కాళేశ్వరం బ్యారేజీలు ఖాళీ!..

కాళేశ్వరం బ్యారేజీలు ఖాళీ!..
  • ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం నీళ్లు పూర్తిగా సముద్రంలోకి
  • ఒకట్రెండు రోజుల్లో సుందిళ్ల బ్యారేజీ కూడా ఖాళీ
  • ప్రస్తుతం ఒక టీఎంసీకి మించి లేవంటున్న అధికారులు
  • ప్రీ మాన్సూన్ చెకప్​ల కోసమే నీళ్లు వదలుతున్నట్టు క్లారిటీ

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మూడు బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఖాళీ అయ్యాయి. పిల్లర్లు కుంగిపోవడంతో ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేసిన అధికారులు.. బుంగలు పడిన అన్నారంలోని నీళ్లను తోడేశారు. మిగిలిన సుందిళ్ల బ్యారేజీలోని నీటిని కిందకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో డెడ్ స్టోరేజీలోనే నీళ్లున్నాయని అధికారులు చెప్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో గత నెల 7, 8, 9వ తేదీల్లో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల నేషనల్​ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలను పరిశీలించింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో డౌన్ స్ట్రీమ్, అప్​స్ట్రీమ్​లవైపు పరిశీలించారు. కానీ, సుందిళ్ల బ్యారేజీలో బ్యాక్ వాటర్ ఉండడంతో అప్​స్ట్రీమ్​వైపు పరిశీలించలేకపోయినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు డ్యామేజీలు జరిగిన నేపథ్యంలో.. సుందిళ్ల బ్యారేజీని పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ చెప్పినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే సుందిళ్ల బ్యారేజీని కూడా ఖాళీ చేయాల్సిందిగా అధికారులకు కమిటీ సూచించిందని సమాచారం.

ఎక్స్​పర్ట్స్ కమిటీ సూచనతో

నిపుణుల కమిటీ సూచనల మేరకు సుందిళ్ల బ్యారేజీలోని నీళ్లనూ అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం తాగునీటి సరఫరా కోసం కొన్ని నీళ్లను బ్యారేజీలో స్టోర్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. బ్యారేజీ కింద ఉన్న పంట పొలాలకు తాత్కాలికంగా నీటిని ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే దిగువకు నీటి విడుదల స్టార్ట్​ చేసిన నేపథ్యంలో.. బ్యారేజీలో నీళ్లు దాదాపు అయిపోయాయి. డెడ్​స్టోరేజీలో మాత్రమే నీళ్లున్నాయని అంటున్నారు. 8.9 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీలో ప్రస్తుతం ఒక టీఎంసీకి మించి నీళ్లు ఉండవని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒకట్రెండు రోజుల్లో ఆ నీళ్లను కూడా దిగువకు వదిలి బ్యారేజీని ఖాళీ చేస్తామని 
అంటున్నారు.

ఖాళీ అయ్యాక పూర్తిస్థాయి పరిశీలన..

నీటిని ఖాళీ చేశాక బ్యారేజీని అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించనున్నట్టు తెలుస్తున్నది. పియర్లు, పిల్లర్లు, గేట్లను అధికారులు చెక్​ చేయనున్నారు. అన్నారం బ్యారేజీకి బుంగలు పడిన నేపథ్యంలో.. సుందిళ్లలోనూ అలాంటి సమస్యలేమైనా ఉన్నాయా అని చెక్​ చేయనున్నట్టు సమాచారం. వానకాలానికి ముందు ఇలాంటి చెకప్​లు సహజమేనని ఇంజినీర్లు చెప్తున్నారు. వరద రావడానికి ముందే బ్యారేజీలు, డ్యామ్​లన్నింటినీ చెక్ చేస్తుంటారని, అయితే.. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం డ్యామేజీల నేపథ్యంలోనే సుందిళ్ల బ్యారేజీని ఖాళీ చేసి మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి వస్తున్నదని చెప్తున్నారు. బ్యారేజీలో ఇసుక ప్రభావాన్ని, సీపేజీల సమస్యను తెలుసుకుంటామని అంటున్నారు. కాగా, ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ తనిఖీలు జరుగుతుంటాయని, ఎస్ఆర్ఎస్​పీ, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులనూ ప్రీ మాన్సూన్ చెకింగ్​ చేస్తున్నట్టు చెప్తున్నారు.  

గేట్లు తెరిచి ఉంచాల్సిందే..

వాస్తవానికి ఇటీవల ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులు.. బ్యారేజీలను తిరిగి ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా వచ్చే ఫ్లడ్ సీజన్​లో మూడు బ్యారేజీల గేట్లను తెరిచి ఉంచితేనే బాగుంటుందని నిపుణుల కమిటీకి సూచించారు. వర్షాకాలంలోపు రిపేర్లను చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సుందిళ్ల బ్యారేజీని ఖాళీ చేయనున్నట్టు తెలుస్తున్నది. సుందిళ్ల నీళ్లనూ కిందకు వదిలి బ్యారేజీని ఖాళీ చేస్తే.. మూడు బ్యారేజీలూ ఖాళీగా ఉండనున్నాయి.