వీళ్లు జీన్స్‌‌ను వేస్ట్ చేయరు

వీళ్లు జీన్స్‌‌ను వేస్ట్ చేయరు

జీన్స్ అంటే అందరికీ ఇష్టమే.. పైగా చాలా స్ట్రాంగ్‌‌గా ఉంటుంది కూడా.  అలాంటి జీన్స్‌‌ని కొద్దిరోజులు వాడి, రంగు పోగానే పక్కన పడేస్తారు చాలామంది. ఏటా మనదేశంలో ఇలా టన్నుల కొద్దీ డెనిమ్ మెటీరియల్  వేస్ట్ అవుతుందట.  అంత మెటీరియల్‌‌ని వృథాగా పారేయకుండా వాటితో ఏదైనా తయారు చేసి, అవసరమైన వాళ్లకు అందిస్తే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన జోధ్‌‌పూర్‌‌‌‌లోని ముగ్గురు ఫ్రెండ్స్‌‌కి వచ్చింది. వేస్ట్‌‌గా పోతున్న జీన్స్‌‌ని సేకరించి బ్యాగులు, చెప్పులుగా మార్చి పిల్లలకు అందిస్తున్నారు.

ముగ్గురూ కలిసి

సోల్‌‌క్రాఫ్ట్  కంపెనీని అతుల్ మెహతా, మృణాళిని రాజ్‌‌పురోహిత్, నిఖిల్ గెలోట్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ స్థాపించారు.
దేశం మొత్తం మీద వృథాగా పోతున్న పాత జీన్స్‌‌ని సేకరించి  వాటితో బ్యాగులు, ఫుట్‌‌వేర్, పెన్సిల్ కేస్‌‌లు తయారు చేసి..  జోధ్ పూర్,  ఇంకా చుట్టుపక్కల ఊళ్లలో అవసరమైన పిల్లలకు ఉచితంగా అందజేస్తున్నారు.
ఇప్పటి వరకూ  సుమారు వెయ్యిమందికి పైగా పిల్లలకు బ్యాగులు, చెప్పులు అందజేసి, వాళ్లను స్కూల్‌‌కి వెళ్లేలా చేశారు.

మీకు తెలుసా? జత జీన్స్ ప్యాంట్లను తయారుచేయడానికి ఏడు వేల లీటర్ల నీళ్లు అవసరమవుతాయట.  ఆ ప్యాంట్లకు రంగులు అద్దడానికి మరో వంద లీటర్లు. ఇలా బోలెడంత నీటిని ఉపయోగించి జీన్స్‌‌ను తయారు చేస్తారు. కానీ ఇలా తయారైన జీన్స్‌‌లను కొద్దిరోజులకే పారేస్తారు చాలామంది. ఒక జీన్స్‌‌ను పారేస్తున్నాం అంటే జీన్స్‌‌తో పాటు, వేల లీటర్ల నీటిని కూడా వృథా చేస్తున్నట్టే.  ఏటా టన్నుల కొద్దీ జీన్స్ ఇలా వృథా అవుతోంది. దేశంలోని మొత్తం వేస్టేజ్‌‌లో డెనిమ్ వాటా ఇరవై శాతం వరకూ ఉంటోంది. అయితే అందులో అప్‌‌సైకిల్ చేయడానికి  వీలున్న మెటీరియల్ సగానికి పైగా ఉంటుందని  ఓ అంచనా. ఈ లెక్కలే జోధ్‌‌పూర్‌‌‌‌లో ఓ ముగ్గురి ఫ్రెండ్స్‌‌ని ఆలోచింపజేశాయి. ‘సోల్‌‌క్రాఫ్ట్’ అనే కంపెనీని స్టార్ట్ చేసేలా చేశాయి.

అలా మొదలైంది..

వృథాగా పోతున్న డెనిమ్ మెటీరియల్‌‌ను ఎలాగైనా రీ–యూజబుల్‌‌గా మార్చాలని అతుల్ మెహతా డిసైడ్ అయ్యారు. తన ఫ్రెండ్స్‌‌ని కలిసి ‘సోల్‌‌క్రాఫ్ట్’ ఐడియా చెప్పారు. వాళ్లు కూడా ఆ ఐడియాకి ఓకే చెప్పడంతో… సోల్‌‌క్రాఫ్ట్ ఐడియాపై క్యాంపెయిన్ చేస్తూ ఫండ్స్ రైజ్ చేశారు. జీన్స్ మెటీరియల్‌‌ను, ఇంకా వాటి అప్‌‌సైక్లింగ్‌‌కి కావాల్సిన మొత్తాన్ని క్యాంపెయిన్ ద్వారా కలెక్ట్ చేశారు. తగినంత ఫండ్స్ వచ్చాక లోకల్ టైలర్స్‌‌ సాయంతో బ్యాగులు, చెప్పులు తయారు చేయించారు. అలా తయారు చేసిన డెనిమ్ ప్రొడక్ట్స్‌‌లో కొన్నింటిని చుట్టు పక్కల గ్రామాల్లో పిల్లలకు ఉచితంగా పంచి, మరికొన్నింటిని జోధ్‌‌పూర్, ముంబై లాంటి సిటీలకు అమ్మకానికి పంపారు. అమ్మగా  వచ్చిన అమౌంట్‌‌తో మళ్లీ డెనిమ్ మెటీరియల్ సేకరించి.. ఈ సారి మరో ప్లేస్‌‌లో పిల్లలకు అందజేస్తారు. ఇలా వృథాను ఆదాయంగా మారుస్తూ దాని ద్వారా అవసరమైన పిల్లలకు బ్యాగులు, చెప్పులు అందజేస్తున్నారు.

ఒకే సొల్యూషన్

దీని గురించి అతుల్ మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో ఉన్న మొత్తం వేస్టేజ్‌‌లో  టెక్స్‌‌టైల్ వేస్టేజ్ మూడో ప్లేస్‌‌లో ఉంది. ఏటా టన్నుల కొద్దీ  టెక్స్‌‌టైల్ వేస్ట్  వృథాగా పోతోంది. పారేసిన బట్టలు మట్టిలో కలిసిపోయి,  వాటి తయారీకి ఉపయోగించిన రసాయనాల వల్ల భూ కాలుష్యం పెరుగుతోంది. ఇలా  ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 నుంచి 100 బిలియన్ల సంఖ్యలో బట్టలు భూమిలో కలిసిపోతున్నాయి. వాటిలో అప్‌‌సైక్లింగ్‌‌కి పనికొచ్చేవి సగానికి పైగా ఉంటున్నాయి. అందుకే వాటిని తిరిగి ఉపయోగ పడేలా చేయాలనే ఉద్దేశంతో  సోల్‌‌క్రాఫ్ట్  కంపెనీ  స్టార్ట్ చేశాం. మా కంపెనీ రెండు ప్రాబ్లమ్స్‌‌కు సొల్యూషన్ చూపుతుంది. ఇటు కాలుష్యాన్ని తగ్గించేందుకు, అటు అవసరమైన పిల్లలకు సాయపడేందుకు ఇలా.. రెండింటికోసం మా కంపెనీ పనిచేస్తోంది.

నేను ముందు ఈ ఐడియా చెప్పగానే మృణాళిని, నిఖిల్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. దీనిని ఒక బిజినెస్‌‌లా కాకుండా ప్రాబ్లమ్‌‌కి సొల్యూషన్ లా మేము భావిస్తున్నాం. ఈ అప్‌‌సైక్లింగ్ వల్ల టన్నుల కొద్దీ వేస్టేజ్‌‌కు సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే బ్యాగులు, చెప్పులు కొనుక్కోలేని ఎంతోమంది పేద పిల్లలకు ఉపయోగపడేలా కూడా ఉంటుంది. కేవలం ఈ కారణాల వల్లే మేము  ప్రాఫిట్స్ ఆశించకుండా పని చేస్తున్నాం. మాకు డొనేట్ చేసే వాళ్లు కూడా ఒక సోషల్ కాజ్ ఉన్నందువల్లే డొనేట్ చేయడానికి ముందుకొస్తున్నారు”అని చెప్పాడు.

ఫ్యూచర్ కోసం..

జోధ్‌‌పూర్‌‌‌‌లోని కొన్ని స్లమ్ ఏరియాలకు వెళ్లినప్పుడు,  అక్కడ చాలామంది పిల్లలు.. బ్యాగులు, చెప్పులు లేవని స్కూల్స్‌‌కి వెళ్లడం మానేశారు. కేవలం ఆ చిన్న కారణం వల్ల పిల్లలు స్కూల్‌‌కి వెళ్లడం మానేస్తే వాళ్ల ఫ్యూచర్ నష్టపోయే ప్రమాదముంది. అందుకే మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం.

– నిఖిల్, సీటీవో, సోల్‌‌క్రాఫ్ట్

పిల్లలకు నచ్చేలా..

చాలామంది కొన్ని కొన్ని బేసిక్ అవసరాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్లకి ఉపయోగ పడేలా ఏదైనా చేయడమే మా ఉద్దేశం. ముఖ్యంగా  ఈ  డెనిమ్ వస్తువులు అవసరం తీర్చడంతో పాటు, వాడుకోవడానికి  ఫ్యాషనబుల్‌‌గానూఉంటాయి. పిల్లలకు బాగా నచ్చుతాయి కూడా.

– మృణాలిని, సీఈవో, సోల్‌‌క్రాఫ్ట్

మరో వెయ్యి మందికి..

సోల్‌‌క్రాఫ్ట్  కంపెనీ  కేవలం స్కూల్ బ్యాగులు మాత్రమే కాదు..  ట్రావెల్ కిట్స్, ల్యాప్‌‌టాప్ బ్యాగ్స్, ఐ పాడ్ కవర్స్ లాంటివి కూడా తయారు చేసి అమ్ముతోంది. వీటిని జోధ్‌‌పూర్, ముంబై లాంటి సిటీలకు అమ్మకానికి  పంపిస్తారు. ప్రస్తుతం 1200 మంది పిల్లలకు బ్యాగులు, చెప్పులు అందించిన సోల్ క్రాఫ్ట్ సంస్థ.. తర్వాత  ప్రాజెక్ట్ కింద మరో 1200 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు బ్యాగులు అందజేసే పనిలో ఉంది.