ఏడుకొండల వాడికి ఎరువాడ జోడు పంచెలు

ఏడుకొండల వాడికి ఎరువాడ జోడు పంచెలు

రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా జరిపేందుకు టీటీడీ (TTD) భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్స వాలు జరుగనున్నాయి. ప్రధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబరు 1న గరుడ సేవ, 2న స్వర్ణ రథం, 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం జరుగుతాయి. మొదటి రోజైన సెప్టెంబర్ 27న ఏపీ సీఎం వైఎస్. జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎంతో పవిత్రంగా భావించే ‘ఏరువాడ జోడు పంచెలు’ తిరుమల శ్రీవారికి కానుకగా అందాయి. గద్వాల సంస్థానం నల్ల సోమనాథ్ భూపాల్ నేటి వరకు ఈ పంచెలను అందిస్తూ వస్తున్నారు.

400 ఏళ్ల చరిత్ర...
స్వామివారికి ఈ జోడు పంచెలను ఇవ్వటం వెనుక 4వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుత గద్వాల్ సంస్థానం వారసురాలిగా ఉన్న శ్రీలతా భూపాల్ జోడు పంచెలను శ్రీవారికి పంపే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గద్వాల సంస్థానాదీశుల తరపున మహంకాళి కరుణాకర్  కొన్నేళ్లుగా తన ఇంట్లో ఈ ఎరువాడ జోడు పంచెలను తయారు చేయిస్తున్నారు. సహజంగా నేత మగ్గంలను ఇద్దరు కలిసి నేస్తారు. కానీ ఈ మగ్గం ముగ్గురు ఒకేసారి నేసేలా ఉంటుంది. మొత్తంగా ఐదుగురు ఈ పనిని పూర్తి చేస్తారు. దీనిని నామాల మగ్గం అంటారు. శ్రావణమాసంలో పని ప్రారంభించి 41 రోజులపాటు ఎంతో నియమనిష్టలతో ఈ పంచెలను నేతన్నలు నేస్తారు. ఉపవాసాలు, గోవిందనామ స్మరణతో మగ్గం నేస్తుంటారు. ఏరువాడ పంచె సుమారు 11 గజాల పొడవు, 85 ఇంచుల అంచు, 3 గజాల వెడల్పు ఉంటుంది. రాజ కట్టడాలకు గుర్తుగా 8 కోటకొమ్మ నగిషీతో సుందరంగా, కళాత్మకంగా తయారు చేస్తారు. తయారీకి 20 రోజుల సమయం పడుతుంది. 

తుంగభద్ర, కృష్ణానది మధ్యన...
గద్వాల్ నగరం తుంగభద్ర, కృష్ణానది మధ్యన ఉన్నందున ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రెండు నదుల మధ్య ఉండే గద్వాల్ లోని చేనేత మగ్గాలపై ఈ జోడు పంచెలను తయారు చేస్తారు. అలా రెండు ఏరువాడల మధ్యలో తయారవుతాయి. అందుకే ఏరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి కెక్కినట్లు చెబుతుంటారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రోజున శ్రీవారి మూల విరాట్ విగ్రహానికి ఏరువాడ జోడు పంచెలను అలంకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారికి ఎన్నో కానుకలు అందుతుంటాయి. కానీ గద్వాల నుంచి వచ్చే జోడు పంచెలు అన్నింటి కంటే విశిష్టమైన కానుకలు. స్వామి వారికి జోడు పంచెలు తయారు చేయటం తమ పూర్వజన్మ పుణ్యమని తయారీదారులు వెల్లడిస్తున్నారు. గద్వాల సంస్థానం నుంచి అందిన ఈ పంచెలను ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు అలంకరిస్తారు. అలా స్వామివారికి అలంకరించిన వాటిలో ఓ పంచెలను శేషవస్త్రంగా వాడి, శ్రీవారి ప్రసాదాలను కానుకగా గద్వాల సంస్థానానికి పంపటం తిరుమల ఆలయ సంప్రదాయం.