సినిమా ప్రేక్షకులకు "శుక్రవారం" వచ్చింది అంటే చాలు.. పండుగ మొదలైనట్టే. విడుదలయ్యే ప్రతి సినిమాపై ఓ లుక్కేస్తారు. కొత్త సినిమాలతో వీకెండ్ ఎంజాయ్ చేయాలని కొందరు అనుకుంటే.. మరోవైపు, వచ్చే ప్రతిసినిమా చూసేయాలని మరికొంతమంది ఆడియన్స్ డిసైడ్ అవుతారు. ఇక పెద్దసినిమాలు వస్తే మాత్రం.. "ఆ శుక్రవారం" పెద్ద జాతరే అని చెప్పుకోవాలి. అలా ఉంటుంది శుక్రవారం సినిమాల మజా. మరి ఈ శుక్రవారం (2025 నవంబర్ 21న) చిన్న సినిమాలదే పెద్ద హవా. ఇవాళ థియేటర్స్కి వచ్చిన సినిమాల్లో అన్నీ చిన్న సినిమాలే ఉండటం విశేషం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్, థ్రిల్లర్ అండ్ హారర్ జోనర్లో సినిమాలు సందడి చేయడానికి వచ్చాయి. మరి ఆ సినిమాలు ఏంటీ? వాటి కథ, కథనాలు ఏంటీ? అనేది ఓ లుక్కేద్దాం.
‘12ఎ రైల్వే కాలనీ’:
అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా ఇవాళ (2025 నవంబర్ 21న) థియేటర్లో రిలీజైన మూవీ ‘12ఎ రైల్వే కాలనీ’. హార్రర్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కింది. ఇందులో పొలిమేర ఫేమ్' కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించగా, పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాలకి పనిచేసిన రైటర్ కం డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ కథను అందించారు.
అంతేకాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు & షోరన్నర్గా అనిల్ వ్యవహరించారు. హీరో నరేష్ నుంచి ఫస్ట్ టైం హారర్ థ్రిల్లర్ జోనర్లో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాంటి కిక్ ఇవ్వనుందో తెలియాలంటే ఈ ఒక్కరోజు ఆగాల్సిందే.
‘రాజు వెడ్స్ రాంబాయి’:
నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో దర్శకుడిగా తనదైన శైలిలో మెప్పించిన వేణు ఊడుగుల నిర్మాతగా మారి.. రాహుల్ మోపిదేవితో కలిసి ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే చిత్రాన్ని నిర్మించారు. అఖిల్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఇవాళ (నవంబర్ 21న) ప్రేక్షకుల ముందుకొచ్చింది.
‘ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా దర్శకుడు ఈ ప్రేమకథను హృద్యంగా రూపొందించారు. ఇందులో లవ్‌స్టోరీతో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్ ఉండనున్నాయి.
‘ప్రేమంటే’:
ప్రియదర్శి, ఆనంది జంటగా నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘ప్రేమంటే’. థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్‌లైన్. ‘‘పెళ్లి తరువాత ఎన్ని గొడవలు వచ్చినా సరే.. ఓ టీ తాగుతూ మాట్లాడుకుని పరిష్కరించుకోవాలనేదే ఈ మూవీ కాన్సెప్ట్’. ఇందులో సుమ కనకాల, హైపర్ ఆది కీలక పత్రాలు పోషించారు. కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాలను హిలేరియస్ గా చూపిస్తూ కట్ చేసిన టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
‘మఫ్టీ పోలీస్’:
అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన మూవీ ‘మఫ్తీ పోలీస్’. దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించాడు. జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్.ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ ఇవాళ (నవంబర్ 21న) థియేటర్స్ లోకి వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ చూసే ఆడియన్స్కి ఇది స్పెషల్ అవ్వనుంది. ‘కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉంటుంది. ఇంకొన్నిసార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది. కానీ మొత్తం లెక్కవేసి చూస్తే చివరికి ధర్మమే గెలుస్తుంది’ అనే కోణంలో సినిమా ఉండనుంది.
‘పాంచ్ మినార్’:
రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా రామ్ కడుముల దర్శకత్వంలో మాధవి, ఎంఎస్‌ఎమ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘పాంచ్ మినార్’. ఇవాళ శుక్రవారం (నవంబర్ 21న) సినిమా థియేటర్లోకి విచ్చేసింది. ‘ఇదొక పూర్తిస్థాయి క్రైమ్ కామెడీ సినిమా. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుని ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది స్టోరీ లైన్.
అయితే, ఈ మూవీ క్రైమ్ చుట్టూ తిరిగే స్టోరీ అయినప్పటికీ ఫ్యామిలీ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. మరి ఎలాంటి నవ్వులు, థ్రిల్ ఇచ్చిందో తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.
కొదమ సింహం రీ రిలీజ్:
చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ సినిమా ‘కొదమ సింహం’. రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్‌లు హీరోయిన్స్‌గా నటించగా, కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు నిర్మించారు.
ముప్ఫై ఐదేళ్ల తర్వాత ఇప్పుడీ సినిమా రీ రిలీజ్ అయింది. ఇవాళ సినిమా థియేటర్స్ కి వచ్చేసింది. 4కే కన్వర్షన్ క్వాలిటీ, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. వింటేజ్ మెగాస్టార్ స్టైల్, స్వాగ్, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో సాగే ట్రైలర్ ఇటీవలే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
