ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు

ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన కందుకూరు పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. కందుకూర్ సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన సురిగి శ్రీనివాస్(39) ఆటోలో అదే గ్రామానికి చెందిన పంది శ్రీధర్(26), పంది సత్తమ్మ(49) మరికొంతమంది కూలీలు శుక్రవారం రావిరాలలోని క్రిష్టల్​ఇంటిగ్రేటెడ్​ సర్వీసెస్​ కంపెనీలో హౌస్​ కీపింగ్​ పనికి వెళ్లారు.

రాత్రి పని ముగిశాక అదే ఆటోలో కుర్మిద్ద గ్రామానికి ఫార్మా సిటీ రోడ్డు మీదుగా వస్తున్నారు. కందుకూర్​ మండలం ఎన్టీఆర్​ తండా దాటిన తర్వాత బ్రిడ్జి మీద రోడ్డుపై ఒక డీసీఎం ఐచర్​ వెనకాల ఆర్ఎంసీ పంపు(కాంక్రీటు పంపు) బండితో నిలిచి ఉంది. ఎలాంటి ఇండికేటర్లు లేకుండా వాహనాన్ని నిలిపడంతో ఆటో నడుపుతున్న శ్రీనివాస్ దానిని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సురిగి శ్రీనివాస్, ప్రయాణికులు పంది శ్రీధర్, పంది సత్తమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. 

పంది లింగమ్మ, పంది జంగమ్మ, పంది స్వరూప, పంది శాంతమ్మ, పంది హంసమ్మ, గోపాలి అరుణ, గోపాలి మంజులకు తీవ్ర గాయాలు, గోపాలి మరియమ్మ, పంది రేణుక, సిద్దిగారి లావణ్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. కందుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం వివిధ దవాఖానలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మరణించడంతో విషాదచాయలు అలుముకున్నాయి.