
మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట శివారులో పిడుగు పడి వంద గొర్రెలు చనిపోయాయి. బాధితులు కాట్రేవుల కత్తరసాల, కల్యాణ్, ఆదిరెడ్డి, మల్లేశ్, పున్నం చందర్, శ్రీశైలం గురువారం మేత కోసం జీవాలను అడవికి తీసుకెళ్లి రాత్రి గోదావరి ఒడ్డుకు చేరుకుని మందను పడుకోబెట్టారు.
భోజనం చేసేందుకు అంబటపల్లి గ్రామానికి వెళ్లి వచ్చేసరికి పిడుగుపాటుతో గొర్రెలన్నీ చనిపోయాయని బాధితులు తెలిపారు. శుక్రవారం జిల్లా వెటర్నరీ డాక్టర్ కుమారస్వామి, మండల వెటర్నరీ డాక్టర్ రాజబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి జీవాలకు పోస్టుమార్టం నిర్వహించారు.