ఛత్తీస్​గఢ్​ నుంచి కలప అక్రమ రవాణా

ఛత్తీస్​గఢ్​ నుంచి కలప అక్రమ రవాణా
  • సుక్మా డీఎఫ్​వో సమాచారంతో దుమ్ముగూడెం వద్ద పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
  • ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన దళితబంధు వాహనంగా గుర్తింపు

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​దండకారణ్యం నుంచి తెలంగాణలోకి అక్రమంగా టేకు కలపను రవాణా చేస్తూ భద్రాచలం ఫారెస్ట్ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. ఛత్తీస్​గఢ్ లోని సుక్మా డీఎఫ్​వో ఇచ్చిన సమాచారంతో సోమవారం తెల్లవారుఝామున దుమ్ముగూడెం మండలం పెద్దకమలాపురం వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్షా38వేల 834 విలువ చేసే ఈ కలపను రేంజ్​ఆఫీసర్​ప్రసాద్ భద్రాచలం ఎఫ్ డీవో ఆఫీసుకు తరలించి పంచనామా చేశారు. సుక్మా జిల్లా ఎర్రబోరులో 10 టేకు దుంగలు లోడ్​తో తెలంగాణ వైపు తెస్తున్నట్లు సమాచారం అందింది.

భద్రాద్రికొత్తగూడెం డీఎఫ్ వో, భద్రాచలం ఎఫ్​డీవోలు టాస్క్ ఫోర్స్ టీంను రంగంలోకి దించారు. దుమ్ముగూడెం మండలం ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో వీరు ఆదివారం రాత్రి మాటు వేశారు. పత్తి బోరేలుతో వేగంగా వస్తున్న ట్రాలీ ఆటో ఆపినా ఆగకుండా వెళ్లిపోతుండడంతో వెంబడించారు. పెద్ద కమలాపురం వద్ద ఆటోను ఆపి డ్రైవర్, మరికొందరు పారిపోయారు. తనిఖీ చేయగా పత్తి బోరేల కింద టేకు దుంగలు ఉన్నాయి. ఆటో పేపర్స్ ప్రకారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన తుడుం తిరపతయ్యకు ఇటీవల దళితబంధు పథకంలో ఈ వాహనం కొన్నట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రేంజర్ ప్రసాద్ తెలిపారు.