ఎంపీగా గెలవలేని కవిత ఇతరులను గెలిపిస్తదా? : అర్వింద్​

ఎంపీగా గెలవలేని కవిత ఇతరులను గెలిపిస్తదా? : అర్వింద్​

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ ఎంపీ స్థానానికి జరిగిన పోటీలో తుక్కుగా ఓడిన కవిత ఇతర లీడర్లను గెలిపిస్తాననడం హాస్యాస్పదమని ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ ​అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్​లోని బీజేపీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. కవిత తర్వాత కేటీఆరే​వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ తర్వాత స్థానాల్లో హరీశ్ రావు, సంతోష్ ఉంటారన్నారు. ‘ఎలక్షన్​తర్వాత తెలంగాణలో ఆ ఫ్యామిలీ శకం ముగిసినట్టే. జీవితంలో గులాబీ ప్రభుత్వాన్ని చూడం. గజ్వేల్​లో కేసీఆర్​ఓడిపోతున్నడు.

బీఆర్ఎస్​కు 25కు మించి స్థానాల్లో గెలిచే పరిస్థితి లేదు. పోలింగ్​తర్వాత కౌంటింగ్ ​టైమ్​కు కాంగ్రెస్ ​నుంచి ఫిరాయింపులు ఉంటాయి. అది ఎవరి వైపు అనేది ఇప్పుడే చెప్పను. ఎలక్షన్​ తర్వాత స్టేట్​లో ఏర్పడేది ముమ్మాటికీ బీజేపీ గవర్నమెంటే. నా లోక్​సభ నియోజకవర్గం పరిధిలో అందరూ గెలిచే వారే. నన్ను ఓడించేందుకు కంకణం కట్టుకున్న కవితను కోరుట్లకు ఆహ్వానిస్తున్నా. ఆమె తిరిగితేనే నాకు సంతోషం.

ఆకుల లలితతో జిల్లాలో పెద్ద స్కెచ్ ​వేసి విఫలమైంది. కవిత లిక్కర్ ​స్కామ్ ​దర్యాప్తు ఆగలేదు. కోర్టు జోక్యంతో బ్రేక్ ​పడింది. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్​పట్ల కేసీఆర్ ​మెతక వైఖరికి కారణం ఏందో అర్థం చేసుకోవాలె. మాటకారి రేవంత్​ఎన్నికల్లో బాగా సంపాదిస్తుండు. బీజేపీలో పోటీ చేసేందుకు లీడర్లు ఎక్కువైండ్రు. అసంతృప్తి కామన్. పార్టీ ఎదిగితే ప్రజలకు మేలు జరుగుతుంది’ అని అర్వింద్ అన్నారు.