ప్రాణం తీసిన సెల్ఫీ!

ప్రాణం తీసిన సెల్ఫీ!

చెరువులో మునిగి ముగ్గురు బాలికల మృతి 
ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగా .. మరొకరు సమీప బంధువు

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా తానూర్ ​మండలం శింగన్​గావ్​లో  ముగ్గురు బాలికలు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందారు. ముథోల్​ సీఐ కథనం ప్రకారం.. శింగన్ గావ్ గ్రామానికి చెందిన హెల్మెవార్ మంగళ, దాదారావు దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి స్మిత(14) టెన్త్ ​కంప్లీట్​చేయగా  రెండో కూతురు వైశాలి(13) సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో 9 వ తరగతి చదువుతోంది.  వీరికి సమీప బంధువైన మహారాష్ట్రలోని ముకేడ్ కు చెందిన అంజలి(14) శనివారం శింగన్ గావ్ లో చుట్టాల ఇంట్లో బర్త్ డే పార్టీ ఉంటే వచ్చింది. ఆదివారం ఆన్​లైన్​ క్లాసులు లేకపోవడంతో ఈ ముగ్గురు కలిసి పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే చేనులో పని చేస్తున్న మంగళ.. ఎండ బాగా ఉంది ఇంటికి వెళ్లమని ముగ్గురు బాలికలకు చెప్పింది. చేను దగ్గర కొంత సేపు సెల్ఫీలు దిగిన అమ్మాయిలు.. ఇంటి బాటపట్టారు. దారిలో చెరువు ఉండటంతో అక్కడ కూడా సెల్ఫీ దిగాలనుకున్నారు.  ఒడ్డున సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి గల్లంతయ్యారు. బాలికలు రాత్రి ఇంటికి రాకపోవడంతో  కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. సోమవారం చెరువు వైపుగా వెళ్తున్న కొందరికి చెప్పులు, డెడ్ బాడీలు కనిపించాయి. కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. ముథోల్ సీఐ అజయ్ బాబు, ఎస్సై రాజన్నలు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజన్న తెలిపారు.