేష్‌రెడ్డి ఫస్ట్‌టైమ్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే జిల్లా నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 

* నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కలకుంట్ల మదన్‌మోహన్‌రావు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 

* నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ముందుల శామ్యూల్‌ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం అందుకున్నారు.

* యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల అయిలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

* నారాయణపేట నియోజకవర్గం నుంచి 30 ఏళ్ల చిట్టెం పర్ణికారెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డిపై 7,950 ఓట్ల ఆధిక్యతో ఆమె విజయం సాధించారు. ఈమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యేగా, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. 2005లో మావోయిస్టుల కాల్పుల్లో నర్సిరెడ్డితో పాటు వెంకటేశ్వర్‌రెడ్డి మరణించారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పాటైన నారాయణపేట నియోజకవర్గ రాజకీయాల్లో ఆమె మేనమామ కుంభం శివకుమార్‌రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు. గత రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ ఎన్నికల్లో మహిళా కోటాలో పర్ణికకు అవకాశమిచ్చింది. పర్ణిక తల్లి లక్ష్మి (ఐఏఎస్‌) పౌరసరఫరాల శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ.. పర్ణికకు మేనత్త కావడం విశేషం.