కొత్త ఐటీ రూల్స్ తో మాట్లాడే స్వేచ్ఛకు ముప్పు

కొత్త ఐటీ రూల్స్ తో మాట్లాడే స్వేచ్ఛకు ముప్పు
  • ట్విట్టర్‌ నోట స్వేచ్ఛ మాట
     

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త ఐటీ రూల్స్ తో మాట్లాడే స్వేచ్ఛ (ఫ్రీడమ్ ఆఫ్​స్పీచ్)కు ముప్పు కలుగుతుందంటూ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త ఐటీ రూల్స్ ను పాటించేందుకు శక్తిమేరకు కష్టపడతామని తెలిపింది. దేశంలో తమ స్టాఫ్​ సేఫ్టీపై ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. బీజేపీ నేత సంబిత్ పాత్ర ట్వీట్ ను ‘మానిప్యులేటెడ్ మీడియా’గా ట్యాగ్ చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఇటీవల ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ ఆఫీసుకు వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కొత్త ఐటీ రూల్స్​పై ట్విట్టర్ స్పందించింది. ‘‘ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మేం సివిల్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాం. మేం గ్లోబల్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ప్రకారం తీసుకున్న నిర్ణయంపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతుండటంపై, కొత్త ఐటీ రూల్స్ పై ఆందోళన చెందుతున్నాం” అని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘కేంద్ర ప్రభుత్వ ఐటీ రూల్స్ ను పాటించేందుకు శ్రమిస్తాం. ప్రతి ఒక్కరి వాయిస్ ను వినిపించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రైవసీ, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడతాం” అని ట్విట్టర్ స్పోక్స్ పర్సన్ చెప్పారు. కొత్త రూల్స్ అమలుకు 3 నెలల టైమివ్వాలని మినిస్ట్రీకి విజ్ఞప్తి చేశారు. కాగా, కొత్త రూల్స్ ను ఫాలో అవుతామని గూగుల్, ఫేస్ బుక్ సంస్థలు మంగళవారమే ప్రకటించాయి. వాట్సాప్ మాత్రం కొత్త రూల్స్​ రద్దు చేయాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. 

లోకల్ చట్టాలను గౌరవిస్తాం: సుందర్ పిచయ్ 
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లోకల్ చట్టాలను తాము గౌరవిస్తామని, అక్కడ వాటికి అనుగుణంగానే నడుచుకుంటామని గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ వెల్లడించారు. కొత్త ఐటీ రూల్స్ పై ఆయన గురువారం ఓ వర్చువల్ మీటింగ్ లో స్పందించారు. ప్రభుత్వం ఏదైనా సమాచారం కోసం రిక్వెస్ట్ చేస్తే.. అందుకు సహకరిస్తామని తమ ట్రాన్స్ పరెన్సీ రిపోర్టులలో స్పష్టంగా హైలైట్ చేస్తున్నామని తెలిపారు. ‘‘ఫ్రీ, ఓపెన్ ఇంటర్నెట్ అనేది వ్యవస్థకు పునాదిలాంటిది. ఇండియాలో ఇది ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఒక కంపెనీగా తాము ఫ్రీ, ఓపెన్ ఇంటర్నెట్ కోసం కట్టుబడి ఉంటాం. అదే సమయంలో లోకల్ గవర్నమెంట్లతో కలిసి ముందుకెళ్తాం. అవసరమైన చోట వెనక్కి తగ్గుతాం. ప్రపంచవ్యాప్తంగా దీనిని మేం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం” అని పిచయ్ స్పష్టం చేశారు.

మా చట్టాలు ఎలా ఉండాల్నో చెప్పేందుకు మీరెవ్వరు?: కేంద్రం  
కొత్త ఐటీ రూల్స్ విషయంలో డొంకతిరుగుడు వ్యవహారాలను ట్విట్టర్ ఆపేయాలని, ఇండియన్ చట్టాలను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘‘దేశంలో చట్టాలు చేయడం, పాలసీలు రూపొందించడం కేంద్రానికి ఉన్న సార్వభౌమ అధికారం. ట్విట్టర్ ఒక సోషల్ మీడియా ప్లాట్​ఫాం మాత్రమే. ఇండియన్ చట్టాలు ఎలా ఉండాల్నో చెప్పేందుకు దానికి ఎలాంటి అధికారం లేదు” అని తేల్చిచెప్పింది. కేంద్ర ఐటీ మినిస్ట్రీ తెచ్చిన కొత్త రూల్స్ పై ట్విట్టర్ చేసిన ప్రకటనలను కేంద్రం గురువారం తీవ్రంగా ఖండించింది. ‘‘భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పద్ధతుల అమలు విషయంలో ఇండియాకు శతాబ్దాల చరిత్ర ఉంది. ట్విట్టర్ లాంటి ఒక వివిదేశీ సంస్థకు దేశంలో భావ ప్రకటన పరిరక్షణ కోసం ప్రత్యేక హక్కేమీ లేదు” అని కేంద్రం వివరించింది.