పాలమూరు బీజేపీలో టికెట్ల​ పంచాయితీ

పాలమూరు బీజేపీలో టికెట్ల​ పంచాయితీ
  • డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్  మధ్య పోటాపోటీ
  • మహబూబ్​నగర్​ ఎంపీ టికెట్​ను హోల్డ్​లో పెట్టిన హైకమాండ్

మహబూబ్​నగర్​, వెలుగు : పాలమూరు బీజేపీలో లీడర్ల మధ్య సయోధ్య కుదరడం లేదు. మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి, స్టేట్​ ట్రెజరర్​ శాంతికుమార్​ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి మధ్య పీఠముడి వీడకపోవడంతో, ఇటీవల ప్రకటించిన బీజేపీ ఫస్ట్​ లిస్టులో పాలమూరు స్థానం నుంచి క్యాండిడేట్​ను హైకమాండ్​ ప్రకటించలేదు.

ముందు నుంచి ఎవరి ప్రయత్నాల్లో వారు..

అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్  పాలమూరు పార్లమెంట్​ బీజేపీ టికెట్​ కోసం ప్రయత్నిస్తున్నారు. వీలు చిక్కినప్పుడుల్లా ముగ్గురూ హైకమాండ్​ వద్ద టికెట్​ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనికితోడు అరుణ, శాంతికుమార్​ పబ్లిక్​లో బిజీబిజీగా గడుపుతున్నారు. గత ఎన్నికల్లో అరుణ బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఈసారి కూడా టికెట్​ తనకే కన్ఫాం అవుతుందన్న ధీమాలో ఉన్నారు. 

ఈ క్రమంలో జనవరి నుంచే అరుణ పబ్లిక్​లో తిరుగుతున్నారు. తన పుట్టినిల్లు అయిన నారాయణపేట జిల్లాలోని ధన్వాడతో పాటు అదే జిల్లాలోని మరికల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. ఇటీవల ఆ పార్టీ నిర్వహించిన ‘విజయ్​ సంకల్ప యాత్ర’ను అదే జిల్లాలో ప్రారంభించారు. యాత్రలో అరుణ పార్లమెంట్​లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి టికెట్​ తనకే వస్తుందని ప్రజలకు సంకేతాలిచ్చారు. మరోవైపు శాంతికుమార్​ టికెట్​ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈయన కూడా జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఊరూరా తిరుగుతూ కేంద్ర పథకాలను వివరించడంతో పాటు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. 

ఆయనకు 2014లో ఎంపీ టికెట్​ వస్తుందని అందరూ ఆశించగా, చివరి క్షణంలో పార్టీలో చేరిన మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డికి హైకమాండ్​ అవకాశం కల్పించింది. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ టికెట్​ కన్ఫాం అనుకోగా, నామినేషన్​కు ఒక రోజు ముందు డీకే అరుణ పార్టీలో జాయిన్​ కావడంతో ఆమెకు టికెట్​ ఇచ్చారు. దీంతో ఈసారి తనకే టికెట్​ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. దీనికితోడు ఆ పార్టీలోని బీసీ లీడర్లు ఈసారి పార్లమెంట్ టికెట్​ను బీసీలకు ఇవ్వాలనే డిమాండ్​ను తెరమీదకు తెచ్చారు. పలు బీసీ సంఘాలు కూడా సపోర్ట్​గా పని చేస్తున్నాయి. అలాగే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా టికెట్ తనకే వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. 

1999 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన విజయం ద్వారా ఫస్ట్​ టైం పాలమూరు పార్లమెంట్​పై బీజేపీ జెండా ఎగిరింది. ఈసారి కూడా చాన్స్​తనకే వస్తుందని, మళ్లీ పార్లమెంట్​పై బీజేపీ జెండా ఎగరవేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. చివరి నిమిషంలోనైనా టికెట్​ సాధిస్తాననే ధీమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టికెట్​ ఎవరికి కేటాయిస్తారనే విషయంపై సస్పెన్స్​ కొనసాగుతోంది. 

చీలిపోతున్న క్యాడర్..​

బీజేపీలోని ముగ్గురు ప్రధాన లీడర్లు టికెట్​ కోసం ప్రయత్నిస్తుండడంతో క్యాడర్​ దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఎవరికి సపోర్ట్​గా వెళ్లినా మరో లీడర్​తో ఇబ్బందులొస్తాయనే ఆలోచనలో పడ్డారు. దీనికితోడు లీడర్ల వెంట ఏఏ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, ఇతర లీడర్లు తిరుగుతున్నారు? వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు? అనే వివరాలను తెలుసుకునేందుకు వీరంతా స్పైలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఎందుకొచ్చిన తలనొప్పుని క్యాడర్ పార్టీ కోసం కలిసి పని చేయకుండా, వారికి సపోర్ట్​గా ఉండే లీడర్ల వద్దే ఉండిపోతున్నారు.