
తెలంగాణ లో రుతుపవన ద్రోణి ప్రభావంతో మూడు రోజుల ( జులై 4 నుంచి) పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, ములుగు, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ.
దేశ వ్యాప్తంగా పలు చోట్ల కొన్ని రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరబంగాళాఖాతం, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.