వరంగల్‍ పశ్చిమలో.. ముగ్గురు అధ్యక్షుల ఫైటింగ్‍

వరంగల్‍ పశ్చిమలో.. ముగ్గురు అధ్యక్షుల ఫైటింగ్‍
  • ప్రధాన అభ్యర్థులంతా ఆయా పార్టీల జిల్లా ప్రెసిడెంట్స్
  • సర్కారు వైఫల్యాలపై పబ్లిక్​లోకి వెళ్తున్న కాంగ్రెస్‍, బీజేపీ అభ్యర్థులు
  • సిట్టింగ్​ అభ్యర్థికి ఫాలోయింగ్ ​ఉన్నా..సవాలుగా ప్రభుత్వ వ్యతిరేకత

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ సిటీ పరిధిలోని వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి మూడు ప్రధాన పార్టీల అధ్యక్షుల మధ్య ముక్కోణపు పోటీ ఉంది. అధికార పార్టీ నుంచి బీఆర్‍ఎస్‍ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, సిట్టింగ్‍ ఎమ్మెల్యే దాస్యం వినయ్‍ భాస్కర్‍ బరిలో ఉన్నారు. ఇప్పటికే 4సార్లు గెలిచిన ఆయన.. ఐదోసారి ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. కాంగ్రెస్‍ నుంచి ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి ఎన్నికల పోరులో ప్రత్యర్థిపై మొదటిసారి సై అంటే సై అంటున్నారు. కాగా, అధికార పార్టీకి  ప్రభుత్వ వ్యతిరేకత, అపొజిషన్‍ పార్టీలకు అసమ్మతి మైనస్​గా ఉంది. పూర్తిగా సిటీ పరిధిలో ఉండే పశ్చిమ నియోజకవర్గంలోని నిరుద్యోగులు, లబ్ధిదారులు, యువ ఓటర్లే గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు.

వినయ్​భాస్కర్​కు మాస్‍ ఫాలోవర్స్..

బీఆర్‍ఎస్‍ అభ్యర్థి దాస్యం వినయ్‍ భాస్కర్‍ ఇప్పటికే 2009, 2010 (బైపోల్‍), 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. గత ఎన్నికల్లో 36,451 ఓట్ల మెజార్టీతో సమీప మహాకూటమి అభ్యర్థి రేవూరి ప్రకాశ్‍రెడ్డిపై గెలుపొందారు. దాస్యంకు ఉద్యమకారుడిగా పార్టీలో, ప్రజల్లో గుర్తింపు ఉంది.  మాస్‍ ఫాలోయింగ్‍తో పాటు నిత్యం జనాల్లో ఉండ టం ఆయనకు కలిసివచ్చే అంశం. సొంత ఇమేజ్‍తో ప్రచారంలో కాన్ఫిడెంట్‍గా ఉన్నా.. రాష్ట్రంలో కేసీఆర్‍ సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకత ఆయనకు ప్రతికూలంగా మారుతోంది. పైగా ఆయన వరుసగా 4 సార్లు గెలవటం, డబుల్‍ బెడ్రూం ఇండ్లు కేటాయించకపోవడం, ఫ్యామిలీపై భూకబ్జాల ఆరోపణలు వినయ్ ​భాస్కర్​కు మైనస్​. వరంగల్​ సిటీ కావడంతో నిరుద్యోగులు, మేధావులు, యువ ఓటర్లు ఎంతవరకు ఆదరిస్తారనే దానిపై వినయ్ ​భాస్కర్​ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్‍, బీజేపీ పార్టీల్లో టికెట్లు దక్కని నేతలను, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్‍గా బరిలో ఉండేలా చూ డటం ద్వారా.. ప్రత్యర్థుల ఓటు బ్యాంకును చీల్చే ప్రయ త్నాల్లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

కష్టకాలంలోనూ పార్టీకి అండగా నాయిని..

కాంగ్రెస్‍ నుంచి పార్టీలోని 30 ఏండ్ల సీనియర్‍ లీడర్​నాయిని రాజేందర్‍రెడ్డి బరిలో ఉన్నారు. కష్టకాలంలోనూ పార్టీని వీడకపోవడం, క్యాడర్‍ను కాపాడుకో వడం ఆయన బలం. 2014, 2018 ఎన్నికల్లో టికెట్ కోసం రాజేందర్​ రెడ్డి పోటీపడ్డా.. చివర్లో ఏదో కారణంతో ఆయనకు అన్యాయం జరిగిందనే సానుభూతి ఉంది.  కేసీఆర్‍ ప్రభుత్వంపై సహజంగా ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్​ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ నాయినికి కలిసివచ్చే అంశాలు. ప్రధాన ప్రత్యర్థిగా భావించే వినయ్‍ భాస్కర్‍ 14 ఏండ్లుగా సిట్టింగ్‍ ఎమ్మెల్యేగా ఉండటంతో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని నాయిని చెప్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు తనవైపు ఉంటారనే ధీమాతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో నర్సంపేట నుంచి పశ్చిమకు చివరి క్షణాల్లో వచ్చి పోటీ చేసిన రేవూరి ప్రకాశ్‍రెడ్డికి 44,555 ఓట్లు రావడంలో కీలకంగా వ్యవహరించింది రెడ్డి ఓ టర్లేననే చెబుతారు. వినయ్‍ భాస్కర్‍కు ప్రతి డివిజన్​లో లీడర్లు, కార్పొరేటర్లు ఉండటం.. అంతేస్థాయిలో నాయినికి లేకపోవడం మైనస్‍ కానుంది. ఇక్కడి నుంచే కాంగ్రెస్‍ టికెట్‍ ఆశించిన మరో నేత జంగా రాఘవరెడ్డి రెబల్‍గా పోటీచేస్తే నాయినికి కష్టాలు తప్పవు. కాంగ్రెస్‍ ఓటు బ్యాంకు చీలి వినయ్‍ భాస్కర్‍కు పాజిటివ్‍ అవుతుందనే టెన్షన్‍ కనిపిస్తోంది.

పశ్చిమ అభివృద్ధిలో బీజేపీ.. పద్మకు ప్లస్‍

బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రావు పద్మారెడ్డికి.. పశ్చిమ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ తో చేపట్టిన అభివృద్ధి ప్లస్‍ కానుంది. వరంగల్​ను కేంద్రం స్మార్ట్ సిటీగా ప్రకటించడం, ఆ ఫండ్స్​ద్వారా వరంగల్ పశ్చిమలో వేసిన రోడ్లు, జంక్షన్లు డెవలప్‍ అయ్యాయని రావు పద్మ చెప్తున్నారు. కాజీపేటకు రైల్వే ప్రాజెక్ట్ ఇవ్వడంతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆమె ప్రచారంలో వివరిస్తున్నారు. భద్రకాళి బండ్‍ పార్కు నిర్మాణం, వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధి, కేఎంసీలో సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్​ వంటి అభివృద్ధి పనులు బీజేపీ అభ్యర్థి రావు పద్మకు ప్లస్​కానున్నాయి. బీజేపీ సెంట్రల్‍లో అధికారంలో ఉండటం, ప్రధాని మోదీ చరిష్మా కలిసివచ్చే అవకాశం ఉంది. రెడ్డి సామాజికవర్గం ఓటర్లు తనకు మద్దతుగా నిలుస్తారనే విశ్వాసంతో ఆమె ముందుకెళ్తున్నారు. బరిలో తానొక్కరే మహిళా అభ్యర్థి కావడంతో నియోజకవర్గ మహిళా ఓటర్లను ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. తాను బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే సెంట్రల్‍ ఫండ్స్​తీసుకువస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. సిటీలోని యూత్​, చదువుకున్న ఓటర్లు తనకు మద్దతుగా నిలుస్తారని చెప్తున్నారు.  పార్టీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‍రెడ్డికి  టిక్కెట్‍ ఇవ్వకపోవడంతో ఆయన వర్గం గుర్రుగా ఉంది. రావు పద్మకు సహకరించే పరిస్థితులు లేకపోవడం ఆమెకు మైనస్.