కాంగ్రెస్​ ఖాతాలో తూప్రాన్ మున్సిపాలిటీ

కాంగ్రెస్​ ఖాతాలో తూప్రాన్ మున్సిపాలిటీ
  • కే సీ ఆర్ ఇలాకాలో బీ ఆర్ ఎస్ కు షాక్

తూప్రాన్ వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలోని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బుధవారం ఉదయం మున్సిపల్ ఆఫీస్ లో ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఎక్స్ అఫిషియో మెంబర్ టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి , వైస్ చైర్మన్ వర్గానికి చెందిన కౌన్సిలర్లు మీటింగ్​కు వచ్చారు. 11 మంది సభ్యులు హాజరుకాగా ఓటింగ్ నిర్వహించారు. 

మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా వైస్ చైర్మన్ తో పాటు 9మంది కౌన్సిలర్లు, రఘోత్తం రెడ్డి ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్టు ఆర్డిఓ జయచంద్ర రెడ్డి ప్రకటించారు. తూప్రాన్ లో మొత్తం 16 వార్డులకు గాను 11 బీఆర్ఎస్​, 2 కాంగ్రెస్, 1 బీజేపీ, 2 ఇండిపెండెంటెంట్లు గెలిచారు. ఇండిపెండెంట్లు ఇద్దరు ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే బీఆర్ఎస్ నుంచి 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. ఫిబ్రవరి 12న చైర్మన్​పై అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు. రవీందర్​గౌడ్​పదవి కోల్పోగా వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ కు ఇంచార్జి చైర్మన్ గా భాద్యతలు అప్పగించారు. 15 రోజుల లోపు కొత్త చైర్మెన్ ఎన్నిక చేపడతామని ఆర్డీఓ చెప్పారు. 
 
కాంగ్రెస్ నాయకుల సంబురాలు

 

తూప్రాన్ మున్సిపాలిటీ హస్తగతం కావడంతో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తూప్రాన్ మున్సిపాలిటీలో అవినీతికి తావు లేకుండా ప్రజాపాలన అందిస్తామని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు. ఇంచార్జి చైర్మన్ నందాల శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు.