మేడిపల్లి, వెలుగు: చెంగిచర్లలో ఏకకాలంలో ఎనిమిది ఇళ్లలో దొంగతనాల ఘటన మరవకముందే, ప్రతాపసింగారంలో మూడు ఇళ్లను టార్గెట్ చేసి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారం శ్రీధ హోమ్స్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి మూడు ఇండ్లలో దొంగలు పడ్డారు. బండిరాల గణేశ్ శుక్రవారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లగా, అర్ధరాత్రి దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి 3 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, రూ.10 వేలు అపహరించారు.
అదే కాలనీలో ప్రైవేటు లెక్చరర్ గైలి ఎల్లేశ్ గురువారం ఇంటికి తాళం వేసి పండుగకు మలక్‌పేటలోని అత్తవారింటికి వెళ్లారు. ఆయన ఇంట్లో అర తులం బంగారం, 15 తులాల వెండిని దోచుకెళ్లారు. ఆయన భార్య అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వ్యక్తి రాయల శ్రీధర్ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగలు, సెంట్రల్ లాకింగ్ వల్ల తాళాలు పగలకపోవడంతో ఖాళీగా వెనుదిరిగారు. ఒకే రాత్రి మూడు ఇండ్లలో దొంగలు పడడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
