మళ్లీ పులి భయం.. కాగజ్‌‌నగర్‌‌ అడవిలో నెల రోజులుగా పెరిగిన పులి సంచారం

మళ్లీ పులి భయం.. కాగజ్‌‌నగర్‌‌ అడవిలో నెల రోజులుగా పెరిగిన పులి సంచారం
  • గతేడాది ఇదే సీజన్‌‌లో ఇద్దరిపై దాడి, మహిళ మృతి
  • ప్రస్తుతం పత్తి ఏరే సీజన్‌‌ కావడం, పులి సంచారం పెరగడంతో భయాందోళనలో ప్రజలు
  • పులి కదలికలను నిరంతరం ట్రాక్‌‌ చేస్తున్న ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు
  • ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

ఆసిఫాబాద్/కాగజ్‌‌నగర్, వెలుగు: ఆసిఫాబాద్‌‌ జిల్లా కాగజ్‌‌నగర్‌‌ ప్రాంతంలో మళ్లీ పులి భయం మొదలైంది. గతేడాది పత్తి చేనులో పనిచేస్తున్న ఇద్దరిపై పులి దాడి చేయగా.. ఓ మహిళ చనిపోయింది. ప్రస్తుతం మళ్లీ పత్తి చేతికొచ్చే సమయం కావడం, పది రోజులుగా పులి సంచారం పెరగడం, పశువులపై దాడి చేస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు.. ఈ సారి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

కాగజ్‌‌నగర్‌‌ అడవుల్లో పెరిగిన పులుల కదలికలు
మహారాష్ట్రలోని తడోబా – అంధేరి టైగర్‌‌ రిజర్వ్‌‌కు ఆనుకొని ఉన్న కాగజ్‌‌నగర్‌‌ అడవుల్లో ఐదేండ్లుగా పులుల కదలికలు పెరిగాయి. తడోబా అడవిలో పులుల సంఖ్య పెరగడంతో టెరిటోరియల్‌‌ను వెతుక్కుంటూ కాగజ్‌‌నగర్‌‌ అడవుల వైపు వస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న సిర్పూర్‌‌ టి రేంజ్‌‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు అటవీ శాఖ ఆఫీసర్లు గుర్తించారు. సిర్పూర్‌‌ టీ రేంజ్‌‌లోని ఇటికెల పహాడ్‌‌ ప్లాంటేషన్‌‌ నుంచి పులి రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో ఇటీవల నవేగాం గ్రామ సమీపంలోని అడవిలో పెద్ద పులి ఓ ఆవుపై దాడి చేసి హతమార్చింది. అలాగే కాగజ్‌‌నగర్‌‌ రేంజ్‌‌లోని ఈస్గాం బీట్‌‌లో పులి దాడిలో చనిపోయిన పశువు కళేబరాన్ని గుర్తించారు. 

అలర్ట్‌‌ అయిన ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు
గతేడాది నవంబర్‌‌ 29న కాగజ్‌‌నగర్‌‌ రేంజ్‌‌ పరిధిలోని వేంపల్లి సెక్షన్‌‌ ఈస్గాం బీట్‌‌ విలేజ్‌‌ నంబర్‌‌ 6, విలేజ్‌‌ నంబర్‌‌ 11 మధ్య ఉన్న పత్తి చేనులో పనిచేస్తున్న కాగజ్‌‌నగర్‌‌ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మిపై పులి దాడి చేయడంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాతి రోజే సిర్పూర్‌‌ టీ మండలం దుబ్బగుడ గ్రామానికి చెందిన రైతు సురేశ్‌‌పై పులి దాడి చేయగా.. త్రుటిలో తప్పించుకున్నాడు. 

మళ్లీ ఇప్పుడు పత్తి చేతికొచ్చే దశకు చేరడం, పులి సంచారం పెరగడంతో ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు అలర్ట్‌‌ అయ్యారు. మహారాష్ట్ర నుంచి సిర్పూర్‌‌ టీ రేంజ్‌‌లోకి పులుల ప్రవేశించే మాకిడి ప్రాంతంలో పులి కదలికలను గుర్తిస్తున్నారు. అలాగే ఇటికెల పహాడ్‌‌ ప్లాంటేషన్‌‌లో ఓ ఆడ, మరో మగ పులి సంచారాన్ని ఉన్నట్లు గుర్తించిన ఆఫీసర్లు వాటి కదలికలను నిరంతరం ట్రాకింగ్‌‌ చేస్తున్నారు. కొన్ని రోజులుగా కాగజ్‌‌నగర్‌‌ రేంజ్‌‌లో సంచరించిన పులి బుధవారం రాస్పల్లి సమీపంలో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. 

అవగాహన కల్పిస్తున్న ఆఫీసర్లు
కాగజ్‌‌నగర్‌‌ అడవుల్లో పులి సంచారం పెరగడంతో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. మేత కోసం పశువులను అడవికి తోలుకొని వెళ్లొద్దని, తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైతే.. గుంపులుగా, శబ్దాలు చేస్తూ వెళ్లాలని చెబుతున్నారు. అలాగే పులి లేదా ఇతర జంతువుల బొమ్మలతో ఉన్న మాస్క్‌‌ను తల వెనుక భాగంలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 

అడవికి సమీపంలో ఉన్న పత్తి చేన్లలోకి వెళ్లే రైతులు, కూలీలు ముందస్తుగా ఫారెస్ట్‌‌ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలని, దీని వల్ల అటువైపు నిఘా పెట్టడంతో పాటు, పులి కదలికలు ఉంటే ముందుగానే అలర్ట్‌‌ చేసే వీలు కలుగుతుందన్నారు. చేన్లలో పనిచేసే వారు గుంపులుగా ఉండాలని సూచిస్తున్నారు. పులులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.

పులులతో పాటు ప్రజల సంరక్షణకు కృషి చేస్తున్నాం 
కాగజ్‌‌నగర్‌‌ అడవుల్లో పులుల రక్షణతో పాటు, వాటి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించాం. ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. పులుల రక్షణకు ఎలక్ట్రిఫికేషన్‌‌ ప్రధాన సమస్యగా మారింది. దీంతో అడవుల గుండా ఉన్న విద్యుత్‌‌ వైర్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పులులతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు సహకరించాలి.


సుశాంత్‌‌ సుఖ్‌‌దేవ్‌‌ బోబడే, ఫారెస్ట్‌‌ డివిజనల్‌‌ ఆఫీసర్‌‌, కాగజ్‌‌నగర్‌‌