నేను పార్టీ మారలేదు బాబోయ్.. కాంగ్రెస్ లోనే ఉన్నా : కాంగ్రెస్ సర్పంచ్ 

నేను పార్టీ మారలేదు బాబోయ్.. కాంగ్రెస్ లోనే ఉన్నా : కాంగ్రెస్ సర్పంచ్ 

తాను కాంగ్రెస్ పార్టీని వీడి.. బీఆర్ఎస్ పార్టీలో చేరలేదంటున్నారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ రామస్వామి. పరిగి ఎమ్మెల్యేనే బలవంతంగా తన మెడలో గులాబీ కండువా వేశారంటున్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీలో చేరాలని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

అసలేం జరిగిందంటే..? 

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పల్లె బాట కార్యక్రమం చేపట్టారు. తిమ్మాపూర్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు తమ గ్రామ సమస్యలు చెప్పేందుకు సర్పంచ్ రామస్వామి దగ్గరకు వెళ్లాడు. గ్రామం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలని, తమ పార్టీలో చేరాలని చెప్పి.. ఎమ్మెల్యే తన మెడలో బలవంతంగా గులాబీ కండువా కప్పారని సర్పంచ్ రామస్వామి ఆరోపించారు. 

ALSO READ: పరిగి ఎమ్మెల్యేకు మరో పరాభవం.. గ్రామానికి రావొద్దని అడ్డుకున్న ప్రజలు

బీఆర్ఎస్ పార్టీ కండువా వేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి.. వైరల్ చేస్తున్నారని ఎమ్మెల్యే మహేష్ రెడ్డిపై సర్పంచ్ రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీలో చేరాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడలేదని, ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని.. ఇలా సర్పంచులను ప్రలోభ పెట్టడం సరికాదని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.