భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి సెలవులు ముగుస్తున్న సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.

భక్తులు స్వామివారికి కోడె మొక్కులు, తలనీలాల సమర్పించి, పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడింది. మరోవైపు భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు బద్దిపోచమ్మ అమ్మవారిని కూడా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు, ఇతర మొక్కులు సమర్పించారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్.రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

భీమేశ్వర స్వామిని దర్శించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే 

భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఆదిలాబాద్ ఎమ్యెల్యే పాయల్ శంకర్  ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.

ఉపాధి కూలీ దంపతులకు షష్టి పూర్తి

ఉపాధి కూలీకి వెళ్లిన వృద్ధ దంపతులకు తోటి కూలీలు పని స్థలంలోనే షష్టిపూర్తి వేడుకలు నిర్వహించారు. పెళ్లి పందిరి, పూలు, పసుపు, కుంకుమలతో పెళ్లి తంతు పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పురానీపేట్​కు చెందిన తోట రాజన్న, నర్సు దంపతులు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. 60ఏండ్లు పూర్తి చేసుకున్న వీరికి తోటి కూలీలు షష్టిపూర్తి చేశారు. నర్సుకు రాజన్న మంగళసూత్రం కట్టి అరుంధతి నక్షత్రాన్ని చూపించాడు. తోటి కూలీలంతా బంధువులుగా మారి చీర, పండ్లు, పూలు తెచ్చి ఆశీర్వదించారు.-వెలుగు, బాల్కొండ