తిరుమల బ్రహ్మోత్సవాలు.. మోహిని అవతారంలో గరుడ వాహనంపై శ్రీవారు

తిరుమల బ్రహ్మోత్సవాలు.. మోహిని అవతారంలో గరుడ వాహనంపై   శ్రీవారు

 తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ( September 28) ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తుల ఆశీర్వదించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

మోహిని  అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెప్పారని పురాణాల ద్వారా తెలుస్తుంది. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడు, ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 ఇక ఆదివారం (సెప్టెంబర్​ 28)  ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చిన శ్రీనివాసుడు.. సాయంత్రం సాయంత్రం 6.30 గంటల నుంచి స్వామివారు గరుడవాహనంపై  తిరుమాఢ వీధుల్లో విహరించనున్నారు. విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్పస్వామివారు కటాక్షిస్తారు.

పురాణాల ప్రకారం శ్రీవారి గరుడ సేవను వీక్షించడానికి ముక్కోటి దేవతలు తిరుమలకు తరలి వస్తారని విశ్వాసం. 108 వైష్ణవ దివ్యదేశాల్లో...  గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.  జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయి. 

ఆదివారం శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా.. గోగర్భం డ్యామ్ సర్కిల్ దగ్గర్లో ఉన్న ఆక్టోపస్ భవనం వరకూ క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని, టోకెన్లు లేని భక్తులకు మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ వెల్లడించింది.