- మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు
- భారత కాన్సులేట్ అధికారుల సంప్రదింపులు
దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. వీరు షార్జాలోని ఒక కంపెనీలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న బస్.. లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
జగిత్యాల, వెలుగు: దుబాయ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు మృతి చెందారు. కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం (51), మల్యాల మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి తిరుపతి (23), మెట్‌పల్లి పట్టణంలోని గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫీఖ్ (33) ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లారు.
వీరు షార్జాలోని ఒక అల్యూమినియం, గ్లాస్ కంపెనీలో పని చేస్తున్నారు. ఆదివారం డ్యూటీ ముగించుకుని కంపెనీ నుంచి మినీ బస్సులో తోటి కార్మికులతో కలిసి ఇంటికి బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్ ఎమిరేట్స్ రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మృతి చెందగా, వారిలో జగిత్యాల జిల్లాకు చెందిన సలీం, తిరుపతి, రఫీఖ్ ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ అధికారులు కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
- కన్నీరుమున్నీరవుతున్న మృతుల కుటుంబాలు..
నమిలికొండకు చెందిన సయ్యద్ సలీం మూడు నెలల కిందటే దుబాయ్ వెళ్లాడు. అప్పులు చేసి గల్ఫ్‌కు వెళ్లిన అతడు, మూడు నెలలైనా కాకుండానే చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. మృతుడికి భార్య గోరీబీ, కూతురు కరియా, కొడుకులు షాదుల్లా, చిన్న కరీం ఉన్నారు. తక్కల్లపల్లికి చెందిన గొల్లపల్లి తిరుపతి ఈ యువకుడు కూడా కేవలం ఆరు నెలల క్రితమే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు.
అంతలోనే ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదం నిండింది. మెట్‌పల్లి పట్టణం గాజులపేటకు చెందిన అబ్దుల్ రహీం, షభియా బేగం దంపతుల పెద్ద కొడుకు అబ్దుల్ రఫీఖ్. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు కాగా, ఇద్దరు కొడుకులు ఇదివరకే చనిపోయారు. ఏడేండ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో కొడుకు షఫీర్ మృతి చెందగా, ఆ విషాదాన్ని తట్టుకోలేక వారం రోజుల్లోనే చిన్న కొడుకు ఇమ్రాన్ కన్నుమూశాడు.
ఇటీవల గల్ఫ్‌కు వెళ్లిన పెద్దకొడుకు రఫీఖ్ కూడా ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రులు, భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. రఫీఖ్ కు భార్య రజియాబేగం, కుమార్తె రిద ఉన్నారు.
