వానాకాలం వస్తుందంటే వణుకు!..మున్నేరు ముంపు ప్రాంతాల్లో భయం భయం

వానాకాలం వస్తుందంటే  వణుకు!..మున్నేరు ముంపు ప్రాంతాల్లో భయం భయం
  • ఈ సీజన్​ కు కాంక్రీట్ వాల్ పూర్తయ్యేది కష్టమే..
  • కాంక్రీట్ వాల్​ ను ఆనుకొని రోడ్డు నిర్మాణానికి ప్రపోజల్

ఖమ్మం, వెలుగు : ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వేస్తున్న అంచనాలు ముంపు ప్రాంతాల్లో భయాందోళనలను పెంచుతోంది. గతేడాది ఖమ్మం నగరంలో మున్నేరు పరివాహక ప్రాంతం, ఆనుకుని ఉన్న కాలనీల్లో వరద ముంచేయడంతో మళ్లీ ఆ పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. నగరంలోకి వరద నీరు రాకుండా కాంక్రీట్ వాల్ పనులు మొదలుపెట్టినా, ఈ సీజన్​ లో అవి పూర్తయ్యే అవకాశం లేదు. గత నెల రోజుల నుంచి స్పీడ్​ గా పనులు నడుస్తున్నా ఇప్పటికీ గ్రౌండ్ లెవల్ లోనే ఉన్నాయి. 

నెల రోజుల్లోపు మరికొంత పని కంప్లీట్ అయినా వరద ప్రవాహాన్ని అడ్డుకునే ఎత్తులో మాత్రం గోడలు పూర్తయ్యే అవకాశం​ లేదు. దీంతో ఈ వానాకాలంలో దాదాపు 20 కాలనీల్లోని మూడు వేలకు పైగా కుటుంబాలను ముంపు భయం వెంటాడుతోంది. ప్రధానంగా బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్​ కాలనీ, మంచికంటి నగర్, మోతీనగర్, పద్మావతి నగర్, రాజీవ్​ గృహకల్ప, వికలాంగుల కాలనీ, సాయికృష్ణనగర్, కరుణగిరి, జలగంనగర్, సాయి ప్రభాత్​ నగర్, ఇందిరమ్మ కాలనీలకు వరద తాకిడి అధికంగా ఉంటుంది. 

ఇవే కాకుండా ఖమ్మం నగరంలో కూడా పాత బస్టాండ్​సెంటర్, వినోదా థియేటర్, బాబూరావు పెట్రోల్​ బంక్​ ప్రాంతాల్లోనూ వరద ప్రభావం ఉంటుంది. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడం, పూడిక తీయకపోవడం లాంటి కారణాలతో రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉంటుంది. త్రీటౌన్​ ప్రాంతంలో గోళ్లపాడు ఛానల్​ పనులు పూర్తయినా మిగిలిన నగరమంతా ఓపెన్​ డ్రైనేజీ కారణంగా తిప్పలు తప్పడం లేదు. 

స్పీడ్​ గా కాంక్రీట్ వాల్ వర్క్స్​.. 

మున్నేరు చరిత్రలోనే అత్యధికంగా గతేడాది 30.6 అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చింది. దీంతో ఆ స్థాయికి మించి నీరు వచ్చినా తట్టుకునేలా మినిమమ్ 6 మీటర్ల ఎత్తు నుంచి, మ్యాగ్జిమమ్​ 11 మీటర్ల ఎత్తు(33 అడుగుల) వరకు, అడుగున 8 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్ గోడలు నిర్మిస్తున్నారు. రెండు గోడల మధ్య దూరం 300 మీటర్లు ఉండేలా భూసేకరణ చేశారు. వరదల రాకముందే ఫౌండేషన్​ కాంప్లీట్ చేయాలన్న ఆలోచన్​తో స్పీడ్​ గా పనులు చేస్తున్నారు. ప్రస్తుతం పోలేపల్లి సమీపంలో జంగిల్ కటింగ్ పూర్తి చేసి, కాంక్రీట్ ఫౌండేషన్​ పనులు చేస్తున్నారు. 

24 నెలల్లో ఈ వర్క్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు కిలోమీటర్లకు ఒక ఫ్లడ్ బ్యాంక్ చొప్పున మట్టి, రాతి కట్టల నిర్మాణం చేపడతారు. కాంక్రీట్ వాల్ పనులను హైదరాబాద్ కు చెందిన పటేల్ ఇంజినీరింగ్ సంస్థ, మరో సంస్థ జాయింట్ వెంచర్ తో కలిపి టెండర్ దక్కించుకుంది. మున్నేరుకు ఆర్సీసీ (రెయిన్ ఫోర్సుడ్ సిమెంట్ కాంక్రీట్) వాల్ నిర్మాణానికి ఎన్నికల ముందు రూ.690.52 కోట్లతో గత ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మున్నేరుకు రెండు వైపులా 8.5 కిలోమీటర్ల చొప్పున మొత్తం 17 కిలోమీటర్ల మేర ఆర్సీసీ వాల్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. మరో నాలుగు కిలోమీటర్ల మేర ఎర్త్ బండ్ నిర్మించాల్సి ఉంటుంది.  

గోడలకు బయటవైపు రోడ్డు, డ్రైనేజీ..

మున్నేరు వరద నుంచి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 3 వేల ఇండ్లకు రక్షణ కల్పించేందుకు కాంక్రీట్ వాల్ నిర్మాణం చేస్తున్నారు. అయితే కాంక్రీట్ వాల్ కు బయటవైపు రోడ్డు నిర్మించాలని ఆఫీసర్లు ప్రపోజల్స్ సిద్ధం చేశారు. పాలేరు నియోజకవర్గం వైపు ఉన్న కాంక్రీట్ వాల్​ ను ఆనుకొని ప్రకాశ్​ నగర్​ నుంచి బైపాస్​ వరకు డబుల్ రోడ్డు, మిగిలిన ప్రాంతంలో సింగిల్ రోడ్ నిర్మిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. 

దీనిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించిన తర్వాత వారం, పది రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాంక్రీట్ వాల్ కోసం ఇప్పటికే నది మధ్య భాగం నుంచి 150 మీటర్ల చొప్పున భూసేకరణ చేశారు. అదనంగా పాలేరు వైపు 35 మీటర్లు సేకరిస్తే రోడ్డు నిర్మించొచ్చని అంటున్నారు. ఇక ఖమ్మం నగరం వైపు వాల్ పక్కన పది మీటర్ల రోడ్డు నిర్మించినా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. రోడ్డు తర్వాత డ్రైనేజీ నిర్మిస్తే బయటనుంచి వచ్చే వాన నీరు డ్రైనేజీ ద్వారా వెళ్లిపోతుందని అంటున్నారు.