
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ( సెప్టెంబర్ 29) రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ గజాలు మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి, వైష్ణవి నేతృత్వంతో మలయప్ప స్వామి వాహన సేవల వైభవాన్ని పెంచాయి. రంగురంగుల అలంకారాలతో గజవాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తులకు కనువిందు చేశాయి.
ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును నిద్ర లేవగానే దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరోరోజు ( సెప్టెంబర్ 29) తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతారు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుందని పండితులు చెబుతున్నారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.