తిరుమల బ్రహ్మోత్సవాలు: స్వర్ణరథంపై ఊరేగిన కోనేటి రాయుడు

తిరుమల బ్రహ్మోత్సవాలు: స్వర్ణరథంపై ఊరేగిన కోనేటి రాయుడు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavalu) కన్నులవిందుగా సాగుతున్నాయి. శ్రీవారిని వాహన సేవలో తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల వద్దకే శ్రీనివాసుడు వచ్చే ఉత్సవం కావడంతో ఆ దేవదేవుని అనుగ్రహం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఆరవ రోజు (సెప్టెంబర్ 23)  ఉదయం శ్రీ మలయప్ప స్వామి రామచంద్రమూర్తిగా భక్తులకు అభయం ప్రసాదించాడు. సాయంత్రం స్వర్ణ రథంపై సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి శ్రీదేవిభూదేవి సమేతుడై విహరించారు.  గజ వాహనంపై మోక్షాన్ని., సిరిసంపదలను అందించేది నేనే అంటూ అభయ ప్రధానం చేశారు.

శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ‌నివారం (సెప్టెంబర్ 23)  సాయంత్రం శ్రీవారు స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు. భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య స్వర్ణర‌థోత్సవం అత్యంత వైభ‌వంగా జరిగింది.  స్వర్ణరథంపై పయనిస్తూ, భక్తుల్ని కృపాకటాక్షాలతో శ్రీవారు అనుగ్రహించారు.

భక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో స్వర్ణ ర‌థోత్సవం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు.

స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారి కరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వసిస్తుంటారు. స్వర్ణ ర‌థోత్సవంలో టీటీడీ ఈవో  ధ‌ర్మారెడ్డి దంప‌తులు, దిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.