వేర్వేరు చోట్ల ముగ్గురు మహిళలు హత్య.. బెట్టింగ్‌‌‌‌లు ఆడొద్దన్నందుకు ఒకరినీ.. ఇంట్లోకి రావద్దనీ మరొకరినీ..

వేర్వేరు చోట్ల ముగ్గురు మహిళలు హత్య.. బెట్టింగ్‌‌‌‌లు ఆడొద్దన్నందుకు ఒకరినీ.. ఇంట్లోకి రావద్దనీ మరొకరినీ..

మహబూబాబాద్, వెలుగు : గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఓ మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం సమీపంలో మంగళవారం వెలుగు చూసింది. మరిపెడ మండలంలోని ఉల్లేపల్లికి చెందిన బంటు వెంకమ్మ (55) వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. సోమవారం బ్యాంక్‌‌‌‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన వెంకమ్మ రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. 

మంగళవారం (సెప్టెంబర్ 03) ఉదయం పురుషోత్తమాయగూడెం గ్రామ సమీపంలో రోడ్డు వెంట పగిలిన గాజులు, రక్తపుమరకలు కనిపించాయి. దీంతో అక్కడ వెతకగా రోడ్డు పక్కన ఉన్న గుంతలో వెంకమ్మ డెడ్‌‌‌‌బాడీ కనిపించింది. మృతురాలి భర్త గోపయ్య  ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ తెలిపారు. 

బెట్టింగ్‌‌‌‌లు ఆడొద్దన్నందుకు భార్యను చంపిండు

బూర్గంపహాడ్, వెలుగు : ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌ల్లో పెట్టి డబ్బులు పోగొట్టుకోవద్దు అని చెప్పిన భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్‌‌‌‌లో మంగళవారం జరిగింది. బూర్గంపహాడ్‌‌‌‌కు చెందిన షేక్‌‌‌‌ షంషేర్‌‌‌‌ పాషా ఆటో నడుపుతూ జీవించేవాడు. ఇటీవల ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌కు అలవాటు పడిన అతడు డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలు కావడంతో ఆటోను సైతం అమ్మేశాడు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడుగుతుండడంతో పాషాకు అతడి భార్య మహిముదా (32) మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో బెట్టింగ్‌‌‌‌లు ఆడొద్దని, ఏదో ఒక పని చేయాలని సోమవారం రాత్రి మహిముదా భర్తకు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. గొడవ పెద్దది కావడంతో ఆగ్రహానికి గురైన పాషా మహిముదా గొంతు నులిమి హత్య చేశాడు. తెల్లవారుజామున పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనాస్థలాన్ని పాల్వంచ సీఐ సతీశ్‌‌‌‌, బూర్గంపహాడ్ ఎస్సై మేడ ప్రసాద్‌‌‌‌ సందర్శించి వివరాలు సేకరించారు. 

భార్యపై కోపంతో మరో మహిళను చంపిన వ్యక్తి

ధర్పల్లి, వెలుగు : ఓ వ్యక్తి కత్తెరతో భార్యపై దాడికి యత్నించగా.. అడ్డుకోబోయిన ఓ మహిళ చనిపోగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్‌‌‌‌ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ధర్పల్లిలోని ఎన్‌‌‌‌టీఆర్‌‌‌‌ కాలనీకి చెందిన వడ్ల దాసు టైలర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. దాసుకు అతడి భార్య మణితో మనస్పర్థలు రావడంతో రెండేండ్ల కింద విడాకులు తీసుకున్నారు. దాసు ఒంటరిగా ఉంటుండగా.. అతడి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. తాను ఒంటరిగా ఇబ్బందులు పడుతుంటే తన భార్య మాత్రం ఎంజాయ్‌‌‌‌ చేస్తోందంటూ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 

ఈ క్రమంలో తన భార్య మణి మంగళవారం అదే కాలనీలో ఉంటున్న మచ్చ లక్ష్మి (48) అనే మహిళ ఇంటికి వెళ్లిందని తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. తన భార్యను రానీయొద్దని చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ లక్ష్మితో గొడవ పడి కత్తెరతో దాడి చేశాడు. గమనించిన లక్ష్మి కూతురు గౌతమి, శెట్‌‌‌‌పల్లి నాగరాజు, అతడి భార్య శోభ, భోజేశ్వర్‌‌‌‌ దాసును అడ్డుకునేందుకు యత్నించగా వారిపై కూడా దాడి చేయడంతో గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ చనిపోయింది. సమాచారం అందుకున్న ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై కళ్యాణి గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. దాసును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.