దామగుండం ఫారెస్ట్ ఏరియాలో సీసీ కెమెరాలకు చిక్కిన పెద్దపులి

దామగుండం ఫారెస్ట్ ఏరియాలో సీసీ కెమెరాలకు చిక్కిన పెద్దపులి

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం దామగుండం ఫారెస్ట్ ఏరియాలో పెద్దపులి తిరుగుతుండడం కలకలం రేపుతోంది. రెండ్రోజుల కిందట దామగుండం ఫారెస్ట్ ఏరియాలో పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న రైతులకు పెద్దపులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం ఓ లేగ దూడను పెద్దపులి తిన్నట్లు ఫారెస్ట్ ఏరియా దగ్గరలోని గిరిజన తండా వాసులు గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు దామగుండ ఏరియాలో పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

కాగా, గురువారం సీసీ కెమెరాల్లో పెద్దపులి కనిపించినట్లు ఫారెస్ట్ అధికారి  జ్ఞానేశ్వర్ వెల్లడించారు. దామగుండం ఫారెస్ట్ ఏరియాలోకి ఎవరూ వెళ్లొద్దని, చీకటి పడక ముందే ఇండ్లకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఫారెస్ట్ ఏరియాకు దగ్గరలో ఉన్న గ్రామాలు, తండాల వాసులు  అప్రమత్తంగా ఉండాలన్నారు. తొందరలోనే పెద్దపులిని పట్టుకుని జూపార్కుకు తరలిస్తామని ఆయన చెప్పారు.