తీన్మార్ మల్లన్నకు అత్యధిక మెజార్టీ ఇవ్వాలి

తీన్మార్ మల్లన్నకు అత్యధిక మెజార్టీ ఇవ్వాలి
  •     కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, నాయకులు

ఖమ్మం టౌన్/జూలూరుపాడు/కల్లూరు/పాల్వంచ రూరల్, వెలుగు  : ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న గెలుపు ఖాయమని, అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, పలువురు నాయకులు పిలుపునిచ్చారు.  శనివారం జూలూరుపాడులోని పార్టీ కార్యాలయంలో వైరా ఎమ్మెల్యే రాందాస్​నాయక్, కల్లూరులోని డీఎన్పీ ఫంక్షన్ హాల్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్,  పాల్వంచలో డీసీఎంఎస్​ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు కొత్వాల శ్రీనివాసరావు,  ఖమ్మంలో పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడారు.

నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో గత బీఆర్ఎస్ సర్కారు విఫలమైందన్నారు. మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అసమర్దత వల్లే ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుద్యోగ యువతను మోసం చేసిన బీజేపీ, బీఆర్​ఎస్​కు పట్టభద్రుల ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కావాలంటే తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు.

కల్లూరులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పాల్వంచలో భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, జూలూరుపాడులో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బోర్రా రాజశేఖర్, లేళ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.