ఈ వారం కథ: కొలువు కోసం– డాక్టర్. మహేందర్ బర్ల

ఈ వారం కథ: కొలువు కోసం– డాక్టర్. మహేందర్ బర్ల

బయన్న టీవీ ఆన్ చేయంగనే పెద్దసారు మీటింగుల మాట్లాడుతున్న వార్తలు వస్తున్నయ్. ‘‘తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ కావాలె. ఆ విధంగా అభివృద్ధి దిశగా మనం ముందుకు పోతావున్నం. త్వరలోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తం. అన్ని డిపార్ట్​మెంట్లల్ల ఏమేం ఖాళీలున్నయో చెప్పమని అధికారులకు ఆదేశాలు జారిచేసినం. 

ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలున్నయో తెలుపంగనె భర్తీ చేస్తమని మరోసారి తెలియజేస్తన్న. ఆర్థికశాఖ మంత్రి పక్కనే ఉన్నడు. ఖాళీలు తెలుపంగనే వెంటనే ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదింపచేయాలని ఆయనని కూడ కోరుతా వున్న. దీంట్లే ఎటువంటి శెషబిషలు లేవు. ఎటువంటి అనుమానంలేదు. కచ్చితంగా ఉద్యోగాల భర్తీ చేస్తం. చేసితీరుతాం’’ అని గట్టిగా చెప్పిండు. 

‘‘ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలె. రైతులు కాలుమీద కాలేసుకొని కూసునే రోజులు రావాలె. ఆ పార్టోడు, ఈ పార్టోడు ఎలక్షన్లు రాంగనె గంగెడ్లోలె వస్తరు.. పోతరు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కావాలె. తెలంగాణ ప్రజలు సహకరిస్తారని కోరుకుంటూ పిడికిలెత్తి జై తెలంగాణ’’ అని ముగించిండు సారు.

టీవీ చూసుకుంటనే క్యాంపస్​లో ఉండే శ్రీనుకు ఫోన్ చేసిండు బయన్న. ‘‘అన్న నమస్తే బాగేనానే. ఏం నడుస్తుంది క్యాంపస్​లో నోటిఫికేషన్ల గురించి ఏమనుకుంటుండ్రు. పెద్ద సారేమో అన్ని డిపార్ట్మెంట్లల్ల నోటిఫికేషన్లు వస్తయ్ అని చెప్తుండు నిజమేనానే. నమ్మొచ్చా?’’
‘‘నోటిఫికేషన్లు వస్తయనే టాక్ అయితే బాగనే ఉంది ఇప్పటికే కానిస్టేబుల్, గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చిండు కదా. ఎలక్షన్​లు దగ్గరికి వస్తున్నయ్. కాబట్టి ఇంకా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ కూడ వస్తదట’’ అని చెప్పిండు శ్రీను.
‘‘అందుకే ఈ ఒక్కసారి చదువుదామనుకుంటున్న అన్న. క్యాంపస్​కే వచ్చి ప్రిపేర్ అయిత. ఇంటికాడ చిన్నచిన్న ప్రాబ్లమ్స్ ఉన్నయ్. చదువుడు అయితలేదు. అటుఇటు తిరుగడానికే సరిపోతుంది. ఏం అర్థమైతలేదు అన్న. ఏం చేయమంటవ్’’ అని అడిగిండు బయన్న.

‘‘అవ్వన్ని ప్రాబ్లమ్స్ ఎప్పటికి ఉండేవే. చదువుత అనుకుంటే డెసిషన్​ తీసుకొని తొందరగ రా. ఇప్పటికే అశోక్ నగర్, బస్తీల రూమ్లు దొరుకుతలేవట. స్టడీహాల్స్ కూడ ఫుల్ అయితున్నయ్. లైబ్రరీలల్ల సీట్లు దొరుకుతలేవట. అందరు బాగ చదువుతుండ్రు. లేట్ చేయకు. ఈ కాంపిటిషన్​ని తట్టుకోవాలంటే బాగ చదువాలె. ఇదే లాస్ట్ ఛాన్స్ మనకు. మల్ల చదువలేము. నోటిఫికేషన్లు కూడ రావు’’ అని చెప్పిండు శీనన్న.
‘‘సరే అన్న థ్యాంకు. ఎట్లనన్న చేసివస్తా. మా అయ్యని అడుగుత. బై’’ అని ఫోన్ పెట్టేసిండు బయన్న.

బక్కయ్యకు ముక్కుమీదనే కోపం ఉంటది. పీట మీద కూసోని బువ్వతింటున్న బక్కయ్య దిక్కు భయంభయంగనే చూసిండు బయన్న. ‘‘అయ్యా నేను హైద్రాబాద్ పోత. అన్ని డిపార్ట్మెంట్లల్ల లక్ష ఉ ద్యోగాల నోటిఫికేషన్లు వస్తయ్ అంటుండు సీఎం సారు. టీచర్ జాబ్స్ గురుకులాలు కూడ వస్తయట. ఎన్నికలు వస్తున్నయ్ కదా. ఈసారి ఏస్తుండొచ్చు’’ అన్నడు.

‘‘ఉద్యోగాలు రావు. లొట్టపీసు రావు. దొస్రుత్.. గా.. బోలదోపోని మాటలు నమ్మి నువ్ పట్నం పోతే పొడుగయినట్టే.... మొండి రోకలిబండ ఇగురువెట్టినట్టే. కొన్ని దినాలేమో ‘తెలంగాణ తెలంగాణ’ అని తిరిగితివి. పదేండ్ల నుంచి సదువుసదువు అని పోతివి. పనిపాటలేకుండా ఊకనే ఉండవడితివి.
ముందటేడు ఉద్యోగాలు వస్తున్నయ్ కోచింగ్ గీచింగ్ అని ఇరువై వెయ్యిలు పట్టుకపోతివి వట్టిగనే వత్తివి. నిరుడు సదువుకుంటా అని ఆర్నెల్లు పోతివి వట్టి చేతుల్తోని వత్తివి. పట్నంలేదు గిట్నంలేదు. పశ్యెలు పశ్యెలు అంటే ఊరుతున్నయా? చింతచెట్టుకు గిట్లా కాస్తున్నయ్​రా. నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నీ సదువొద్దు నీ నౌకరొద్దు’’ అన్నడు బక్కయ్య.

‘‘ఈ సారి కోచింగ్ ఏం పోను. క్యాంపస్​లోనే ఉండి చదువుకుంటా. మా దోస్తుగాళ్లు కుమార్, సత్తిగిట్ల నెలకిందనే సదువుకుంటమని హైద్రాబాద్ పోయిండ్రు.’’
‘‘కాంపస్​ల్నే ఉండు. ఏ గంగలన్నపో... నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఇన్నేండ్ల సంది ఇగొస్తయ్... అగొస్తయ్ అంటివి. ఏవిరా ఉద్యోగాలు? ఏ కూలినాలి చేసుకున్న మంచిగ బతుకుదుము. గా జగన్ నికి ఏదో నౌకరి వచ్చినట్టే వచ్చి కోట్ల పడ్డదట. వచ్చిన నౌకరికే వెయిలకు వెయిలు 

ఖర్సు వెట్టుకుంట కోట్ల సుట్టు తిరుగుతుండట. నౌకరు వచ్చినోనికే దిక్కులేదు. కొత్తయ్ యాడికెల్లి ఇత్తడురా? నాకేం ఎరుకగని మొన్న పెద్దదొర దగ్గరికి యాబై వెయ్యిలు కావాలని వచ్చిండు యాదగిరి. ‘పశ్యెలు ఎందుకు యాదగిరి?’ అంటే మావోనికి నౌకరికి వచ్చిందన్నట్టే గాని... వచ్చిన సుఖం ఏంలేదు బక్కన్న. ఎవడో కోర్టుకు పోయిండట కోర్టులసుట్టు తిరుగుడుకు వొకిల్లకే అయితున్నయ్ పశ్యెలన్నీ’ అని చెప్పిండు యాదగిరి. వాడు నౌకర్లు ఇయ్యడు నువ్ చెయ్యవ్ గని. గా బర్లో గొర్లో ఇచ్చేటట్టు ఉన్నడు. గవ్వి వచ్చేటట్టు ఏదన్న ఉపాయం చెయ్​పో. ఏ ప్యాద పిల్లనన్న తీసుకొచ్చి పెండ్లి చేస్త”అన్నడు బక్కయ్య.
‘‘నీ యవ్వ... తాత గొర్లనే గాసే, నువ్ గొర్లనే కాయవడ్తివి. నేను గొర్లనే కాయల్నా? నేనైతే గొర్లగాయ.. బర్లగాయ. ఇంత చదువు చదువుకున్నది గొర్లగాసేతందుకేనా? పెండ్లిగూడ ఇప్పట్ల ఏం చేసుకోను. జాబ్ వచ్చినంకనే చేసుకుంటా. నేనైతే పట్నం పోతా ఇదొక్కసారి ఖర్సుల మందం ఇయ్యి” అన్నడు బయన్న.

‘‘జాబ్ వచ్చినంకనే చేసుకో నడీడు వచ్చేదాక అట్లనే ఉండు. ముప్పై ఏండ్లు పెట్టుకొని ఇంకా ‘పశ్యెలియ్యి పశ్యెలియ్యి’ అంటే యాడికెళ్లి తెత్తర్రా? ఇప్పటి వరకు ఐదు పైసలు పనిచెయ్యవైతివి. ఇదువరదానుక అంటే అప్పోసప్పో చేసి సదివిచ్చినగాని, ఇగ నావల్ల కాదు. నా దగ్గర నయా పైసా లేదు. నేను సదివిపియ్యలేను’’ చెప్పిండు బక్కయ్య.
‘‘ క్యాంపస్​లనే ఉంటా ఖర్సుల మందమే ఇయ్యి అంటున్నకదా.’’
‘‘కాంపస్​ల్నే ఉండు. ఏ ఏట్లేనన్న పడుపో నాకైతే తెల్వది’’ అన్నడు.

ఇంట్లో తండ్రికొడుకుల లొల్లి అయితుంటే ఇంటెనుక పొయికాడికెల్లి లచ్చమ్మ వచ్చుకుంటనే ‘‘ఏందయ్య పోరన్ని ఏమో ఒక్కటే తిట్టుడు తిట్టవడ్తివి. పోరడనెటోరకే సైసవు.’’
“తిట్టకపోతే చిన్నమొల్లని ముద్దుపెట్టుకుంటరు. అడిగనప్పుడల్లా గొర్రెపిల్లనో, మ్యాకపిల్లనో అమ్మి ఇస్తావుంటే నా అల్సుదొబ్బిండ్రు తల్లీకొడుకు. నువ్ చెయ్యవట్కెనే ఆడు ఇట్లా తయారైండు’’ లచ్చమ్మను ఓ మల్కా తిట్టిండు బక్కయ్య.
‘‘ఏం బుట్టిందయ్య మమ్ముల చూసేటోరకే కస్సుమనవడితివి’’ అని కసురుకుంది లచ్చమ్మ.

‘‘మల్ల పట్నం పోతా అంటండు. కట్టలుకట్టి అట పంపు మరి. యాడికెల్లి తేవాలె. శెల్కల గొర్లమంద తోలిండ్రు మందకాడికి పోవాలె పొద్దుపోతుంది. వాళ్లకు ఆకలైతుండొచ్చు’’ అనుకుంటా గొంగడి భుజానేసుకొని ఒకచేత సద్ది, ఇంకోచేత కుక్కగంజి పట్టుకొని మందకాడికి శెల్కలకు పోయే తొవ్వపట్టిండు బక్కయ్య..
‘‘మరి వాన్ని ఏం చేయమంటవ్? ఇన్నేండ్ల సంది ఆడు నౌకర్లు ఇయ్యంది’’ అన్నది లచ్చమ్మ. 
‘‘ఏందుల్ల ఏమో లొల్లి పెట్టుకుంటుండ్రు’’ అనుకుంట పక్కింటి నర్సమ్మ వచ్చింది.
‘‘ఏంలేదు నర్సక్క. పెద్దోన్ని ఎవుసంకెల్లె పెట్టే. బుజ్జవ్వను యాల్లపొద్దుగాలనే పెండ్లి చేసి ఎల్లగొట్టె. గీడొక్కడే కదా బరువైతుండు. మా చిన్నోడు బయన్న మల్లపట్నం పోతా అన్నడు అక్క.. ఒక్కటే తిట్టుడు తిడుతుండు...” 
‘‘పట్నం ఎందుకట’’ అని అడిగింది నర్సమ్మ....

‘‘ఏదో నౌకర్లు ఒత్తన్నయట అక్క. ఇదొక్కసారి సదువుకుంట అంటుండు. చిన్నోనికి ఎవుసం పని రాదాయే. ఎప్పుడు మోటు కష్టం చేసినోడు కాదాయో.’’
‘‘నీ కొడుకు చిన్నమొల్లి అనుకుంటున్నవానమ్మ. ఇంకా సదువుకోను. ఓ పోరిని పెండ్లిచేస్తే ఇద్దరు పిల్లల తండ్రవ్. ఆయన తోటోల్లకు చెందిరిగానికి ఇద్దరు కొడుకులు. బీరనికి ఓ కొడుకు, ఓ బిడ్డా పుట్టిరి. ఓ పోరిని చూసుకొచ్చి అంటకట్టెదానికి ఇంకేం సదువమ్మ’’ అన్నది నర్సమ్మ.
దీర్ఘం తీసుకుంటా ‘‘గదొక్కటే తక్కువున్నది. ఆడు బతికేదే కష్టం ఉందంటే పెండ్లాన్ని ఏంబెట్టి సాదుమంటవ్. ఇప్పటోళ్లు ఏమన్న అడివి పనికిగిట్ల పోతరా? కూసవెట్టేసాదాల్నాయే’’ అన్నది లచ్చమ్మ. 
‘‘ఓ పిలగా సదువుకునేకాన్నే ఎవ్వతినన్న చూసుకొని ఏస్కరా ఎట్లయితే గట్లాయే’’ నవ్వుకుంట అన్నది నర్సమ్మ.

‘‘గట్ల చేసుకోవాలంటే ఇదువరకే ఇద్దర్ని చేసుకుందు. జాబ్ వచ్చేదాక పెండ్లిగిండ్లి గసొంటివి ఏం లేవమ్మ” అని చెప్పిండు బయన్న.
‘‘ఓ నర్సమ్మ... ఓయ్... ఎటుపోయినవే... ఒరెక్కో... ఊ అంటే ఆ అంటే మందిండ్లపొంటి తిరుగుతదేంరా ఇదో” అని తిడుతుండు నర్సమ్మ భర్త నర్సయ్య.
‘‘నీ కొడుకును పట్నమే తోలుకో. బొంబాయే తోలుకో.. నేను పోతున్ననమ్మ. మీ మామ ఊళ్లెకెల్లిపొయ్ వచ్చినట్టుండు. కూతేత్తుండు. ఓ...’’ అనుకుంటా ఎల్లిపోయింది నర్సమ్మ.
బల్లెపీటమీదనే కూసోని దీర్ఘంగా ఆలోచిస్తుండు బయన్న.

‘‘బయన్న.. ఓరి బయన్న.. తిందురారా. ఒక్కబుక్క తిందురా... కడుపుల ఆసర లేకపోతే తెల్లందాక పేగులు గుర్రుగుర్రు మంటయ్. మాఅయ్య కదూ తిందురారా.. అయ్య ఇయ్యకపోతే అవుసులాయనకు నా గంటీలు అమ్ముకొచ్చి ఇత్తగని తిని పండుకుందురా బిడ్డా’’ బతిలాడుతుంది లచ్చమ్మ. బతిలాడంగ.. బతిలాడంగ చెయ్ కడుక్కోని వచ్చి పీటమీద కూసుండు బయన్న. లచ్చవ్వ లోతుగిన్నెల ఉడుకుడుకు బువ్వ, ఇంత పచ్చిపులుసు పోసుకొచ్చి ఇచ్చింది.
‘‘పచ్చిపులుసేనా?’’ అని గులుగుకుంట బలిమీదికి రెండుముద్దలు తిని బల్లెపీటమీద ఒరిగిండు బయన్న. ఒకటే ఆలోచన హైద్రాబాద్ ఎట్లా పోవాలె. మా అయ్యా పైసలు ఇస్తాడా? ఇయ్యడా?
ఇటు అటు మసులుతుండు కాని నిద్ర పడుతలేదు. ఫోన్ చూసుకుంట చూసుకుంటనే నిద్రపోయిండు. పొద్దుగాల లేసి బాయికెల్లి పోయిండు. పండ్లపుల్ల ఏసుకొచ్చి మొఖం కడుక్కుండు దీనంగా బల్లెపీటమీద కూసుండు బయన్న. అమ్మ చాయ పోస్కొచ్చి ఇచ్చుకుంటనే ‘‘ఏందిరా ఏమో గుండెపగిలి కూసున్నవ్. పోతే పోదువు తియ్ గంటీలో, గుండ్లో కుదవెట్టి ఎట్లనన్న తీసుకొచ్చి ఇస్తగని
నువ్ చాయ అయితే తాగు’’ అని చాయ్ చేతికిచ్చింది.

పైసలు ఎట్లా అనే బాధ మనసులో మెదులుతూనే ఉంది. ఎటుచూసినా ఒకటే ఆలోచన. అమ్మనేమో గంటీలు కుదవెట్టో, అమ్ముకొచ్చో ఇస్త అంటుంది... అమ్మ గంటీలు అమ్ముత అంటే మనసు ఒప్పుతలేదు. అయ్యనేమో పైసలు ఇచ్చేటట్టు లేడు. లచ్చమ్మ పొద్దుగాలనే లేసి ఊకి.. సల్లి, బువ్వ, కూర వండి పెట్టింది. కొంగు సదురుకంట తొవ్వపట్టుకోని అవుసులాయన ఇంటికి పోయింది.
‘‘ఏం లచ్చమ్మ బాగేనా? పొద్దుగాలనే వచ్చినవ్ ఏం సంగతి?’’ అని అడిగిండు బ్రహ్మచారి.

‘‘ఏం లేదు చారన్న. మా చిన్నోడు సదువుకుంటనని, పట్నం పోత అంటుండు చేతుల ఒక్క రూపాయిలేదు. ఆ మొదనష్టపోడు మా బక్కయ్య పట్నం ఒద్దు.. గిట్నం వద్దు అంటుండు. పది వెయిలు కావాల్నె. ఎట్లనన్న ఇయ్యి జెర నీకు పుణ్యముంటది గని. అంత నమ్మకం లేకపోతే నా గంటీలు పెట్టుకొని ఇయ్యి. నీ దగ్గర లేకపోతే జనగాంల అమ్ముకొనిరా’’ అని గంటీలుతీసి బ్రహ్మచారి చేతుల పెట్టింది లచ్చమ్మ.
‘‘నువ్ ఇచ్చిపోతవ్ బాగనే కాని బక్కయ్య నా మీదికి లొల్లికి రాడుగదా...’’

“నేనేమన్న తింటున్ననా? తాగుతున్ననా? మా అవ్వగారుకు పంపుతున్ననా? చిన్నోనికోసమేనాయే... ఆనికేదన్న నౌకరొత్తే ఆడే మల్ల చేపిత్తడు. నా మీదుండి ఏమ్ చేత్తున్నయ్?” అన్నది.
బ్రహ్మచారి గంటీలు పెట్టుకొని పది వెయిల రూపాలు ఇంట్లకెళ్లి తెచ్చిఇచ్చి ‘‘మంచిగా ఎంచుకో’’ అన్నడు. బక్కయ్యకు తెలువకుంటనే అవుసులాయన దగ్గరికి పోయి గంటీలు కుదవెట్టి పది వెయిల రూపాలు తెచ్చి ఇచ్చింది లచ్చమ్మ.
కడుపుల పుట్టెడు దుఃఖంతో పైసలు తీసుకుండు బయన్న. డీఏపీ సంచిలో సగం వరకు బియ్యం పోసుకుండు. కట్టెల సంచిల రెండు జతల బట్టలు పెట్టుకుండు. కాలేజీ బ్యాగుల పుస్తకాలు సదురుకుండు. ఇయ్యాల ఎట్లనన్నచేసి పట్నం తోలుత అనుకొని.. పొద్దుగాలనే ఇంట్లకోడి పెట్నయే రెండు కోడిగుడ్లు కూర వండింది లచ్చమ్మ. బువ్వ కోడుగుడ్ల కూర ఏసుకొచ్చి ఇచ్చింది. ‘‘తినుబిడ్డా తిను. రేపటి నుంచి ఆడ ఏం తింటవో ఏమో? కొనుకొచ్చుకున్న కూరలు ఏం మంచిగుంటయ్’’ అనుకుంటా బువ్వ, ఇంత కూర, తొక్కు ఏశి టిఫిన్ కూడ పెట్టింది.
‘‘అమ్మా ఇగ నేనుపోతున్న నిమ్మలంగా ఉండుండ్రి. రంది పెట్టుకోకు’’ అని చెప్పిండు బయన్న.

‘‘మేము నిమ్మలంగనే ఉంటం. నువ్ పైయిలం. దినాలు మంచిగలేవు లంగల దొంగల సోపతులు కూడకు బిడ్డా. ఇన్నొద్దుల దినాలు కావు మంచిగ సదువుకో. నిమ్మలంగా ఉండుమ’’ని మంచి చెడులు చెప్పింది.
‘‘పైయిలం పైయిలంరా కండ్లల్లకెల్లు నీళ్లు దుంకుతుంటే కొంగుతోని తూడుచుకుంటనే పోయినంక ఫోన్చెయ్’’ అని బక్కయ్యకు చెప్పకుంటనే సాగదోలింది. బక్కయ్య వొచ్చి ‘‘గంటీలు ఏమైనయ్?’’ అంటే ఏంచెప్పల్నో ఎంత తిడుతడో అని ఆలోచించుకుంట ఇంటి ముందుట ఓ గుంజకు ఒరిగి కూసుంది లచ్చమ్మ. ఊళ్లెకెళ్లి బాస్కర్​గాని అటోల జనగాందాక వచ్చిండు. 

జనాగాంల జేబీఎస్ బస్ ఎక్కి తార్నాకల దిగిండు. వీపుకు కాలేజీ బ్యాగ్ ఏసుకొని, బియ్యం సంచి భుజంమీద ఎత్తుకొని, చేతులు కట్టెల సంచి పట్టుకొని, తార్నాక బస్టాప్ నుండి సర్రసర్ర నడుసుకుంట క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీ ముందునుండి ఈ2 హాస్టల్​కి వచ్చిండు. టీవీ హాల్ ముందు, సిరాజ్ టీకొట్టు దగ్గర స్టూడెంట్స్​గుంపులు గుంపులుగా ‘‘మొన్న జరిగిన పరీక్ష పేపర్ లీకైందట’’ అని చర్చలు చేస్తుండ్రు.
‘‘ఏమైందో జనాలు ఎక్కువ ఉన్నరు’’ మనసుల అనుకుండు. దబదబపొయ్ బ్యాగులు రమేశ్ రూమ్​ల పెట్టి టీవీహాల్ దగ్గరికి వచ్చిండు. ఓ టీవీ చానల్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఈ నెల12న పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్. సూత్రధారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

లీకు వీరులను కఠినంగా శిక్షించాలె. ఛైర్మన్ రాజీనామా చేయాలె. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలె. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు. గ్రూప్1తో సహా పలు పరీక్షలు రద్దు. లీకైన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్.
ఈ వార్తలన్నీ స్క్రోలింగ్ అయితున్నయ్. ఒక్కటేసారి బయన్నకు గుండెలో పిడుగుపడ్డట్టు అయింది.
కాసేపు అట్లనే వార్తలను చూసుకుంటా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గిట్లయితే ఎట్లా? ఈ విషయం ఇంటికాడ ఉన్నపుడు తెలిసిన మంచిగుండని మనసులో అనుకుండు. టీవీహాల్ నుండి మెల్లగా సిరాజ్ టీకొట్టు దగ్గరికి వచ్చిండు. అక్కడే ఇద్దరుముగ్గురు ఫ్రెండ్స్ కనిపిస్తే రాళ్లమీద కూసోని సిరాజ్​కు చాయ్ చెప్పిండ్రు. 

‘‘గ్రూప్స్ పేపర్లు గిట్ల లీకైతే ఎట్లన్న మనస్సోంటి చదివినోనికి ఏం ఉద్యోగాలొస్తయ్?’’ అన్నడు మల్లేష్, ‘‘ఛీ..ఛీ.. నాకైతే ఈ వ్యవస్థను చూస్తేనే విరక్తి వస్తుంది. నిరుద్యోగుల పొట్టలుగొట్టుకుంటా ఎందుకు బతుకుతుండ్రయ్యా వీళ్లు’’ అన్నడు శంకర్.
‘‘వాళ్లకేమైతది ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి మల్లపెడుతరు” అని చెప్పిండు కుమారస్వామి.

‘‘నా పెండ్లం పోరగాల్లకు జ్వరం వచ్చిందని చెప్పినా ఊరికి పోలేదు. రోజు ఫోన్ చేసి రమ్మంటుంటే ఆర్నెల్లనుండి ఒక్కనాడు ఊరికి పోలె ఎగ్జామ్స్ ఉన్నయ’’ని వాపోయిండు సైదులు.
‘‘నా దగ్గర ఖర్చులకు కూడ డబ్బులు లేవు. ఎవ్వల్ని అడిగిన ఇచ్చేటట్టుగూడ లేరు. ఘోరంగా ఉంది నా పరిస్థితి’’ అని బాధపడిండు వెంకటేశ్​.
‘‘నేను ఇంటికిపోయి ఈరోజే వచ్చిన. ఈ ఒక్కరోజు ఆగిన అయిపోవ్. మల్ల ఇంటికిపోతే మావోళ్లు తోలగూడతోలరు”అన్నడు బయన్న.
‘‘వీడు మల్ల ఎగ్జామ్ ఎప్పుడు పెడుతడో? ఏమో..” అన్నడు నజీర్.

‘‘....గింత బుద్దిలేదానయ గా ఔట్​సోర్సింగోనికి సిస్టమ్ పాస్వర్డ్ ఎట్లిస్తరు? పేపర్లు ఎంత కాన్ఫిడెన్షియల్​గా ఉంచాలె’’ అని నోటికందినకాడికి తిడుతుండు రమణన్న.
‘‘పేపర్ లీకులు ఇప్పుడు కొత్తేమి కాదు. సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుండే ఉన్నయ్. కాని అప్పుడు బయటపడలేదు. ఇప్పుడు బయటపడుతుండ్రు. అప్పుడు దొంగలు దొరుకలేదు. ఇప్పుడు దొంగలు దొరికిండ్రు అంతే... ప్రతిసారి కొన్ని పోస్టులు అమ్ముడుపోతయ్. అమ్ముడుపోంగ మిగిలిన పోస్టులకే మనం ప్రిపేర్ కావాలె’’ అన్నడు లింగారెడ్డి.

పేపర్ లీకేజీ వివరాలు, కొన్ని ఏండ్లనుండి జరిగిన అవకతవకల గురించి అందరు చర్చించుకుంటుండ్రు. మోహన్ సైదులుకు ఫోన్​ చేసి ‘‘ఎక్కడున్నవ్? ఆర్ట్స్​ కాలేజీ దగ్గర పెద్దఎత్తున స్టూడెంట్స్ నిరసన చేస్తుండ్రు రమ్మ’’న్నడు.
‘‘అందరం పోదాంపాండ్రి’’ అనుకొని ‘‘అరెయ్ సిరాజ్ పైసల్ రేపుతీస్కోరా...’’ అనుకుంటా ఐదు నిముషాలల్ల ఆర్ట్స్ కాలేజీ చేరిండ్రు. విద్యార్థులు నినాదాలు ఇస్తుంటే వాళ్ల చుట్టూ పోలీసులు మోహరించి ఉన్నరు. ప్లకార్డులు పట్టుకొని ‘‘పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ రాజీనామా చేయాలె. పేపర్లు లీక్​ చేసినోళ్లను కఠినంగా శిక్షించాలె.

పరీక్షలన్నీ మళ్లీ నిర్వహించాలె. అవకతవకలపై సి.బి.ఐ.తో విచారణ జరిపించాలె. నిరుద్యోగుల పొట్టకొడుతున్న కొడుకుల్లారా... ఖబర్ధార్.. ఖబర్ధార్’’ అని పెద్దఎత్తున్న నినాదాలు చేస్తుండ్రు. వీళ్లు కూడ ఆ గుంపులో కలిసి నినాదాలు ఇచ్చిండ్రు. కొందరు విద్యార్థులు మీడియాకు వాయిస్ ఇస్తుండ్రు. పోలీసులు విద్యార్థులందరిని చెదరగొట్టి విద్యార్థి నాయకులను అరెస్టు చేశిండ్రు. కొంతమంది విద్యార్థులు గార్డెన్ల కూసోని రేపటి కార్యాచరణ గురించి మాట్లాడుకుంటుండ్రు. కొందరు ఎవరి హాస్టల్​కి వాళ్లు వెళ్లిపోయిండ్రు. కాళ్లుచెయిలు కడుక్కొని అమ్మ పెట్టిన టిఫిన్ బాక్సు ఓపెన్ చేసి ‘‘స్వామన్నా ఇంటికాడ నుండి బాక్స్ తెచ్చిన తిందాంరా”అని పిలిసిండు బయన్న.

 ‘‘నువ్​ తిను. కొంచెం కర్రీ ఉంచు. నేను ఎన్​సీసీకి పోయొచ్చి తర్వాత తింటా’’ అన్నడు స్వామన్న.
తిని ప్లేట్​ కడిగి సెల్ఫ్​ల పెట్టి, బెడ్​ మీద ఒరిగిండు. ఈసారన్న ఎగ్జామ్స్ తొందరగా అయిపోతయంటే గిట్లయ్​పాయే.. ఏదన్న ప్రైవేటు జాబ్​ చేస్తూ చదువుకుందామంటేనేమో ఈ కాంపిటిషన్​కు తట్టుకోలేము. కాంపిటేటీవ్ చదువుదామంటే ఎగ్జామ్స్ ఎప్పుడు పెడుతరో తెలువదు. మావొల్లేమో గడికోసారి ‘పెండ్లి’ అని ఎంటపడుతుండ్రు. ఉద్యోగం లేకపోతే ఎవడు పిల్లను కూడ ఇచ్చేటట్టులేడు. ఊరికిపోతే ఇజ్జత్​పోతట్టుంది. అటు ఊరికిపోలేక, ఏదన్న జాబ్ చేయలేక, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాలేక జీవితం ఆగమైపోవట్టే అని దీర్ఘంగా ఆలోచిస్తుండు బయన్న.

ఫోన్​ : 98859 37740