మూడ్రోజులు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్​

మూడ్రోజులు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్  మీటింగ్​
  •     29 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు వస్తరు
  •     అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడి

 
హైదరాబాద్, వెలుగు:  జీ20 సమావేశాల్లో భాగంగా అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ ఈ నెల 15 నుంచి 17 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలకు సంబంధించిన వివరాలను కిషన్ రెడ్డి వెల్లడించారు. జీ20 సమావేశాల్లో భాగంగా అగ్రికల్చర్ కు సంబంధించి ఇప్పటి వరకు మూడు జీ20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ జరిగాయని ఆయన తెలిపారు. మొదటిది ఇండోర్‌‌లో, రెండోది చండీగఢ్‌‌లో, మూడోది వారణాసిలో జరిగిందని చెప్పారు. ‘‘ఇప్పుడు హైదరాబాద్ లో జరగనున్న అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ లో 19 సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు పాల్గొంటారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్స్,  జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, రష్యా , సౌదీ అరేబియా, టర్కీ, బ్రిటన్, అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాల మంత్రులు, ప్రతినిధులు హాజరవుతారు. వీరితో పాటు 9 గెస్ట్ కంట్రీల మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ దేశాల్లో బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, ఒమన్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యూఏఈ, వియత్నాం ఉన్నాయి. అలాగే 10 అంతర్జాతీయ సంస్థల హెచ్ఓడీలు సమావేశాలకు వస్తారు. ఇక్రిశాట్, డబ్ల్యూఎఫ్ పీ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్, ఏషియన్ డెవలప్‌‌మెంట్ బ్యాంక్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రి డెవలప్‌‌మెంట్, వరల్డ్ బ్యాంక్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు” అని వెల్లడించారు. ఈ మీటింగ్ లో ఇప్పటి వరకు జరిగిన వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలపై మరింత చర్చ జరుగుతుందని తెలిపారు. ఆహార భద్రత, పోషకాహారం కోసం సుస్థిర వ్యవసాయం, మహిళల నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధి,  జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయంలో రావాల్సిన  మార్పులు తదితర అంశాలపై చర్చ ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారతాయని పేర్కొన్నారు.  

శ్రీనగర్ సమావేశాలు సక్సెస్..  

ఈ నెల19 నుంచి 22 వరకు గోవాలో జీ20 టూరిజం మినిస్టర్స్ మీటింగ్ నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘టూరిజం తొలి వర్కింగ్ గ్రూప్ సమావేశం గుజరాత్‌‌లోని రణ్ ఆఫ్ కచ్‌‌లో, రెండోది పశ్చిమబెంగాల్‌‌లోని సిలిగురిలో, మూడోది శ్రీనగర్‌‌లో ఇటీవల జరిగింది. శ్రీనగర్ లో సమావేశాలు పెట్టొద్దని పాకిస్తాన్ సహా కొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పాకిస్తాన్ మిలటరీ సవాళ్లు కూడా విసిరింది. కానీ మేం అద్భుతంగా సమావేశాలు నిర్వహించాం. మా ప్రభుత్వంపై నమ్మకంతో ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు” అని పేర్కొన్నారు.

సిటీలో ఐదో మీటింగ్.. 

ఈ ఏడాది జనవరి 28-, 29 తేదీల్లో జీ20 స్టార్టప్ ఎంగేజ్‌‌మెంట్ గ్రూప్ సమావేశం హైదరాబాద్ లో జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘మార్చి 6, -7 తేదీల్లో ఆర్థిక శాఖకు సంబంధించి రెండో వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. ఏప్రిల్ 17 నుంచి 19 వరకు సెకండ్ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించాం. జూన్ 4 నుంచి 6  వరకు హెల్త్ వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశం జరిగింది” అని చెప్పారు. ‘‘జీ20 సమావేశాల్లో భాగంగా 46 సెక్టార్లకు సంబంధించి మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇవి 56 నగరాల్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 140కి పైగా సమావేశాలు పూర్తయ్యాయి” అని వెల్లడించారు.