మూడు చోట్ల ప్రమాదాలు.. ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు

మూడు చోట్ల ప్రమాదాలు.. ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు
  • సిద్దిపేట జిల్లాలో బైక్‌‌ను ఢీకొట్టిన కారు.. తండ్రీకూతురు మృతి
  • నిర్మల్‌‌ జిల్లాలో బ్రిడ్జి కింద పడిన బైక్‌‌.. ఆర్మీ మాజీ ఉద్యోగి మృతి, కూతురికి గాయాలు
  • జూరాల వద్ద ప్రమాదం.. నదిలో పడి యువకుడు గల్లంతు

సిద్దిపేట రూరల్/గద్వాల/భైంసా/కుభీర్‌‌, వెలుగు : వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో తండ్రీకూతురు సహా మరొకరు చనిపోగా.. ఓ యువకుడు నదిలో గల్లంతయ్యాడు. బిహార్‌‌ రాష్ట్రంలోని వైశాలి జిల్లా రహీమాపూర్‌‌ గ్రామానికి చెందిన మంతోష్‌‌కుమార్‌‌ (23) భార్య, ముగ్గురు కూతుళ్లతో చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లికి వలస వచ్చాడు. ఆదివారం రాత్రి కూతురు ఝాన్సీ (4)తో కలిసి బైక్‌‌పై వెల్కటూరు శివారులోని ఓ ఫౌల్ట్రీఫాంలో పనిచేస్తున్న తన అక్కబావ వద్దకు బయలుదేరాడు.

 రంగధాంపల్లి శివారులోకి రాగానే మిట్టపల్లికి చెందిన మణిసాయి కారులో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టాడు. మంతోష్‌‌కుమార్‌‌ అక్కడికక్కడే చనిపోగా.. ఝాన్సీ తీవ్రంగా గాయపడింది. స్థానికులు చిన్నారిని స్థానిక సురభి మెడికల్ కాలేజీకి తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. 

తండ్రి మృతి, కూతురికి గాయాలు

బైక్‌‌ బ్రిడ్జి కిందికి దూసుకెళ్లడంతో తండ్రి చనిపోగా.. కూతురికి గాయాలు అయ్యాయి. నిర్మల్ జిల్లా కుభీర్‌‌కు చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి దొంతుల గణేశ్‌‌ (40) కూతురు శ్రీనిఖిల హైదరాబాద్‌‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం తెల్లవారుజామున తన కూతురిని బాసర రైల్వే స్టేషన్‌‌లో దింపేందుకు బైక్‌‌పై బయలుదేరాడు. దేగాం సమీపంలోకి రాగానే బైక్‌‌ అదుపుతప్పి బ్రిడ్జి కిందికి దూసుకెళ్లింది. గణేశ్‌‌ అక్కడిక్కడే చనిపోగా.. శ్రీనిఖిల గాయపడింది. స్థానికులు పోలీసులు, 108కు సమాచారం అందించారు. శ్రీనిఖిలను బైంసాలోని ఓ ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌కు తరలించారు. 

జూరాల ప్రాజెక్టుపై యాక్సిడెంట్‌‌.. నదిలో పడి యువకుడు గల్లంతు

జూరాల ప్రాజెక్టుపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో నదిలో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. వడ్డేపల్లి మండలం తిమ్మాజీపల్లెకు చెందిన జానకిరాముడు, మానవపాడు మండలం ఎ.బూడిదపాడుకు చెందిన సతీశ్‌‌, వీరేశ్‌‌, మహేశ్‌‌ ఆదివారం జూరాల సందర్శనకు వచ్చారు. రాత్రి తిరిగి వెళ్తుండగా.. 48వ గేట్‌‌ దగ్గర రాయచూర్‌‌కు చెందిన కారు ఢీకొట్టింది. బైక్‌‌ వెనుక కూర్చున్న మహేశ్‌‌ ఎగిరి నదిలో పడి గల్లంతుకాగా... జానకిరాముడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు జానకిరాముడును హాస్పిటల్‌‌కు తరలించగా.. నదిలో పడిన మహేశ్‌‌ కోసం గాలిస్తున్నారు.