ఎక్స్ప్లోజివ్స్ ​కంపెనీలో పేలుడు ముగ్గురు మృతి.. మరో ఐదుగురికి గాయాలు

ఎక్స్ప్లోజివ్స్ ​కంపెనీలో పేలుడు ముగ్గురు మృతి.. మరో ఐదుగురికి గాయాలు
  • ఏడు కిలోమీటర్ల మేర వైబ్రేషన్తో కూడిన సౌండ్
  • యాదాద్రి జిల్లా మోటకొండూర్​ మండలం కాటేపల్లిలో ఘటన

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ శివారులోని  ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్  కంపెనీలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు చనిపోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాటేపల్లిలోని ప్రీమియర్  ఎక్స్ ప్లోజివ్స్  కంపెనీ బిల్డింగ్- లోని 18ఏ బ్లాకులో మంగళవారం ఎనిమిది మంది కార్మికులు పని చేస్తున్నారు. బిల్డింగ్ లో ప్రోక్లెంట్  మిక్సింగ్  పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బిల్డింగ్  మొత్తం కుప్పకూలింది.

ప్రమాదంలో కాటేపల్లికి చెందిన గునుకుంట్ల సందీప్(30), మోటకొండూర్కు చెందిన దేవీచరణ్(20) బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే చనిపోగా.. ఆత్మకూరుకు చెందిన కలువల నరేశ్(30) హైదరాబాద్  యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు.  ఈ ప్రమాదంలో వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన బుగ్గ లింగస్వామి, మోటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన శ్రీకాంత్, యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన శ్రీకాంత్, పెద్దకందుకూరుకు చెందిన మహేందర్, మరో కార్మికుడు మహేశ్​ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుతో మంటలు వ్యాపించి  క్షతగాత్రుల శరీరాలు కాలిపోయాయి.  వారిని  హైదరాబాద్ లోని యశోద, కస్తూరి హాస్పిటళ్లకు తరలించారు.

బిల్డింగ్  శిథిలాల కింద ఉన్న సందీప్, దేవీచరణ్ మృతదేహాలను వెలికితీయాల్సిఉంది. పేలుడు ధాటికి ఏడు కిలోమీటర్ల మేర వైబ్రేషన్స్, భారీ శబ్దాలు రావడంతో  పరిసర గ్రామాల ప్రజలు  ఉలిక్కి పడ్డారు. భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రోక్లెంట్  మిక్సింగ్  పనులు జరుగుతుండగా పేలుడు సంభవించినట్టు  కంపెనీ యాజమాన్యం ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. జనవరి 4న యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్  ఎక్స్ ప్లోజివ్స్  కంపెనీలో పేలుడు జరగ్గా..  అదే కంపెనీకి చెందిన కాటేపల్లి ప్లాంట్ లో ఇప్పుడు పేలుడు జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దకందుకూరు ప్లాంట్​లో ఇప్పటివరకు మూడు ప్రమాదాలు జరగ్గా..  నలుగురు చనిపోయారు. కాటేపల్లి  ప్లాంట్ లో   ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.    

కంపెనీ ఎదుట గ్రామస్తుల ఆందోళన..
కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు గురించి తెలుసుకున్న గ్రామస్తులు.. కంపెనీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే  ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటూ నిరసన చేపట్టారు. కార్మికుల సేఫ్టీకి సంబంధించి  జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే  ముగ్గురు చనిపోయారని, పలువురికి తీవ్ర గాయాలయ్యాయని మండిపడ్డారు. బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్  చేశారు.

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం..
పేలుడు సంభవించిన ప్లేస్ ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పరిశీలించి..  ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. పేలుడులో చనిపోయినవారి వివరాలు,  హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం, పలువురికి తీవ్ర గాయాలు కావడం కలిచివేసిందని, కార్మికుల సేఫ్టీ పట్ల నిర్లక్ష్యం వహించిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.